Kerala Temple: మగాళ్లకు మాత్రమే..
ABN, Publish Date - Feb 09 , 2025 | 08:47 AM
అందమైన చీరకట్టు, నుదుట కుంకుమ బొట్టు, చేతికి గాజులు, తలనిండా పూలు... సాంప్రదాయ కట్టుబొట్టుతో కనిపించే వాళ్లంతా మగవాళ్లే అంటే క్షణకాలం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

అందమైన చీరకట్టు, నుదుట కుంకుమ బొట్టు, చేతికి గాజులు, తలనిండా పూలు... సాంప్రదాయ కట్టుబొట్టుతో కనిపించే వాళ్లంతా మగవాళ్లే అంటే క్షణకాలం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక గుడిలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం కోసం ఆ విధంగా తయారయ్యారు. ఇంతకీ ఏమిటా గుడి? ఏమా కథ??
చమయవిళక్కు ఉత్సవం... కేరళలోని కొల్లాం జిల్లాలో శ్రీ కొట్టంకులంగర దేవి ఆలయంలో ప్రతీ ఏటా ఘనంగా జరుగుతుంది. మార్చి నెలలో దాదాపు 19 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాంప్రదాయ ఆచారంలో భాగంగా చివరి రెండు రోజుల్లో పురుషులు చీరలు, లంగావోణీలు ధరించి, ధగధగ మెరిసే ఆభరణాలతో అందంగా అలంకరించుకొని పాల్గొంటారు. కులమతాలకు అతీతంగా, అన్ని వర్గాలకు చెందిన పురుషులు చేతిలో దీపాలు పట్టుకొని, సాంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్తారు.
పురుషులు స్త్రీ వేషధారణతో అమ్మవారి రథాన్ని పూలతో సిద్ధం చేసి, తర్వాత ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆ విధంగా మహిళల్లా అలంకరించుకొని, పూజలు చేస్తే అమ్మవారు సంతోషించి, కోరిన కోర్కెలు తీరుస్తుందనేది భక్తుల నమ్మకం. ఈ ఉత్సవంలో భాగంగా పగటిపూట పదేళ్లలోపు వయసున్న అబ్బాయిలందరూ అమ్మాయిల మాదిరిగా ముస్తాబై దీపారాధనలో పాల్గొంటారు. ప్రధానఘట్టం మాత్రం సాయంత్రం ప్రారంభమై తెల్లవారుజాము దాకా కొనసాగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహించే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
మేకప్‌కు ప్రత్యేక గదులు
ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మగవాళ్ల మీసం, గెడ్డం తీసేసి పురుషులను అందంగా ముస్తాబు చేసేందుకు అక్కడ కొందరు బ్యూటీషియన్లు కూడా అందుబాటులో ఉంటారు. ఆలయ ప్రాంగణంలో వీరి అలంకరణ కోసం ప్రత్యేక గదులుంటాయి. అవసరమైతే అధికారులు పురుషులకు దుస్తులు కూడా అందిస్తారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వందలాది మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు బంధువులు, స్నేహితులతో వచ్చే పురుషుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందట. ఈ ఉత్సవం చివరి రోజు అందంగా ముస్తాబైన మగవాళ్లకు పోటీలు కూడా నిర్వహిస్తారు. వారిలో బాగా ఆకట్టుకున్నవారికి బహుమతులూ ఉంటాయి.
ఎలా మొదలైందంటే...
ఆలయంలో మగవాళ్లు చీర కట్టుకొని పూజ చేసే సంప్రదాయం ఈనాటి కాదు. దీనికి శతాబ్దాల చరిత్రే ఉంది. ఈ ఆచారం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల కిందట కొందరు పిల్లలు ఆవులు మేపడానికి అడవికి వెళ్లారట. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ, దానిపక్కనే రాయి కనిపించింది. వారు కొబ్బరికాయను ఆ రాయితో కొట్టగా... అనూహ్యంగా రాయి నుంచి రక్తం చుక్కలు కారడాన్ని గమనించారు. ఆ పిల్లలు భయపడి, పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగిన విషయాన్ని పెద్దలకు తెలిపారు. గ్రామ పెద్దలంతా చర్చించుకుని ఓ జ్యోతిషుడిని సంప్రదించగా ‘ఆ రాయిలో వనదుర్గ శక్తి దాగుంద’ని, వెంటనే ఆలయం నిర్మించమని చెప్పాడు. మొదట్లో కొంతమంది పశువుల కాపరులు అమ్మాయిల మాదిరిగా అలంకరించుకొని అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం అలా కొనసాగుతూ వచ్చిందని చెబుతారు.
మరో కథ ప్రకారం కొందరు పశువుల కాపరులు ఆడపిల్లల వేషం వేసుకొని, తాము దైవంగా పూజించే రాయి చుట్టూ ఆడుకునే వారు. ఒక రోజు ఆ రాయి నుంచి అమ్మవారు ప్రత్యక్షమవ్వడాన్ని వాళ్లు కళ్లారా చూశారు. దాంతో అక్కడే గుడి కట్టించి, పురుషులే స్ర్తీల వేషధారణతో అమ్మవారిని ఆరాధించే ఆచారం ప్రారంభమైందని అంటారు. ఏదేమైనా పురుషులు మహిళల్లా అందంగా ముస్తాబై పూజలు చేయడం విశేషమే కదా!
Updated Date - Feb 09 , 2025 | 01:30 PM