ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆమె ఒక ప్రహేళిక

ABN, Publish Date - Jan 12 , 2025 | 11:46 AM

ఆమెని చూసినప్పుడల్లా నాకనిపిస్తుంటుంది, చినిగి ఛిద్రమైన, ఒక పురాతన స్వప్నాన్నేదో కప్పుకుని తిరుగుతుంటుందని! మొదటిరోజు ఆమెని చూసినప్పుడు, ఆమె కట్టుకున్న ముదురాకుపచ్చ నేత చీర, కింద తడికి నాని మట్టంటిన బూడిదరంగు లంగా, పైన ఇటుక రంగు జాకెట్టు, వీటితో కప్పబడిన బలమైన శరీరం, పెద్ద కళ్ళు,

ఆమెని చూసినప్పుడల్లా నాకనిపిస్తుంటుంది, చినిగి ఛిద్రమైన, ఒక పురాతన స్వప్నాన్నేదో కప్పుకుని తిరుగుతుంటుందని!

మొదటిరోజు ఆమెని చూసినప్పుడు, ఆమె కట్టుకున్న ముదురాకుపచ్చ నేత చీర, కింద తడికి నాని మట్టంటిన బూడిదరంగు లంగా, పైన ఇటుక రంగు జాకెట్టు, వీటితో కప్పబడిన బలమైన శరీరం, పెద్ద కళ్ళు, ఆ రెండింటి మధ్య సన్నని ముక్కూ, మధ్యలో వేలాడుతున్న బులాకి, అడ్డ చుట్ట తాగి తాగి మధ్యలో తెల్ల బడిన బండ పెదాలూ, కుడి బుగ్గన ఎప్పుడూ కారాకిళ్ళీ, అది ఊయడానికి చెంగున కట్టిన గిన్నె, నుదుటిన పావలాకాసంత బొట్టు.. మొదటిరోజు పసుపురంగు ఏక్టివా మీద బర్రుమని వస్తున్న ఆమెని చూసినప్పుడు అలా చూస్తుండిపోయాను.

కానీ, ఈ నెలరోజుల్లో ఆమెని చూసినప్పుడల్లా ఇవేమీ ఆమె కాదనిపించేది.

తేడా వస్తే ఎదురుగా ఉన్నది ఎవరని కూడా చూడకుండా దులిపేస్తుండేది. ఆమేనా అసలు మనిషి!


జయలక్ష్మి!

వస్తూవస్తూనే కనీసం అటూఇటూ చూడకుండా చరచరా బాత్రూంల్లోకి వెళ్ళి మునుపటిరోజు ఆగమంతా కడిగి వెళ్తూ వెళ్తూ రిజిస్టర్‌లో సంతకం పెట్టి అదే వేగంతో వెళ్ళి పోయేది. సంతకం పెట్టేటప్పుడు నీళ్ళల్లో నాని, ఏసిడ్‌తో కొరికినట్టుండే ఆమె వేళ్ళు పరీక్షగా చూసేదాన్ని. రాన్రానూ ఆమె నాకొక ప్రహేళిక.

ఎప్పుడైనా ఫినాయిల్‌ అయిపోయిందనో, చీపురు కొత్తది కావాలనో మా రాజు నడిగినప్పుడే ఆమె గొంతు వినపడేది. గరగరమంటున్న మోటు స్వరం.

ఒక నెలరోజుల తర్వాత ఓరోజు నెమ్మదిగా అడిగాను. ‘‘జయలక్ష్మీ! నీకు వీలైనప్పుడు వస్తావా మా బాత్రూములు కడగాలి.’’

ఇక్కడకి ట్రాన్స్‌ఫర్‌ అయివచ్చిన ఈ నెల రోజుల్లో అదే మొదటిసారి ఆమెతో మాట్లాడ్డం. తలెత్తి నా మొహంవేపు కూడా చూడలేదు.

‘‘ఎప్పుడు రమ్మంటారమ్మా!’’


‘‘నీ ఇష్టం’’ అన్నాక అడ్రస్‌ కనుక్కుని తర్వాత ఆదివారం వచ్చింది.

రెండు బాత్రూంలూ, వాష్‌బేసిన్లూ కడిగేసి, వంటింట్లో సింక్‌ కూడా శుభ్రంగా కడిగేసి, డబ్బులు తీసుకుని కొంగులో ముడేసుకుని వెళ్ళబోతుంటే ‘‘టీ తాగుదువు వుండు’’ అంటూ కూర్చోబెట్టాను.

‘‘పనిచేసి పెడతావా’’ పొయ్యిమీద డికాషన్‌ పెడుతూ అడిగాను.

‘‘నానా?!’’

‘‘నువ్వే. ఆశ్చర్యం ఎందుకు? తూర్పా! ఏ వూరు!’’ యాస ఆసక్తిగా అనిపించింది.

‘‘అవునమ్మా.. మీకు తెలుసేటా వూర్లు?’’

‘‘గరివిడిలో కొన్నాళ్ళు చదువుకున్నాలే.. మీవూరేది?’’

‘‘పాలకొండ.’’

‘‘ఎప్పుడొచ్చావిక్కడికి’’ డికాషన్‌లో పాలు పోస్తూ..

‘‘పదేను సమ్మచ్చరాలు దాటిపోనాదమ్మా.’’


‘అదీ విషయం. అందుకే పూర్తిగా తూర్పు భాష పూర్తిగా లేదు.’’

‘‘ఏవైనా తూర్పు వాళ్ళు చాలా మంచోళ్ళు తెలుసా..’’

పొయ్యి కట్టేసి రెండు కప్పుల్లో టీవడకట్టాను.

‘‘మంచోళ్ళేనమ్మా.. ఆళ్ళని మోసం సేయడవూఁ వీజీయే’’ నవ్వింది.

మొదటిసారి ఆ మొహంలో నవ్వు చూడ్డం!

కిళ్ళీ వల్ల గారపట్టిన పళ్ళు. అయినా భలే వుంది.

‘‘ఇంతకుముందు ఇంట్లో పనులు నేనే చేసుకునేదాన్ని. ఈ మధ్య ఇదిగో ఈ మణికట్టు నొప్పి. అందుకే బాత్రూం కూడా కడగలేదీ మధ్య’’ ఇల్లు శుభ్రంగా లేదన్న గిల్ట్‌కి సంజాయిషీగా చెప్పాను.

‘‘అదేటీ కాదులేయమ్మా. అక్కడా ఇక్కడా చేసుకోవద్దేటి. అయినా పీతులెత్తేదాని సేత పనులు సేయించుకుంతరా’’ మాటల్లో అనుమానం.


‘‘అదేం మాట?’’ కోప్పడి, ‘‘నీకు వీలున్నప్పుడు వచ్చి చేయి. నీకైతే ఒక సెట్‌ తాళాలిచ్చేయొచ్చు. నాకూ నమ్మకంగా వుంటుంది’’ ఎక్కడ కుదరదంటుందో అనే భయం నాది!

టీ తాగి, కప్పు సింక్‌లో వేసి, గిన్నెల మీద కాసిని నీళ్ళు చిలకరించుకుని తోమడం మొదలెట్టింది. హమ్మయ్య! ఊపిరి పీల్చుకుని అడిగాను ‘‘జీతం ఎంత తీసుకుంటావు?’’

‘‘మీ యిస్టవఁమ్మా. నానెప్పుడైనా సేసానా.. సెందానా’’ మళ్ళీ నవ్వింది.

జయలక్ష్మిని పనిలో పెట్టుకున్నానని తెలిశాక ఆఫీసులో ఇద్దరుముగ్గురు నొసలు ఎగరేశారు. ఒక కొలీగ్‌ ఇంకొంచెం ముందడుగేసి చెప్పింది, ‘‘జాగ్రత్త మేడం అది పెద్ద గద్దరది. దీని నోటికి దడిసి మొగుడు కూడా పారిపోయాడు.’’

ఆదివారాలు తప్ప జయలక్ష్మి ఇంట్లో పెద్దగా కనిపించేది కాదు. ఆఫీసుకి వచ్చినప్పుడు, సంతకం పెట్టేటప్పుడు మెల్లగా నవ్వి వెళ్లిపోయేది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు అద్దంలా మెరిసిపోయేది.


ఒకరోజు ఆదివారం పనయ్యాక వెళ్ళబోతుంటే అడిగాను.

‘‘డబుల్స్‌ నడుపుతావా జయలక్ష్మీ! కూరగాయలు తెచ్చుకోవాలి.’’

‘‘ఈరోజుకినేవేటమ్మా. రేపొద్దున నేను తేనేటి.. ప్రెస్సుగుంతాయ్‌.’’

‘సరే’ అన్నాక ‘టీ పెడుతున్నా కాసేపు కూచోమ’ని లోపలికి వెళ్ళాను.

నాతోపాటే వచ్చి గట్టానుకుని నుంచుంది.

‘‘ఎప్పుడూ అడుగుదాం అనుకుంటాను పిల్లలెంతమంది జయా?’’

‘‘ఇద్దరమ్మా.. ఆడు పది.. పాప ఇంటరు.’’

‘‘మీ ఆయన?’’ ఆఫీసులో అన్నారు గానీ అయినా అడగాలనిపించింది.

జయలక్ష్మి ఏం చెప్తుందో అని ఆసక్తి.

‘‘నాతో లేడమ్మా. ఇంకో దాయిని సేసుకున్నాడు.’’

‘‘రెండో పెళ్ళా !?’’


‘‘కాదమ్మా మూడోది. నేనే రెండోదాన్ని.’’

‘‘రెండో పెళ్ళి వాడ్ని ఎందుకు చేసుకున్నావు!?’’

‘‘మొదటిదాయి మంచిదికాదని నన్ను సేసుకున్నాడు. నేనప్పుడడగలేదు. ఇప్పుడేటడుగుతాను’’ సారం మొత్తం రెండు ముక్కల్లో చెప్పేసింది.

జయలక్ష్మి వెళ్ళాక ఏదో చదువుకుంటుంటే కొత్త నంబర్‌ నుండి ఫోన్‌!

‘‘హెలో..’’

వంటి మీద గొంగళిపురుగు పాకినట్టు జలదరింపు. వెంటనే కట్‌చేసి ఆ నంబర్‌ బ్లాక్‌ చేశాను. తెలీని నంబర్లు ఎత్తడం మానేసి చాలారోజులయ్యింది. ఈరోజు జయలక్ష్మి ఆలోచనల్లోనే ఉండి ...

ఎన్నాళ్ళిలా!

పదేళ్ళ క్రితం అప్పుడు పని చేస్తున్న బ్రాంచ్‌లో పరిచయం అతను. కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. ఒక్కసారిగా వచ్చిన స్వేచ్ఛ. చేతినిండా డబ్బులు. సరదాగా కాఫీ షాపుల్లో మొదలైన స్నేహం. ఆ తర్వాత ఎలాంటి మలుపులు తీసుకుందో.. మనసూ, శరీరం స్పృహలోకి వచ్చేటప్పటికే నాతో కేవలం టైంపాస్‌ స్నేహమని అర్థమైంది. అతను పెళ్ళైన వాడని తెలిసినా నేనెందుకు స్నేహం చేశానో అందులో నాకేం ఆకర్షణ కనిపించిందో.. ఇప్పుడు ఆలోచించినా అర్థం కాదు. అతను లేని జీవితం వృథా అనిపించేది. అమ్మా, నాన్నా తమ్ముడూ వీళ్ళెవరూ అక్కర్లేనంత.


ఆ రిలేషన్‌లోంచి బయటకి రావడానికి యుద్ధం చేస్తుండగానే చుట్టూ చేరిన తీర్పులు, అమ్మా నాన్నా తమ్ముడితో పెరిగిన దూరం.

మనం బయట పడినా చుట్టూ ఉన్న సమాజం మనల్ని అదే కళ్ళతో చూస్తుంది. నేను కొత్త చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అయితే నాకన్నా ముందే నా గతం వచ్చి కూచునేది. ‘నాకేమన్నా అవకాశం వుంటుందా’ అని ఎదురు చూసేవాళ్ళు కొందరైతే, డేగ కళ్ళతో మనల్ని అబ్జర్వ్‌ చేసేవాళ్ళు మరికొందరు.

ఇవన్నీ ఒకెత్తయితే కొత్తచోటుకి వెళ్ళినప్పుడల్లా ‘‘ఇదిగో నీ గురించి అక్కడందరికీ తెలుసు. నీకెప్పటికైనా నేనే దిక్కు’’ అన్నట్టు అతని పరోక్ష హెచ్చరింపులు.

వాట్సప్‌లో మెసేజ్‌ అలర్ట్‌ వస్తే తేరుకుని చూశాను. మళ్ళీ ఆ నంబర్‌ నుండే!

‘‘కొత్త బ్రాంచ్‌ ఎలా ఉంది. నీకేం అవసరం అయినా నాకు చెప్పు. అక్కడ ఉన్నవాళ్ళంతా నా ఫ్రెండ్సే.’’

చదువుతుండగానే ఇంకో మెసేజ్‌.

‘‘డీపీలో భలే ఉన్నావ్‌. రోజురోజుకీ అందం పెరుగుతోంది.’’

ఒక లవ్‌ ఎమోజీ.


కాల్‌ బ్లాక్‌ చేస్తే వాట్సప్‌ బ్లాక్‌ అవ్వదా! వెంటనే రిపోర్ట్‌ కొట్టి బ్లాక్‌ చేశాను.

కొత్త బ్రాంచ్‌లో కూడా నీగురించి అందరికీ తెలుసన్న హెచ్చరిక కాబోలు.

ఎన్నాళ్ళు పరిగెత్తాలి! ఎక్కడికని పరిగెత్తాలి?!

ఈరాత్రికి టాబ్లెట్‌ వేసుకుంటేగానీ నిద్ర పట్టదు.

పొద్దున్నే భరించలేని ఒళ్ళు నొప్పులు. జయలక్ష్మికి ఫోన్‌ చేశాను.

‘‘జయా! ఒళ్ళునొప్పులు. జ్వరం వచ్చేట్టుంది. ఈరోజు ఇంట్లోనే వుంటాను. నీ పనయ్యాక ఒకసారి ఇంటికి వస్తావా?’’

అరగంటలో పరిగెత్తుకొచ్చింది.

రాగానే నుదురు పట్టుకుని చూసి, ‘‘ఓలమ్మో.. ఒల్లేటమ్మా పేలిపోతన్నాదీ’’ ఒక నిమిషం తోచనట్టు అలా నిలబడిపోయి, ‘‘టీ ఎట్టమంటారేటమ్మా’’ సంశయిస్తున్నట్టు అడిగింది.


‘‘పెట్టు ప్లీజ్‌.’’

ఒక్క అంగలో వంటింట్లోకి వెళ్ళింది.

కాసేపయ్యాక ప్లేట్‌లో ఒక దోశ పెట్టుకుని వచ్చింది.

‘‘ఇంకేటీ దొరకనేదమ్మా. నూనె ఒక్క బొట్టన్నా యేఁనేదు.’’

నా చేతిలో ప్లేట్‌ పెట్టి, నేను తినే లోపు టీ తెచ్చింది.

‘‘ఇదేటమ్మా ఇంకా తినలేదూ. మాత్రేసాక తినకపోతే ఎలా?’’ నా టీ గ్లాస్‌ మీద మూత పెట్టి, తన గ్లాస్‌ పట్టుకుని మంచం ఆనుకుని కూచుంది.

బలవంతంగా సగం దోశ ముక్క తిని టీ గ్లాస్‌ తీసుకున్నాను. ఇంత అల్లం దట్టించి ఘాటుగా వున్న టీ తాగుతుంటే హాయిగా అనిపించింది.

కాళ్ళు పొట్టలోకి ముడుచుకుని, దుప్పటికప్పుకుని కూచుని, ‘‘ఆఫీసుకెళ్ళవా?’’ జయవేపు తిరిగి అడిగాను.


‘ఒక్క రోజుకి ఏటుందిలేయమ్మా! రేపు కడగనేటి’’ ముక్కుపుటాలెగరేసింది.

అలా కదిలినప్పుడు ముక్కుదూలానికి వేలాడుతున్న ఎరుపూ తెలుపూ రాళ్ళున్న రింగ్‌.

‘‘జీతం పోతుంది కదా’’ పనిచేసిన రోజుకి వందరూపాయలు ఇస్తారు.

‘‘ఆ ఏటుందిలేమ్మా. కట్టుకుపోతామేటి. పిల్లలగురించి కాపోతే ఈపాటికి ఎగ్గొట్టీనా?’’

‘‘నీ ముక్కు రింగ్‌ భలే వుంటుంది. ఏమంటారు దీన్ని బులాకి కదా..’’

‘‘అవునమ్మా..’’

‘‘బరువుగా అనిపించదా? ఇప్పుడు కూడా ఇంతింత లావువి పెట్టుకుంటున్నారా?’’

‘‘మాది పార్వతీపురం పక్కన ఒడియా అమ్మా. అక్కడ కొండోల్లం మావు. సిన్నప్పుడే కుడతారమ్మా. అక్కడ నుండి పాలకొండ వచ్చాం.’’

‘‘నీగురించి ఇంకా చెప్పు జయా’’ ఆమె గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఆమె కళ్ళల్లో చుట్టూ జనాల పట్ల నిరసన, ఆమె మాటల్లో ధిక్కారం, అంతలోనే తను ఇష్టపడే మనుషుల మీద ఆమెచూపించే ప్రేమ... చెప్పానుగా ఆమె ఒక ప్రహేళిక.

‘‘నాగురించి చెప్పేకేటున్నాదమ్మా. ఆణ్ణి నమ్ముకుని దేశం ఒగ్గీసొచ్చాను. నన్నాడొగ్గీసి దేశాలొట్టుకుని ...’’ (పెద్ద బూతు మాట)


‘అబ్బా ఇది ఇంతకుముందు చెప్పావులే జయమ్మా కొత్త విషయం చెప్పు.’’

‘‘జొరం వొగ్గిసినాదమ్మా. పడుకోండి కాసేపు’’ మాట మార్చింది.

‘‘కాదు.. ప్లీజ్‌’’ నేనింక వదలను అనుకుంది కాబోలు మొదలు పెట్టింది.

‘‘మాయమ్మ పనిచేసీకాడే సేసీవోడమ్మా. మాయమ్మకి పేనం బావులేనప్పుడు నానెల్లీదాన్ని. అలా కుదిరాక, మాయమ్మనొగ్గీసి నానెల్లీదాన్ని. పెల్లాం రోగిస్టిదనీ తిండికి ఆవురంటాడనీ సెప్పీది మాయమ్మ. రాన్రానూ ఆడికోసవే నానెల్లడం మొదలెట్టేను. ఆడికోసం రకరకాల నీసు కూరలు ఒండిచ్చుకునెల్లీదాన్ని. వోసే జయమ్మా! నువ్వు నా దేవతవే అనీవోడు. నెలొగ్గిసానని తెలిసాక మాయమ్మ నన్ను బాదీసినాది..’’

‘‘ఆగాగు! నెలొగ్గీయడమంటే’’ అర్థం కాలేదు నాకు.

‘‘అదేనమ్మా నెలతప్పినప్పుడు..’’ మళ్ళీ మొదలెట్టింది.


‘మాయమ్మ బాదీసింది. గదిలోంచి ఒగ్గనేదు. అయినా నానూరుకోనేదు. మాయమ్మ లేనప్పుడు సూసి ఆడింటికి పారిపోయి కూకున్నాను. ఆడి పెళ్ళాం ఏడిసింది. దాని కూతురు సమ్మచ్చరం పిల్ల. దాన్ని తలుపు బయట అడ్డంగా పడుకోబెట్టీసినాది. ఆడూ కొంచువైనా సలించనేదమ్మా. బిడ్డని దాటుకుని ఒచ్చీసినాడు. ఆ రాత్రే దొరికిన బండట్టుకుని ఇజీవాడ ఒచ్చీసినాం.’’

ఏం గుర్తొచ్చిందో మనిషి నిలువెల్లా కదిలిపోయింది. బొమ్మలా వింటూ కూర్చున్నాను. గబుక్కున లేచి గ్లాసుతో నీళ్ళు పట్టుకుని గటగటా తాగింది. మళ్ళీ కూర్చుని మాటలకోసం కాసేపు తడుముకుంటున్నట్టు ఆగి మొదలెట్టింది.

‘‘ఇక్కడకు రాగానే నా చెవి కమ్మలు అమ్మేసాం. చిన్నగది తీసుకుని అవయిపోయే వరకూ కులాసాగున్నాం. ఆ తర్వాత ఆడికి సిరాకు మొదలైనాది. దొరికిన రోజు ఏదో ఒక పనికెళ్ళీవాడు. ఈలోపే మా గుంటడు పుట్టాడు. మందుకనీ మాకుకనీ ఏదో ఒక అవసరొమొచ్చిందా.. నన్ను బాదీసివోడు. సిన్నప్పట్నుండీ మాయమ్మని సూసి పెరిగానా.. పాయిఖానా కడగడం తప్ప నాకేటొచ్చు సెప్మీ. అదే పని సేసాను. గుంటడ్ని ఈపికి కట్టుకుని పనికెల్లీదాన్ని. మనసున్న అమ్మలెవరో ఆడ్ని నేలమీద పడుకోబెట్టమనీవోరు. పనయ్యాక సామాన్లు కొనుక్కుని ఇంటికొచ్చీదాన్ని..


‘‘కొన్నాల్లు బాగానే ఉందమ్మా. తరాత్తరాత పీతులు కడిగేదాన్నని తిట్టడం మొదలెట్టేడు. కాస్త కుదూరుగా తయారైయ్యానా.. బజారుదాయి ఎవుడికోసం తయారయ్యావే నంజా! అనీవోడు. ఆడిపనికెల్లకుండా నేను సేసీ సోటకొచ్చి దొంగ సాటుగా సూసీవోడమ్మా. ఎవరితోనైనా మాట కలిపానా, ఆరోజు రగతం పారీది.. కానీ అమ్మా..’’

ఒక్కక్షణం ఆగి మళ్ళీ మొదలెట్టింది.

‘‘ఆడెంత కొట్టినా, సంపినా నా పని మాత్రం వొగ్గనేదమ్మా. ఇది నాకు తెలిసిన పని. ఇంకో పని నాకు తెలీదు. కొన్నాల్లు పోయాక ఆడింకో దాన్ని మరిగాడని తెలిసింది. ఒకరోజు సూసాను. సిన్న పిల్ల. ఆడితో వొచ్చినప్పుడు నేనున్నంత అమాయకంగానే వుంది. ఓరోజు దారికాసి ఆ గుంటకి సెప్పాను. ఇన్నాదా నా మాట! ఊహూ ఇనలేదు. సూస్సూసి ఓ రోజు బాగా అరిగిన సీపురు కట్ట తీసుకుని ఆడ్ని ఇరగ్గొట్టాను. ఇంట్లోంచి గెంటి తలుపేసీసాను.’’

‘‘ఇక్కడే ఉంటున్నారా వాళ్ళు?’’ అడిగాను.


‘‘అంతా సెప్పకుండా వొదలవేటమ్మా!’’ నవ్వుతూ విసుక్కుని మెడకింద చేయి పెట్టి జ్వరం ఉందా అన్నట్టు చూసింది.

‘‘జొరం నేదమ్మా.. పడుకోకూడదూ’’ అంటూనే మళ్ళీ మొదలెట్టింది.

‘‘హైదరాబాద్‌లో ఉంటాడమ్మా. ఏదో బిల్డింగ్‌లో వాచ్‌మేనంట.’’

‘‘ఇప్పుడు వాడిమీద కోపం లేదా. మీ అమ్మ వాళ్లని తర్వాత ఎప్పుడైనా కలిసావా’’ పదేళ్ళ క్రితం చివరిసారిగా మాట్లాడిన తమ్ముడు గుర్తొస్తున్నాడు. నాన్న చనిపోయినప్పుడు కూడా వెళ్ళని నేను!

‘‘ఎవరిమీదా కోపం నేదమ్మా. అసలంత తీరికేది?’’

‘‘అవును జయా.. ఒక్క కొడుకే కదా నీకు. మరి కూతురు కూడా ఉందన్నావు?’’ మళ్ళీ మొదలెట్టాను.

‘‘నానుంతే నీకబుర్లుకి అంతముండదమ్మా. సాయంత్రమొస్తా. పడుకో’’ లేచి నా మొహమన్నా చూడకుండా వెళ్లిపోయింది.

అమ్మని చూస్తే బావుండు. ఎందుకో మొదటిసారి అనిపించింది. అమ్మ దగ్గరకి వెళ్తే ఏమంటుంది? తిడుతుందా.. చిన్న పొరపాటును పట్టుకుని ఎన్నాళ్ళు ఏడుస్తావే అంటూ పొట్టలో దాచుకుంటుందా?


ఆ రోజు వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ పదిహేను రోజుల వరకూ పత్తా లేదు జయలక్ష్మి. తన నంబర్‌కి ఫోన్‌ చేసినా నో రిప్లై.

‘‘జయలక్ష్మి ఈరోజూ రాలేదా!’’

‘‘జయమ్మ ఏది!’’

‘‘జయావ్‌ ఎక్కడ?’’

ఆఫీసు హోరెత్తిపోయింది.

‘‘మేడంని అడక్కపోయారా’’ విసుర్లు.. ఓరచూపులు.

తను పనికొచ్చినప్పుడు నీడ తగిలినా చీదరించుకునే మనుషులు..

చా.. ఇల్లన్నా తెలీదు. ఏమయ్యిందో. తనకి బాలేదా? పిల్లలకేమన్నా అయిందా? ఒకటే ఆలోచనలు.


నేను కాస్త స్థిమిత పడుతుండగానే ఓరోజు పొద్దున్నే ఆఫీసు కాంపౌండ్‌లోకి బర్రుమంటూ వచ్చింది పసుపురంగు ఏక్టివా. కారాకిళ్ళీ .. కొంగున కట్టుకున్న గిన్నెలోకి వూసి లోపలికి వచ్చింది. మొదటిరోజు చూశానే! అదే ముదురాకుపచ్చ నేత చీర, కింద తడికి నాని మట్టంటిన బూడిదరంగు లంగా, పైన ఇటుక రంగు జాకెట్టు. ఎప్పటిలా గబగబా బాత్రూంల వేపు నడవకుండా నావేపు చూసి నవ్వింది.

‘ఏమైపోయావ్‌’ అడగలేదు నేను! అర్థమై వుంటుంది ఆమెకి.

పనయ్యాక సంతకం పెడ్తూ ‘‘అర్జెంటయ్యి ఊరెల్లానమ్మా. ఏటనుకోకండి. సాయంత్రం ఇంటికి రమ్మంతరా. ఎవర్నన్న ఎట్టుకున్నరేటి’’ నెమ్మదిగా అడిగింది.

‘‘అదొక్కటే తక్కువ నా మొహానికి. సాయంత్రం రా..’’ విసురుగా అన్నాను తలెత్తకుండానే. కచ్చగా వుంది. ఏం జరగనట్టు ఊరెళ్ళా అని అంత సింపుల్‌గా చెప్తుందేంటి!


సాయంత్రం వచ్చింది. తనతో పాటు చుట్టాలమ్మాయి అనుకుంటా వచ్చింది. సన్నగా తెల్లగా ఉంది. ఇరవైయేళ్ళ కన్నా వుండవు. జయలక్ష్మి గిన్నెలు తోముతుంటే చకచకా కడిగేసిందా పిల్ల. తను ఇల్లూడుస్తుంటే జయలక్ష్మి తడిగుడ్డ పెట్టేసింది.

‘‘టీ ఎట్టమంతరేటమ్మా’’ చేయి తుడుచుకుంటూ అడిగింది పనయ్యాక.

‘‘వంటకూడా చేయి. ఈ పదిహేను రోజులూ ఏం తినలేదు నేను. పాపం నువ్వు లేకపోతే వంటా అవీ నేనెలా చేసుకుంటాను?’’ కచ్చగా అన్నాను.

గారపట్టిన పళ్ళు కనిపించేట్టు పకపకా నవ్వి పాలు తీసుకెళ్ళి ముగ్గురికీ మూడు గ్లాసుల్లో టీ పెట్టుకొచ్చి, సోఫా పక్కన కూచుంది.

‘‘హైద్రాబాద్‌ ఎల్లానమ్మా’’ మొదలెట్టింది.

ఉలిక్కిపడ్డాను. హైదరాబాద్‌ అంటే ... ఆ అమ్మాయి వేపు చూశాను.

‘‘మీకు జొరం వొచ్చింది సూడమ్మా! ఆరోజే ఈ గుంట ఏడుస్తా ఫోన్‌ సేసిందమ్మా.ముందు కోపం వచ్చింది. ఆడికి ఏదో జొరవంట. నమ్మకం లేదన్నాక ఈ పిల్ల నాకు సేసింది.’’


‘‘గింజుకున్నానమ్మా! అసలెల్లొద్దు అనుకున్నాను. కానీ ఈగుంట గుర్తొచ్చింది. నాలాటి దాయే కదా అనిపించింది. అప్పటి కప్పుడు బస్సెక్కి ఎల్లిపోయాను. రెండో రోజే సచ్చిపోనాడు. దీని సేతిలో సిల్లిగవ్వ లేదు. అక్కడే ఆడ్ని పారేసి వచ్చాం. చుట్టూ మొత్తం అప్పులమ్మా. నావంటి మీదవన్నీ అమ్మేసాను.’’

తను చెప్తుంటే అప్పుడు చూశాను. ముక్కుకుండే బులాకి కూడా లేదు. బోసిగా వుంది మొహం.

జయలక్ష్మి చెప్తున్నంత సేపూ ఆపిల్ల తలదించుకుని కూచుంది.

‘‘నీ పేరేంటి! ఎంతవరకూ చదువుకున్నావ్‌’’ ఏదో ఒకటి టాపిక్‌ మార్చాలనిపించింది.

‘‘పదో తరగతి’’ తలదించుకునే చెప్పింది. ఆ అమ్మాయి పేరు రాజేశ్వరి.

‘‘చదువుకుంటావా’’ నెమ్మదిగా అడిగాను.

‘‘సదువుకోవాలమ్మా! చదువుతో పాటే ధైర్నమొస్తాది. అక్క పొతే దాని కూతుర్ని సాకాను. ఇప్పుడీడుపోతే దీన్ని సాకుతాను...’’ జయలక్ష్మి మాటలు వినిపించట్లేదింక.


అంటే ఆ కూతురు అతని మొదటి భార్య కూతురన్నమాట.

అవునూ ఏమంటోంది జయ! చదువుకుంటే ధైర్యం వస్తుందా. నాకు వచ్చిందా. ఏమొచ్చింది నాకు. అమ్మా నాన్నా, తోడబుట్టినవాడు ఎవరికీ మొహం చూపించకుండా దాక్కుని, చివరికి ఆఫీసులో కూడా వెళ్ళిన ప్రతీచోటా ఆ బురదగుర్తులు మోస్తూ... నా చదువూ ఉద్యోగం నాకేం ధైర్యం ఇచ్చింది. జయలక్ష్మి ఏం చదువుకుంది. పదేళ్ళనుండీ గూడు కట్టిన దుఃఖం! వెక్కిళ్ళు పెడుతూనే జయకి మొత్తం చెప్పాను. నాకళ్ళలోంచి నీళ్ళు ధారగా కారుతుంటే గబుక్కున దగ్గరకి తీసుకుని కన్నీళ్ళు తుడిచింది జయ.

గరుకుబారిన ఆమె చేతులు మెత్తటి నెమలీకతో అద్దినట్లున్నాయి.

‘‘జయా! ఎలా చెయగలుగుతున్నావ్‌ ఇవన్నీ. చుట్టుపక్కల జనాలు నిన్నెప్పుడూ జడ్జ్‌ చేయలేదా!’’

జడ్జ్‌ చేయడం అంటే అర్థమవుతుందా ఆమెకి?


‘‘అంతారమ్మా. ఎందుకనరూ.. సాలా అంతారు. కానీ అనీవోల్లెవలూ నా పిల్లలకి ఓ ముద్దేస్తరేటమ్మా. అయినా నా తప్పేటున్నాదీ! ఆడ్ని నమ్మాను. పేవించాను. ఆడి పేవ సొచ్చవనుకున్నాను. కాదన్నాక నేను బతకాలా ఒద్దా. ఏడుస్తూ కూకుంటే కడుపెలా సల్లబడుద్దమ్మా!’’

మర్నాడు ఎప్పటిలా కాక, కాస్త రిలాక్స్‌గా ఆఫీసులో వాళ్ళని కాస్త చిరునవ్వుతో పలకరిస్తూ లోపలికి వచ్చాను. ఇదే అదనన్నట్టు కాసేపున్నాక ఒక సీనియర్‌ కొలీగ్‌ వచ్చి పక్కన కూచుంది. కాసేపు అవీ ఇవీ అడిగాక అసలు విషయం అన్నట్టు ‘‘మీరు మ్యారీడా’’ అంది మెడా కాళ్ళూ పరికిస్తూ.

ఏం చెప్తానా అన్నట్టు ఓ చెవి ఇటు పడేసి వింటున్న సుబ్బారావుకి వినబడేట్టు కాస్త గొంతుపెంచి అన్నాను.

‘‘అబ్బే! ఎక్కడండీ ... నేను ట్రాన్స్‌ఫర్‌ అయిన ప్రతీ చోటుకీ నాకన్నా ముందే ఫలానా రాజారావుకి ఒకప్పటి ... అంటూ వార్త చేరి పోతుంటే నాకింక పెళ్ళెక్కడవుతుంది. అయినా నచ్చినవాడు దొరకాలిగా. ఆ రాజారావు లాంటివాడూ, ఈ సుబ్బారావు లాంటి వాడూ కాకుండా మంచివాడు దొరకాలి కదా!’’

అప్పుడే లోపలికి వస్తున్న జయలక్ష్మిని చూసి నవ్వాను.

87905 30988

Updated Date - Jan 12 , 2025 | 11:46 AM