H-1b Visa:ట్రంప్ ఏం చేయబోతున్నారో అన్న టెన్షన్.. ఇండియాకు వచ్చేందుకు జంకుతున్న ఎన్నారైలు!
ABN, Publish Date - Jan 13 , 2025 | 06:14 PM
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్ వలసలపై ఏం నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఆంక్షలు మరింత కఠినతరం కావొచ్చన్న ఆందోళనతో భారతీయ హెచ్-1బీ వీసా దారులు దేశం వీడేందుకు జంకుతున్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో అమెరికా అధికార పగ్గాలు చేపట్టనున్న ట్రంప్ వలసల విధానం ఎలా ఉంటుందో తెలీక అనేక మంది విదేశీయులు టెన్షన్ పడిపోతున్నారు. ఒకసారి అమెరికా దాటితే మళ్లీ తిరిగొచ్చేందుకు అడ్డంకులు ఏర్పడొచ్చన్న భయంతో సోంత దేశాలకు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. ఈ పరిస్థితి భారతీయులపై అధికంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఇండియాలో ఉన్న వారిని త్వరగా తిరిగి రావాలంటూ కంపెనీలు, విద్యాసంస్థలు పిలుపునిచ్చాయని ఎన్నారైలు కొందరు మీడియాకు తెలిపారు. జనవరి 20 లోపే అమెరికాకు తిరిగొచ్చేయాలని తమకు సూచనలు అందినట్టు చెప్పుకొచ్చారు (NRI).
హెచ్-1బీ వీసా విషయంలో ట్రంప్ మద్దతుదారులు రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి వారు హెచ్-1బీ వీసాకు జైకొడుతుండగా మిగిలిన వారు మాత్రం స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా ఈ వీసాకు పరిమితులు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
New Zealand Visa Rules: కార్మికుల కొరత.. న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో కీలక మార్పులు
భారత సంతతి వెంచర్ క్యాపిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌కు ట్రంప్ ప్రభుత్వం ఏఐ సలహాదారు పదవి లభించడంతో ట్రంప్ మద్దతుదారుల దృష్టి ఒక్కసారిగా హెచ్-1బీ వీసా వైపు మళ్లింది. వలసల విషయంలో శ్రీరామ్ గత స్టేట్‌మెంట్లను ప్రస్తావిస్తున్న ట్రంప్ మద్దతుదారులు హెచ్-1బీ వీసాపై పరిమితులు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్‌లో పుట్టిపెరిగిన శ్రీరామ్ కృష్ణన్ 2007లో అమెరికాకు వెళ్లారు. అక్కడ మైక్రోసాఫ్ట్‌లో కొంత కాలం పనిచేశాక అమెరికా పౌరసత్వం పొందారు. ప్రస్తుతం వెంచర్ క్యాపిటలిస్టుగా ఉన్నారు.
Jagdeep Singh: ప్రపంచంలో అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఉద్యోగి మనోడే! శాలరీ ఎంతో తెలిస్తే..
ఇక ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. వలసలపై ఉక్కుపాదం తప్పదని గతంలో అనేక సందర్భాల్లో పేర్కొన్న ట్రంప్ ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో వలసల అనుకూల వ్యాఖ్యలు చేశారు. మేధావులను ఈ దేశంలోకి ఆహ్వానించాలని అన్నారు. దీంతో, తదుపరి ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2023లో హెచ్-1బీ వీసాలు పొందిన, రెన్యూ చేసుకున్న వృత్తినిపుణుల సంఖ్య 278,148. వీరిలో 72 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఇక హెచ్-1బీ వీసా ఉన్న భారతీయుల్లో మూడింటి రెండొంతుల మంది కంప్యూటర్ సంబంధిత జాబ్స్ చేస్తున్నారు. భారతీయ హెచ్-1బీ వీసాదారుల సగటు శాలరీ 118,000 డాలర్లని తేలింది.
NRI: లండన్‌లో రియల్ ఎస్టేట్ ఆస్తులున్న వర్గాల్లో భారత సంతతి వారే టాప్!
Updated Date - Jan 13 , 2025 | 06:18 PM