మనమ్మాయిల మరో ప్రపంచం
ABN, Publish Date - Feb 03 , 2025 | 05:51 AM
Under-19 Women's World Cup: భారత అమ్మాయిలు దుమ్మురేపారు. తగ్గేదేలే అంటూ మరోమారు అండర్-19 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నారు. శివంగుల్లా ఆడుతూ సౌతాఫ్రికాను చీల్చి చెండాడారు. దెబ్బకు మరో ఐసీసీ ట్రోఫీ టీమిండియా ఒడిలో చేరింది.

మనమ్మాయిల మరో ప్రపంచం
యువ భారత్‌దే అండర్-19 ప్రపంచకప్
త్రిష ఆల్‌రౌండ్ షో జూ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం
ఆహా..ఏమి ఆట మనమ్మాయిలది! టోర్నీ ఆరంభం నుంచి అంతిమ సమరం వరకూ అదే జోరు..
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్
విభాగాల్లో తిరుగులేని ప్రదర్శనతో హోరెత్తించారు. మన స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు సాహసించలేకపోయారు..తెగించి షాట్లకు యత్నిస్తే బౌల్డయ్యారు..దాంతో ప్రత్యర్థులు పట్టుమని వంద పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు..ఇక స్వల్ప లక్ష్యాలను ఓపెనింగ్ బ్యాటర్లు.. మరీముఖ్యంగా తెలుగమ్మాయి గొంగడి త్రిష దూకుడుతో ఇట్టే ఛేదించారు. మొత్తంగా మన అమ్మాయిలు ఆల్‌రౌండ్ షోతో రెండోసారీ ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్‌ను దక్కించుకొని భళా అనిపించారు.
కౌలాలంపూర్: అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో నల్లేరుపై బండిలా సాగిన డిఫెండింగ్ చాంపియన్ భారత పయనం ట్రోఫీని చేజిక్కించుకోవడంతో ముగిసింది. గ్రూపు దశ, సూపర్ సిక్స్, సెమీఫైనల్ వరకు అప్రతిహత విజయాలతో దుమ్మురేపిన యువ భారత్ ఫైనల్‌నూ ఏకపక్షం చేసింది. సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన దక్షిణాఫ్రికా ఆటలు కూడా మన జట్టు ముందు సాగలేదు. ఏకంగా 9 వికెట్లతో సఫారీలను చిత్తు చేసిన భారత్ వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2023లో జరిగిన ఆరంభ టోర్నీలో షఫాలీ సారథ్యంలో భారత్ టైటిల్ నెగ్గింది. ఇక, ఆదివారం జరిగిన ఫైనల్లో..మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత స్పిన్నర్ల ధాటికి గడగడలాడింది. 20 ఓవర్లలో 82 పరుగులకే కూప్పకూలింది. మీక్ వాన్ (23), బోథా (16), ఫే కౌలింగ్ (15) ఒకింత ప్రతిఘటించారు. త్రిష మూడు, పరునిక, ఆయుషి శుక్లా, వైష్ణవీ శర్మ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక.. ఓపెనర్ త్రిష (33 బంతుల్లో 8 ఫోర్లతో 44 నాటౌట్) సూపర్ షోతోపాటు సనిక చల్కే (22 బంతుల్లో 4 ఫోర్లతో 26 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో 11.1 ఓవర్లలో 84/1తో లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు అందుకుంది.
త్రిష.. తగ్గేదేలె: బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి సౌతాఫ్రికా భరతం పట్టిన త్రిష..బ్యాటింగ్‌లో సహజ శైలిలో చెలరేగింది. చూడముచ్చటైన షాట్లతో అలరించింది. ఆమె దూకుడుకు స్వల్ప లక్ష్యం కూడా మరింత చిన్నదైంది. తొలి ఓవర్ మూడో బంతికే బౌండరీ సాధించిన తెలుగు బ్యాటర్..కౌలింగ్ వేసిన రెండో ఓవర్లో రెండు అందమైన కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకుంది. ఇక శేషిణి నాయుడు వేసిన నాలుగో ఓవర్లో 4,4,4తో శివాలెత్తింది. తదుపరి ఓవర్లో కమలిని అవుటైనా..వచ్చీరావడంతోనే బౌం డరీ సంధించిన వైస్-కెప్టెన్ సనిక..స్కోరుబోర్డులో వేగాన్ని ఏ మా త్రం తగ్గనీయలేదు. పవర్ ప్లేలో 44/1తో లక్ష్యం దిశగా భారత్ దూసుకు పోయింది. ఎనిమిదో ఓవర్లో త్రిష, సనిక చెరో ఫోర్ దంచారు. 10వ ఓవర్లో ఓవర్లో త్రిష క్యాచవుట్ నుంచి బయటపడింది. కానీ 11వ ఓవర్లో ఇద్దరూ చెరో బౌండరీ కొట్టడంతో లక్ష్యానికి భారత్ చేరువైంది. తర్వాతి ఓవర్ రెండో బంతిని సనిక ఫోర్‌కు తరలించడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.
స్పిన్నర్లు భళా..దక్షిణాఫ్రికా విలవిల..: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడింది. ముఖ్యంగా మధ్య ఓవర్లలో మన స్పిన్నర్లు ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేశారు. దాంతో 7-14 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. రెండో ఓవర్లో మరో ఓపెనర్ సిమోన్‌ను డకౌట్ చేసిన సిసోడియా భారత్‌కు బ్రేక్ ఇచ్చింది. అయితే ప్రమాదకర బ్యాటర్ బోథాను ఆంధ్ర పేసర్ షబ్నమ్ తన మొదటి ఓవర్లోనే అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. తర్వాత డారా (3)ను ఆయుషి శుక్లా బౌల్డ్ చేయగా..సగం ఓవర్లు ముగిసే సరికి సఫారీలు 33/3తో నిలిచారు. కెప్టెన్ రెనికే (7)ను పెవిలియన్ చేర్చడం ద్వారా త్రిష తన వికెట్ల వేటను ఆరంభించింది. వెంటనే మెసో (10)ను ఆయుషి బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా 44/5తో దయనీయంగా నిలిచింది. మీక్ వాన్‌ను ఊరించే బంతితో అవుట్ చేసిన త్రిష..తర్వాతి బంతికే శేషిణిని (0)ను బౌల్డ్ చేసింది. ఆపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగలేదు.
సంక్షిప్తస్కోర్లు
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 82 ఆలౌట్ (మీక్ వాన్ 23, బోథా 16, కౌలింగ్ 15, త్రిష 3/15, పరునిక సిసోడియా 2/6, ఆయుషి శుక్లా 2/9, వైష్ణవీ శర్మ 2/23);
భారత్: 11.2 ఓవర్లలో 84/1 (త్రిష 44 నాటౌట్, సనిక 26 నాటౌట్, రెనికే 1/14).
‘సప్త’ సారథులు
కర్ణాటకకు చెందిన నికీ ప్రసాద్ కెప్టెన్సీలో భారత్ ఈ ఏడాది అండర్-19 వరల్డ్ కప్‌ను చేజిక్కించుకుంది. ఇప్పటి వరకు అండర్-19 ప్రపంచ కప్‌లు సాధించిన భారత సారథుల (పురుషులు, మహిళల విభాగాల్లో) వివరాలు చూస్తే..
1. మహ్మద్ కైఫ్ (2000-వన్డే)
2. విరాట్ కోహ్లీ (2008-వన్డే)
3. ఉన్ముక్త్ చంద్ (2012-వన్డే)
4. పృథ్వీ షా (2018-వన్డే)
5. యష్ ధుల్ (2022-వన్డే)
6. షఫాలీ (2023, టీ20)
7. నికీ ప్రసాద్ (2025, టీ20)
అవార్డు నాన్నకు అంకితం
స్కాట్లాండ్‌పై అజేయ సెంచరీ (110 నాటౌట్)తో ఆల్‌రౌండర్ త్రిష అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించింది. అదే జోరుతో సెమీఫైనల్, ఫైనల్లో జట్టు విజయాలలో కీలక భూమిక పోషించింది. తద్వారా ‘ప్లేయర్ ఆప్ ద టోర్నీ’గా నిలిచింది. ఈ అవార్డును తండ్రి రామిరెడ్డికి అంకితమిస్తున్నట్టు ప్రకటించింది..‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును అందుకున్న సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనైన త్రిష కొద్దిసేపు మాట్లాడలేకపోయింది. ‘ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఏం మాట్లాడాలో తెలియడంలేదు. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ థ్యాంక్స్. నా సామర్థ్యాలమీద దృష్టి సారించడమే ఈరోజు ఆటలో ప్రణాళిక. దానిని పక్కాగా అమలు చేశా. ఇక..నా ఈ అవార్డు నాన్నకు అంకితం ఇస్తున్నా. ఎందుకంటే నేను నికార్సయిన ఆల్‌రౌండర్‌నని ఆయన నమ్మారు. దేశానికి సాధ్యమైనన్ని విజయాలు అందించడమే నా ధ్యేయం’ అని త్రిష వివరించింది.
బోర్డు నజరానా రూ. 5 కోట్లు
వరుసగా రెండోసారి అండర్-19 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. భారత జట్టులోని సభ్యులతో పాటు సహాయ సిబ్బందికి కలిపి రూ. 5 కోట్లు రివార్డుగా అందజేయనున్నట్టు బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రశంసించారు. యువ భారత్ అద్భుత ఆటతీరు గురించి బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుకున్నామనీ, ఆ మరుసటిరోజే జట్టు ప్రపంచకప్ సాధించడం సంతోషంగా ఉందని బిన్నీ అన్నారు.
స్ఫూర్తిదాయకం..
‘మన నారీశక్తికిది గర్వకారణం. ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు అభినందనలు. మనోళ్ల సమష్ఠి కృషి, పట్టుదల, అంకితభావానికి ఫలితమే ఈ అద్భుత విజయం. ఇలాంటి ప్రదర్శనలు వర్ధమాన అథ్లెట్లకు స్ఫూర్తిదాయకం. మన జట్టు ఇదే జోరును భవిష్యత్‌లోనూ కొనసాగించాలని కోరుకుంటున్నా’
ప్రధాని నరేంద్ర మోదీ
‘ప్రపంచ చాంపియన్లకు హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, పట్టుదలను చూసి దేశం గర్విస్తోంది’
- కేంద్ర క్రీడా మంత్రి మాండవ్య
‘టోర్నీ తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ దాకా మనోళ్లు నిజమైన చాంపియన్లుగా ఆడారు. విజయం ప్రత్యేకమే, కానీ టైటిల్ నిలబెట్టుకోవడం అసాధారణం. మరోసారి ప్రపంచ కప్ నెగ్గిన మన జట్టుకు అభినందనలు. ఈ టీమ్ భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టించగలదు’
- సచిన్ టెండూల్కర్
ప్రపంచకప్ విజయం యావత్ దేశానికి గర్వకారణం. ఈ ప్రదర్శనలో తెలుగమ్మాయి గొంగడి త్రిష కీలకపాత్ర పోషించడం మరింత ప్రత్యేకతను తెలియజేస్తుంది’
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
‘వరుసగా రెండోసారి ప్రపంచకప్ నెగ్గడం భారత ప్రతిభను చాటి చెబుతోంది.
- బీసీసీఐ
‘ఈ ప్రదర్శనతో భారతావని మురిసిపోతోంది. బంగారు తరం వచ్చేసింది’
- మిథాలీ రాజ్
Ind Vs Eng T20: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీ20.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు
Updated Date - Feb 03 , 2025 | 08:19 AM