Donald Trump రూటే సపరేటు..
ABN , Publish Date - Jan 19 , 2025 | 09:27 AM
ప్రపంచంలో ఏం జరిగినా అమెరికాకు వార్త కాదు కానీ.. అమెరికాలో చీమ చిటుక్కుమన్నా ప్రపంచానికి వార్త అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అగ్రరాజ్యం అదే కాబట్టి!. అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే మాటలా? ఆ అరుదైన అవకాశం డోనాల్డ్ ట్రంప్‌నకు దక్కింది.

ప్రపంచంలో ఏం జరిగినా అమెరికాకు వార్త కాదు కానీ.. అమెరికాలో చీమ చిటుక్కుమన్నా ప్రపంచానికి వార్త అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అగ్రరాజ్యం అదే కాబట్టి!. అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే మాటలా? ఆ అరుదైన అవకాశం డోనాల్డ్ ట్రంప్‌నకు దక్కింది. అయితే మనం రోజువారీ చదివే పత్రికలు, చూసే టీవీల్లో ట్రంప్‌పైన వస్తున్నదంతా రాజకీయ సమాచారం మాత్రమే! ఆయన మూలాల్లోకి.. ఇంకా పూర్వీకుల కుటుంబంలోకి వెళితే.. ఆశ్చర్యకర, అద్భుత వలస పోరాటం కనిపిస్తుంది. డబ్బు, పరపతి సంపాదించడం కోసం చేయరాని పనులన్నీ చేసిన తెంపరితనం అబ్బురపరుస్తుంది. అలాంటి కుటుంబంలో పుట్టిన ట్రంప్.. అందుకే అంత దూకుడుగా కనిపిస్తాడు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా రేపు (జనవరి 20న) డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా.. ఆయన కుటుంబ వ్యాపార నేపథ్యంపై ఈ వారం కవర్‌స్టోరీ..
రోమన్ సామ్రాజ్యంలో భాగమైన ‘కాల్‌స్టాడ్’ అనే గ్రామం ఫ్రెంచ్ విప్లవ సమయంలో ఫ్రెంచ్ రిపబ్లిక్ వశమైంది. వరుసగా ఆస్ట్రియా, బవేరియా పాలనలోకి వెళ్లి నాజీ జర్మనీ పాలనలోకి వచ్చింది ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కుగ్రామం కాల్‌స్టాడ్. ఆ పల్లెలో ద్రాక్ష సారాయి కాచి సైనికులకు సరఫరా చేసేవారు ‘క్రిస్టియన్ జోహన్నెస్ డ్రంఫ్, కేథరీనా కోబెర్ దంపతులు.
కొడుకు ‘ఫ్రెడరిక్’ ఆరేళ్ల ప్రాయం నాటికే జోహన్నెస్ మరణించాడు. కౌమారంలోనే కత్తికటారూ పట్టి ద్రాక్ష తోటల్లో తల్లికి తోడునీడగా పనిచేస్తూ పొయ్యిలోకి కట్టెకంప, పొయ్యి పైకి గింజగట్రా తీసుకొచ్చి తాపత్రయ పడేవాడు. అయినా అరాకొర ఆదాయం... అప్పులే ఆధారం. చేసేది లేక కత్తెర చేతబట్టి క్షురక వృత్తి చేపట్టాడు. ఊరంతా కలిపి వంద తలకాయలే ఉండడంతో నిరాశే మిగిలింది. అతుకుల బొతుకుల జీవితంతో విరక్తి చెంది కూలీనాలి కోసం ఊరి కుర్రోళ్ళు అమెరికా వలస వెళ్లడం ఫ్రెడెరిక్‌ని ఆలోచింపచేసింది. దేశం వదిలితే కానీ దశ మారదని అవగతమయి.. దోస్తుల దోవ బట్టాడు. చెబితే వద్దంటుందని, తల్లికి చెప్పా పెట్టకుండా ఓ అర్ధరాత్రి హాంబర్గ్ నౌకాశ్రయం చేరుకొని అమెరికాకు సరుకులు సరఫరా చేసే రవాణా ఓడ ఎక్కాడు 16 ఏళ్ల ఫ్రెడరిక్.
‘‘నీ పూర్తి పేరేమిటి?’’ అని అడిగిన నౌకాధికారికి ‘ఫ్రెడరిక్ డ్రంఫ్’ అని చెప్పాడు. వలస కార్మికులతో ఓడ కోలాహలంగా మారడంతో వందల ఆకలికడుపుల రణగొణ ధ్వనుల మధ్య ఆ అధికారికి ‘ఫ్రెడరిక్ ట్రంప్’ అని వినబడి అదే నమోదు చేసుకున్నాడు. అలా యాదృచ్ఛికంగా ఆనాడు ‘డ్రంఫ్’... అనే పేరు కాస్త ‘ట్రంప్’గా మారిపోయింది. ఇంటి పేరు మారిన ఆ వేళా విశేషం గొప్పదవ్వొచ్చు.. ట్రంప్ పేరు సంచలనం సృష్టించింది. ఎన్నో చారిత్రక పరిణామాలకు సాక్ష్యంగా నిలిచిన ఊరిలో బానిస బతుకులు బతికిన కుటుంబం విడిచిపెట్టి స్వేచ్ఛా ప్రపంచానికి వలన వెళ్లడం వలనే నేడు అగ్ర రాజ్యానికి తన మనవడు ‘డొనాల్డ్ జాన్ ట్రంప్’ చక్రవర్తి అయ్యాడు.
రెడ్‌లైట్ ఏరియాలో..
పులికి ఏ అడవి అయినా ఒక్కటే. చేతిలో ఉన్న విద్యే ఆయుధం, పెట్టుబడిగా చేసుకుని... న్యూయార్క్ రోడ్ల మీద క్షవరాలు చేస్తూ వలస కార్మికుల శిబిరాలలో తలదాచుకున్నాడు. సర్రుమని తెగే పదునైన కత్తెర.. ఆరితేరిన అనుభవం, చేయితిరిగిన పనితనంతో కస్టమర్ల కరుణ పొందాడు. అమెరికన్ల అనుగ్రహం అందుకోవడానికి ఆంగ్లం నేర్చుకున్నాడు. వాషింగ్టన్‌లోని సియాటెల్ నగరంలో బంగారు గనులు బయటపడటంతో వేల మంది ప్రజలు అక్కడికి వలస వెళ్లారు. తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి పశ్చిమతీరానికి ప్రయాణం కట్టాడు ఫ్రెడరిక్ (1891). తండోపతండాలుగా తరలివచ్చి గనుల తవ్వకాలు చేస్తున్నారక్కడ. అందరిలా, రోజుల తరబడి తవ్వకాలు కొనసాగించినా కనకం కరుణిస్తుందనే హామీ లేదు.. అందుకే ఎదురుచూడటం అనవసరం అనిపించింది.
పుత్తడిని పొందడానికి పోటీపడీ పారలతో పరిగెత్తుగొస్తున్న ప్రజల పరిస్థితులు పరిశీలించాకా పాదరసంలాంటి పరికల్పన పుట్టింది. సమీపంలో ఉన్న రెడ్ లైట్ ఏరియాలో పాడుబడిన ఇంటిని అద్దెకు తీసుకుని రెస్టారెంట్‌గా మార్చాడు. అలసిపోయి సొమ్మసిల్లిపోయిన గని కార్మికులకు బ్రాందీ, భోజనం ఏర్పాటు చేసేవాడు. లాభాలను కళ్ళ చూశాకా మరో భవనం కొనుగోలుచేసి వ్యభిచార గృహంగా మార్చాడు. ‘నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు.. తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు’ అన్న చందాన కస్టమర్లను ఆకట్టుకునేవాడు. ‘బ్రాందీ, భోజనం, బ్రోతల్’ వ్యాపారం పుంజుకుని పసిడిని మించి మెరిసింది. 1890లలో, బంగారం నిక్షేపాలు దొరికిన మోంటే క్రిస్టో, వాషింగ్టన్ బ్రిటిష్ కొలంబియా, కెనడా వంటి ప్రదేశాలలో రెస్టారెంట్లను ప్రారంభించి ‘మందు-మటన్-మగువ’ల వ్యాపారంలో సంపన్నుడయ్యాడు ఫ్రెడరిక్. కొన్నాళ్లకు వ్యభిచార నిర్మూలన చట్టం అమలులోకి రావడంతో వ్యాపారాన్ని విక్రయించి వివాహబంధంతో గౌరవప్రదమైన కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు. రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి నష్టపోయాడు.
నిర్మాణరంగంలోకి..
భార్య ఎలిజబెత్ 1905లో ప్రసవించిన బిడ్డకు ‘ఫ్రెడ్ ట్రంప్ జూనియర్’ అని పేరు పెట్టాడు ఫ్రెడరిక్. తండ్రితో పాటూ గృహ నిర్మాణ ప్రాంతాలకు వెళుతూ నిర్మాణ రంగంపై మక్కువ పెంచుకున్నాడు ముక్కుపచ్చలారని ఫ్రెడ్ ట్రంప్. కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద భారీగా పెట్టుబడి పెట్టి కొడుక్కి నిర్మాణ బాధ్యత అప్పగిద్దామనుకునున్నాడు. విధి మరోలా తలచింది.. దేశవ్యాప్తంగా ఫ్లూ మహమ్మారి విజృంభించి ఫ్రెడరిక్‌ని న్యుమోనియా నిర్జీవంగా మార్చింది (1918).
వెనకేసిన సొమ్మంతా వెచ్చించిన ఆ భారీ ప్రాజెక్ట్ పురిటిలోనే సంధి కొట్టింది. కథ మళ్లీ మొదటికొచ్చి ఆ కుటుంబాన్ని బికారులను చేసింది. చీలికలు పేలికలు అయిన బతుకుని బాగుచేసుకోడానికి కుట్టు మెషీన్ కొని టైలరింగ్ చేసింది తల్లి ఎలిజబెత్. ప్రాతఃకాలంలో పాలు, పేపర్ల డెలివరీ బాయ్‌గా, పగలంతా కూడలిలో బూట్ పాలిష్ చేస్తూ, రాత్రిపూట రిసార్ట్స్‌లో రూమ్ సర్వీస్ బాయ్‌గానూ రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడేవాడు 18 ఏళ్ల ఫ్రెడ్ ట్రంప్ జూనియర్.
రాత్రీపగలూ రెక్కాడించి డాలర్లతో డొక్క నింపుకొంటున్నా ఏదో తీరని వెలితి.. తెలియని దాహం.. నిర్మాణ రంగం మీద అతనికున్న ఆపేక్షే ఆకలి రూపంలో మనస్సుని దహించివేస్తోంది. ప్లంబింగ్, వడ్రంగి వృత్తిలో నైపుణ్యాలు, ఇళ్ల నిర్మాణ ప్రణాళిక రూపొందించడం, నిర్మాణ వ్యయం అంచనా వేయడం వంటి వాటిలో శిక్షణా తరగతులు తీసుకున్నాడు. తమ ఇంటి ఆవరణలో కార్ల గ్యారేజీని నిర్మించడానికి అవకాశం ఇచ్చాడు.. ఫ్రెడ్ అభిరుచికి ఊపిరి పోయాలనుకున్న పొరుగింటి ఆసామి గ్యారేజీ అందంగా ఆకృతి దాల్చడంతో గుండె లోతుల్లోని నమ్మకం రెట్టింపయింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కార్ గ్యారేజీల వ్యాపారంలోకి దిగాడు. ముందుగా నిర్మించిన గ్యారేజీలను ధనవంతుల ఇళ్ల ముందు అమర్చేవాడు. ఒక బిల్డర్ వద్ద వడ్రంగి పని చేసే అవకాశం వచ్చింది. రెండేళ్లలో సూపర్ వైజర్‌గా ఎదిగి భవన నిర్మాణంలో కిటుకులు వంటబట్టించు కున్నాడు. తల్లి భాగస్వామిగా ‘ఎలిజబెత్ ట్రంప్ సన్’ కనస్ట్రక్షన్ సంస్థకు శంకుస్థాపన చేసి సొంతంగా ఇళ్లు నిర్మించే వ్యాపారానికి పునాది వేసుకున్నాడు 22 ఏళ్ల ఫ్రెడ్.
పుట్టుకతోనే ధనవంతుడు..
గ్రేట్ డిప్రెషన్ (1929 ఆర్థిక మాంద్యం) అమెరికాని కుదేలు చేస్తున్న సమయమది. అయినా కుంగిపోలేదు. న్యూయార్క్‌లో పది ఎకరాలలో ‘ట్రంప్ మార్కెట్’ అనే మార్కెట్ యార్డు నిర్మించి సూపర్ మార్కెట్‌లకు విక్రయించాడు. ఆలా ఆర్జించిన లాభాలను విజయానికి నిచ్చెనగా చేసుకుని రియల్ ఎస్టేట్ రంగంలోకి దూసుకుపోయాడు. అప్పులేని గంజి అమృతంతో సమానం... కాబట్టి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అప్పు చేయకుండా వ్యాపారాన్ని విస్తరించాడు.
అనామకంగా ఉన్న వ్యక్తి కాస్తా ఇప్పుడు ప్రముఖుడయ్యాడు. విజయంతో పాటూ గుర్తింపు, పలుకుబడి, ఖరీదైన స్నేహాలు, విందులు సహజమే కదా. ఒక వ్యాపారవేత్త ఇంటికి విందుకెళ్ళినప్పుడు అక్కడ పనిమనిషి గా చేస్తున్న మేరీ మాక్లియోడ్, ‘ఫ్రెడ్’ మనసు దోచింది.
స్కాట్లాండ్ దేశస్తురాలైన ఆ అపురూప సౌందర్యవతిని పెండ్లాడాడు (1936). 1941 డిసెంబర్ 7న హవాయిలోని పెరల్ హార్బర్‌పై జపాన్ బాంబు దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధానికి శంఖారావం పూరించింది అమెరికా. సూక్ష్మబుద్ధి ఉన్నవారికి సంక్షోభమూ ఒక అవకాశమే. అమెరికాదళం కోసం బ్యారక్‌లు, భవనాలు నిర్మించాడు ఫ్రెడ్. 1945లో యుద్ధం ముగియడంతో వేల మంది సైనికులు అమెరికాకు తిరుగుముఖం పట్టారు. సైనికుల పునరావాసం కోసం చాకచక్యంగా అపార్ట్‌మెంట్‌లను నిర్మించాడు. ఫ్రెడ్-మాక్లియోడ్‌లకు ఐదుగురు పిల్లలు పుట్టారు. జూన్ 14, 1946 నాడు దేశమంతా జాతీయ జెండా ఆవిష్కరణ దినోత్సవం జరుపుకొంటుండగా (ఫ్లాగ్ డే) తమకు నాల్గవ సంతానంగా పుట్టిన కొడుక్కి ‘డొనాల్డ్ జాన్ ట్రంప్’ అని పేరు పెట్టుకున్నారు. పుట్టుకతోనే ఆగర్భశ్రీమంతుడైన డొనాల్డ్ బాల్యం 23 గదులున్న భవంతిలో గడిచింది.
పిల్లలందరిలోకి హుషారుగా, చురుకుగా ఉండే డొనాల్డ్ ట్రంప్ అంటే తండ్రికి ముద్దెక్కువ. ఐదేళ్ల వయస్సు నుండే తండ్రితో కలిసి నిర్మాణంలో ఉన్న భవంతులకు వెళ్లి శ్రద్ధగా గమనించేవాడు. 13 ఏళ్లకు టిప్పర్ లారీలు, బుల్డోజర్ నడపడం నేర్చుకుని సైట్‌లో సిబ్బందిని ఆశ్చర్యచకితులను చేశాడు. జిత్తులమారితనం, చొరవ, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, పోటీతత్వం, కుశాగ్రబుద్ధి, నేర్పరితనం ఆ కుర్రాడి సొత్తు. అందుకే ఇంట్లో అన్నయ్య-అక్కలు తమ్ముడి మీద అజమాయిషీ చేసేవాడు. బడిలో కూడా స్నేహితులందరినీ అనుచరులుగా చేసుకున్నాడు. ఐదేళ్లప్పుడే ఇరుగు-పొరుగు పిల్లలపై చేయి చేసుకుంటూ, వికృతచేష్టలతో నియంత్రించలేని అల్లరి చేస్తూ ఆ వీధికి సమస్యాత్మకంగా తయారయ్యాడు డొనాల్డ్. చాంతాడంత చాడీల చిట్టా, ప్రవాహంలా ఫిర్యాదులొచ్చినా తల్లిదండ్రుల గారాబం ముందు బలాదూర్ అయ్యేవి. చేసేదిలేక ‘రౌడీ డొనాల్డ్’ అని ముద్రవేసి తమ పిల్లలు అతనితో సహవాసం చేయకుండా బహిష్కరించారు చుట్టుపక్కలవారు. మెల్లగా తల్లిదండ్రులకు కళ్ల పొర తొలగి, కొడుకు ప్రవర్తనపై ఆందోళన పడ్డారు.
‘‘బడుద్దాయికి భయం-భక్తి-బాధ బోధపడాలంటే బోర్డింగ్ బడే బెస్ట్’’ బావురుమన్నారు బేజారెత్తిపోయిన బంధువులు. పక్కనే ఉన్న ప్రతిష్టాత్మక ‘క్యూ-ఫారెస్ట్ స్కూల్’ కమిటీ సభ్యుడిగా, ప్రధానదాతగా ఉన్నాడు డొనాల్డ్ తండ్రి ఫ్రెడ్. డొనాల్డ్‌కు క్రమశిక్షణ చాలా సున్నితంగా అలవడాలి కాబట్టి తన నిర్వహణలో ఉన్న ఆ బడిలోకి డొనాల్డ్‌ని వేశాడు తండ్రి. కోడికి గజ్జెలు కడితే కుప్ప కెళ్లగించకుండా ఉంటుందా? బాలికలపై సోడా చిమ్మడం, ఇంకు చల్లడం, టీచర్ ముఖంపై నీళ్లు కురిపించడం వంటి హింసాత్మక చేష్టలు చేశాడు ఏడేళ్ల డొనాల్డ్. తన తండ్రికి ఆ స్కూల్ యాజమాన్యం దాసోహం కావడంతో బడిలో డొనాల్డ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు. అల్లరి చిల్లరిగా తిరిగినా... బేస్‌బాల్, ఫుట్‌బాల్, సాకర్ ఆటలమీద అభిరుచి పెంచుకుని క్రీడల్లో ముందంజలో ఉండేవాడు.
వినయం లేని ప్రతిభ వ్యర్ధమే కదా. ఆ కుర్రోడి ధనస్వామ్య దాదాగిరీకి నిరసనగా బడి పిల్లల తల్లిదండ్రుల పోరాటానికి తలొగ్గిన యాజమాన్యం ఎనిమిదో తరగతిలో డొనాల్డ్‌కి టీసీ ఇచ్చి బడి నుండి పేరు తొలగించింది. ఖాళీ బుర్ర సైతాన్‌ల కార్ఖానా కదూ? ఇంట్లో చెప్పకుండా మిత్రుడితో న్యూయార్క్‌లోని ‘బ్రాడ్‌వే థియేటర్’లో నాటకం చూసొచ్చి బటన్ నైఫులు కొని నాటకంలోని కథానాయకుడి సన్నివేశాలు అనుకరించడానికి దారిదోపిడికి సంసిద్ధవుతుండగా పోలీసులకు పట్టుబడ్డాడు 13 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్. అప్పటికి గానీ తల్లిదండ్రులు మేల్కోలేదు. కొరకరాని కొయ్యగా మారిన కొడుకుని ‘న్యూయార్క్ మిలిటరీ అకాడమీ’ అనే సైనిక స్కూల్‌లో వేయక తప్పలేదు.
అలా కట్టడి చేస్తే కానీ..
డొనాల్డ్ పొగరుని అణచివేసి.. తను కోటీశ్వరుడి కొడుకన్న సంగతి మరచిపోయేలా అక్కడ శిక్షకులు, కఠినమైన వాతావరణం, కఠోరమైన శిక్షణ, బడితపూజకు భయపడి క్రమశిక్షణతో వ్యవహరించి రాటు తేలాడు. సత్ప్రవర్తన, నాయకత్వ లక్షణాల ఫలితంగా అకాడమీలో అత్యున్నత ర్యాంక్ ‘క్యాడెట్ కెప్టెన్’ పొందాడు. సైనిక పాఠశాల పుణ్యమాని నడత నడవడిక మారింది.. భవితకు బాట పడింది. ఇంటర్మీడియట్ కూడా పూర్తయ్యింది. ‘ఫోర్ట్‌హామ్ విశ్వవిద్యాలయం’లో గ్రాడ్యుయేషన్ ప్రారంభించాడు (1964). ఖరీదైన బట్టలు, లగ్జరీ కారుతో కాలేజ్‌కి వచ్చే డొనాల్డ్ చుట్టూ అమ్మాయిలు మూగేవారు. రోజుకో పిల్లతో చెట్టాపట్టాలు వేసుకుని షికారు చేసే డొనాల్డ్ మీద తోటి అబ్బాయిలకు అసూయ కలిగేది. స్త్రీలోలత్వం మూలంగా గ్రంథసాంగుడు, తిరుగుబోతు అనే అర్ధం వచ్చేలా కాసనోవా, ప్లేబాయ్, లేడీస్ మ్యాన్, లేడీ-కిల్లర్, ఫిలాండరర్ అని బిరుదులు పొందాడు. తండ్రి తృప్తి కోసం పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్‌కు బదిలీ చేసుకుని పట్టభద్రుడయ్యాడు. ఇంతలో, వియత్నాం యుద్ధం రాజుకుంది. అమెరికా పౌరుడిగా సైన్యంలో చేరి ఆ యుద్ధంలో పాల్గొనాల్సొచ్చింది. కాలి మడమలలో లోపం మూలంగా వైద్య పరీక్షలో విఫలమయ్యాడు.
తండ్రి చేస్తున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో చేరాడు ట్రంప్. అప్పటికే కొన్నేళ్లుగా చేస్తున్న ఆ వ్యాపారాన్ని న్యూయార్క్ నగరానికే పరిమితం చేశాడు తండ్రి. ఒక రోజు ‘‘నాన్నా.. బావిలో కప్ప మాదిరి ఒకే ప్రదేశంలో ఉంటే ప్రపంచాన్ని ఎలా జయించగలం?’’ అని తండ్రిని ఒప్పించి ఒహియోలోని సిన్సినాటిలో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ కట్టే బాధ్యత తీసుకున్నాడు డొనాల్డ్. కంపెనీని విస్తరించడానికి ఈక్విటీ రుణాలను సేకరించాడు. సంస్థ పేరుని ‘ఎలిజబెత్ ట్రంప్ సన్’ నుండి ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా మార్చేశాడు. న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఆకాశహార్మ్యాలను నిర్మించి జనాదరణ, గుర్తింపు పొందాడు. తన వ్యాపార సామ్రాజ్యానికి సరైన వారసుడు ఇతడే అని గుర్తించిన తండ్రి.. కొడుకైన డొనాల్డ్‌కి పగ్గాలు అప్పగించాడు. ట్రంప్ ఆర్గనైజేషన్ అధినేతగా అమెరికా నలుమూలలా 14,000 అపార్ట్‌మెంట్లను నిర్మించాడు. గృహనిర్మాణానికే ఎందుకు పరిమితమవ్వాలి? అన్న ప్రశ్న తొలిచేసింది. అలా 1976లో న్యూయార్క్‌లో ‘గ్రాండ్ హయత్ హోటల్’ను నిర్మించి విజయప్రస్థానంలో మరో మెట్టు చేరుకున్నాడు.
న్యూయార్క్ నడిబొడ్డున ప్లాజా హోటల్‌ను కూడా కొనుగోలు చేశాడు. బార్బిజోన్-ప్లాజా హోటల్‌ను కొనుగోలు చేసి, పునరుద్ధరించి ‘ట్రంప్ పార్క్’ అని పేరు మార్చాడు. వందేళ్ల చరిత్ర గల ‘వైస్రాయ్ హోటల్’ని కొని పునరుద్ధరించి ‘ట్రంప్ పార్క్ అవెన్యూ’ లగ్జరీ కండోమినియంలుగా మార్చాడు. అనేక హోటళ్లు, ఎస్టేట్‌లు, గోల్ఫ్ కోర్సులు, క్లబ్బులు, రిసార్ట్‌లు, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హౌసింగ్ ప్రాజెక్టులను నిర్మించడం లేదా కొనుగోలు చేయడం ద్వారా ‘రియల్ ఎస్టేట్ మొగల్’గా ఎదిగాడు ట్రంప్. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లతో రూపొందించి నిర్మించిన 58 అంతస్తుల ఆకాశహార్మ్యం (1983లో) న్యూయార్క్ నగరానికి వన్నె తీసుకొచ్చింది. చుక్కల్లో చంద్రుడుగా నిలిచిన ఆ భవనమే ‘ట్రంప్ టవర్’. ఆ నిర్మాణ స్ఫూర్తితో అనేక అత్యాధునిక, అద్భుతమైన నిర్మాణాలు చేపట్టడానికి దోహదపడింది.
న్యూజెర్సీలో అట్లాంటిక్ నగరంలో ‘హాలిడే ఇన్ హోటల్స్‌తో కలిసి ‘హర్రాస్, 600 గదుల ట్రంప్ ప్లాజా హోటల్’ నిర్మించాడు. అక్కడితో ఆగిపోలేదు. జూదం వ్యాపారం లాభదాయకమైనదని 60వేల చ. అడుగులలో క్యాసినోలు ప్రారంభించాడు. న్యూజెర్సీలోని నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత ఆడంబరమైన ‘ట్రంప్ తాజ్ మహల్ క్యాసినో అండ్ రిసార్ట్’ (1990) ప్రపంచంలోని ఎనిమిదో అద్భుతంగా కొనియాడబడింది. అప్పులపాలైన డొనాల్డ్ కొన్నేళ్ళకు నష్టాలను తట్టుకోలేక తాజ్ మహల్ మూసివేశాడు. మాన్‌హట్టన్‌లో 76 ఎకరాల భూమిని కొనుగోలు చేసి మీడియా ఉద్యోగుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పన్నెండు ఆకాశహర్మ్యాలు, మాల్‌ను నిర్మించడానికి పూనుకున్నాడు. ఈ లోపల డొనాల్డ్ దివాళా దిశవైపు వెళ్లడంతో ఆ ‘టెలివిజన్ సిటీ’ ప్రాజెక్ట్ దశ తిరగలేకపోయింది. 1990లలో, డొనాల్డ్ వెంచర్లు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. 1990- 2010 మధ్య ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ నాలుగుసార్లు దివాళా ప్రకటించినా మనుగడ కోల్పోలేదు. చట్టాల లొసుగులు తెలిసిన డొనాల్డ్ వ్యక్తిగతంగా దివాళా తీయలేదు పైగా సంపద పెంచుకున్నాడు.
‘
మిస్ యూనివర్స్, ‘మిస్ యూఎస్‌ఎ’, ‘మిస్ టీన్ యూఎస్‌ఎ’ వంటి అందాల పోటీల నిర్వహణ సంస్థను కూడా స్థాపించాడు. మోడల్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభించి మంత్రముగ్ధులను చేసే మహిళలను మోడలింగ్ ప్రపంచానికి పరిచయం చేశాడు. రియల్ ఎస్టేట్ రంగంలో శిక్షణ, తర్ఫీదు ఇవ్వడానికి ‘ట్రంప్ యూనివర్శిటీ’ని స్థాపించాడు. ‘న్యూజెర్సీ జనరల్స్’ అనే ఫుట్‌బాల్ లీగ్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసి క్రీడారంగంలోకి ప్రవేశించాడు. అనేక బాక్సింగ్ మ్యాచ్‌లను, సాకర్ క్లబ్, మోటార్ రేస్‌లను నిర్వహించాడు. మైక్ టైసన్‌కు ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించాడు. పబ్లికేషన్, రియాలిటీ-టీవీ షోలు, సినిమా నిర్మాణం, టీవీ సీరియళ్ల ప్రొడక్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి వ్యాపారాలను చేపట్టి మీడియా రంగాన్ని కూడా శాసించాడు.
రెస్టారెంట్లు, బార్లు, తినుబండారాలు వంటి వ్యాపారంలో కూడా విజయం వరించింది. ‘కూడు.. గూడు.. జోడు... కాదేదీ కంపెనీకనర్హం’ అని అనుకున్నాడేమో కానీ ‘ట్రంప్ ఐస్’ బ్రాండ్ మీద మినరల్ స్ర్పింగ్ వాటర్‌ని ప్రారంభించి దేశమంతా లభ్యపరిచాడు. ఆయన పేరే అత్యంత ప్రసిద్ధి చెందిన బ్రాండ్. అనేక సంస్థలకు, ఉత్పత్తులకు తన పేరును పెట్టుకోడానికి లైసెన్స్ ఇచ్చి రాయల్‌గా రాయల్టీ పొందుతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ సాహసోపేతమైన వ్యాపారవేత్త.. కానీ ట్రంప్ సంస్థల ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకత లోపిస్తుంది. ముఖ్యంగా పన్ను వివాదాలు, ఆరోపణలు, వివక్షాపూరితమైన వ్యాపార విధానాలు, వాజ్యాలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి.
అవకాశాలు వచ్చినా..
ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, అమెరికాకి అక్రమ వలసలు, మెక్సికో నుండి మాదకద్రవ్యాలను అమెరికాలోకి అక్రమ తరలింపు వంటి అంశాలపై డొనాల్డ్ ఆది నుండి కారాలు మిరియాలు నూరేవాడు. ఆ కారణమే అతన్ని రాజకీయాల వైపుకి మళ్లించింది. 1988లో, జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ పై అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పి చివరివరకు మీనమేషాలు లెక్కపెట్టాడు డొనాల్డ్. న్యూయార్క్‌కు రిపబ్లికన్ పార్టీ తరపున గవర్నర్‌గా పోటీ చేయమని డొనాల్డ్‌ని కోరింది. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి కాబట్టి భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పాడు. 2012 ఎన్నికల బరిలోకి దిగడానికి సంసిద్ధుడయ్యాడు. ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టించిన ఒబామాకు ప్రజాదరణ పదింతలు పెరిగింది. తాను ఓడిపోవడం ఖాయం అని తెలిసి డొనాల్డ్ విరమించుకున్నాడు. ఏదైతేనేం.. 2016 ఎన్నికలలో ఎట్టకేలకు అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచాడు.
చర్చనీయాంశమైన అభిప్రాయాలు, ఉద్వేగభరితమైన ఉపన్యాసాలు, ఇబ్బందికర చేష్టలు, సంచలన ప్రకటనలు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తలలో నిలుస్తాడు.
చొరబాటుదారులను నియంత్రించడానికి మెక్సికో సరిహద్దు చుట్టూ ఒక గోడను నిర్మిస్తానని హెచ్చరించాడు. విదేశాల నుండి అమెరికాకి వచ్చి పురుడు పోసుకున్నంత మాత్రాన పుట్టిన బిడ్డలు పౌరులుగా మారడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టాడు. తాను అధ్యక్షుడైతే, అక్రమ వలసదారులను తన్ని తరిమేయటానికి ప్రత్యక దళాన్ని ఏర్పాటు చేస్తానని హెచ్చరించాడు. ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా చూడాలంటే విదేశీ ముస్లింలందరినీ యుఎస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించాలని ప్రతిపాదన పెట్టిన డోనాల్డ్‌ని దుయ్యబట్టారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో డోనాల్డ్‌ట్రంప్ జీవితంలో. అమెరికాతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోలేకపోతే 51వ యుఎస్ రాష్ట్రంగా కెనడా కలిసిపోతుందని డొనాల్డ్ ట్రంప్ కెనడాకి ముక్కుసూటిగా చెప్పాడు.
తన వివాదాస్పద మాటలు, విస్మయపరిచే చేష్టలు, ఆశ్చర్యపరిచే హావభావాలతో ట్రంప్ ప్రత్యేకత సంతరించుకున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో డొనాల్డ్‌ట్రంప్ అనేక ప్రత్యేకతలున్న అధ్యక్షుడు అని చెప్పకతప్పదు.
- సునీల్ ధవళ, 97417 47700, సీయీవో,
ద థర్డ్ అంపైర్ మీడియా అండ్ అనలిటిక్స్