Kidnap: సీఐడీ ప్రోగ్రామ్ చూసి కిడ్నాప్.. కిడ్నాపర్ ప్లాన్ చూసి షాకైన పోలీసులు..
ABN, Publish Date - Jan 08 , 2025 | 03:15 PM
హర్దోయ్ జిల్లా బండరాహా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు. అయితే జనవరి 5న అతడికి ఓ గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. సంజయ్ కుమార్ సోదరుడు సందీప్ (27)ను తాము కిడ్నాప్ చేశామని, అతడిని విడుదల చేయాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్: హర్దోయ్ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితుడి సోదరుడికి మెసేజ్ పంపారు. అడిగినంత ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితుడి సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఖాకీలు తమ స్టైల్లో విచారణ చేపట్టారు. కిడ్నాపర్లు ఇచ్చిన చిన్న క్లూ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అయితే చివరికి కిడ్నాపర్ దొరికిపోగా.. అతనెవరో తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. కాగా, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
హర్దోయ్ జిల్లా బండరాహా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు. అయితే జనవరి 5న అతడికి ఓ గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. సంజయ్ కుమార్ సోదరుడు సందీప్ (27)ను తాము కిడ్నాప్ చేశామని, అతడిని విడుదల చేయాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సందీప్‌ను తాళ్లతో కట్టేసినట్లు చూపిస్తున్న 13 సెకన్ల వీడియోను సైతం సంజయ్‌కు పంపించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన సోదరుడిని ఎలాగైనా కాపాడి అప్పగించాలని కోరాడు. కిడాపర్లు పంపిన మెసేజ్, వీడియోను వారికి అందించాడు.
కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎస్పీ నీరజ్ కుమార్ జాదౌన్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చిన సమాచారాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. అయితే నిందితులు పంపిన మెసేజ్‌లో డబ్బులు చెల్లించకపోతే సందీప్‌ను "Death" (చంపేస్తాం) అని రాయటానికి బదులుగా "Deth" అని తప్పుగా రాశారు. దీంతో మెసేజ్ పంపిన నిందితుడు పెద్దగా చదువుకోలేదని పోలీసులకు అర్థమయ్యింది. అలాగే కిడ్నాపర్లు అడుగుతున్న సొమ్ము కూడా చాలా తక్కువగా పోలీసులు భావించారు. ఈ క్లూనే నిందుతులను పట్టిచ్చేలా చేసింది. మరోవైపు తన సోదరుడికి ఎవ్వరూ శత్రువులు లేరని సంజయ్ చెప్పాడు.
ఈ లోపు నిందితుల పంపిన మెసేజ్ ఆధారంగా గుర్తుతెలియని నంబర్ లొకేషన్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. నిందితులంతా రూపాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు అక్కడికే వెళ్లే సరికే సందీప్ వారికి కనిపించాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతడితో ఇంగ్లీష్ పదం "Death" అని ఓ పేపర్‌పై రాయించారు. అయితే Deathకు బదులుగా సందీప్ "Deth" అని రాశాడు. దీంతో అతన్ని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని అతనే నాటకం ఆడినట్లు పోలీసులకు అర్థమైంది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేసి నిజం రాబట్టారు.
మిర్జాపూర్‌లోని చెరకు కొనుగోలు కేంద్రంలో సందీప్ పని చేస్తున్నాడు. డిసెంబరు 30న సహాబాద్‌లో అతడు ద్విచక్రవాహనంపై వెళ్తూ వృద్ధుడిని ఢీకొట్టింది. అతని కాలు విరిగిపోవడంతో పరిహారం కింద డబ్బులు ఇవ్వాలని బాధితుడి తరఫు బంధువులు డిమాండ్ చేశారు. తన వద్ద నగదు లేదని కొంత సమయం ఇవ్వాలని సందీప్ వారిని కోరాడు. అనంతరం తన సోదరుడిని నేరుగా నగదు అడిగితే ఇవ్వడని, అందుకే తాను సీఐడీ ప్రోగ్రామ్ చూసి ఎవ్వరికీ దొరక్కుండా ఈ ప్లాన్ వేసినట్లు చెప్పాడు. అతను చెప్పిన మాటలకు పోలీసులు, సందీప్ సోదరుడు సంజయ్ కుమార్ నోరెళ్లబెట్టారు. కాగా, ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
Updated Date - Jan 08 , 2025 | 03:16 PM