Border-Gavaskar Trophy : ‘రిజర్వ్’ పేస్‌లో పదునేది?
ABN, Publish Date - Jan 07 , 2025 | 05:13 AM
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత బ్యాటర్ల ఆటతీరు విమర్శల పాలైంది. బౌలింగ్‌లో మాత్రం బుమ్రా బృందం అందరినీ ఆకట్టుకుంది. కానీ సునిశితంగా గమనిస్తే.. భారత రిజర్వ్ బెంచ్‌లో బ్యాటింగ్ కన్నా బౌలింగ్ వనరుల సమస్య
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత బ్యాటర్ల ఆటతీరు విమర్శల పాలైంది. బౌలింగ్‌లో మాత్రం బుమ్రా బృందం అందరినీ ఆకట్టుకుంది. కానీ సునిశితంగా గమనిస్తే.. భారత రిజర్వ్ బెంచ్‌లో బ్యాటింగ్ కన్నా బౌలింగ్ వనరుల సమస్య ఎక్కువగా ఉండడం గమనార్హం. కెప్టెన్ రోహిత్, విరాట్‌ల వైఫల్యంతో వారి కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ వారు వైదొలిగినా.. సమర్థులైన యువ బ్యాటర్లు ఆ స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే.. ముఖ్యంగా పేస్ విభాగం కథ మరోలా ఉంది. బుమ్రా, షమి, ఇషాంత్‌ల స్థాయిని అందుకునేందుకు టెస్టు జట్టు కచ్చితంగా కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బౌలర్లు జట్టు అవసరాలను తీర్చగలరా? అనేది సందేహమే. షమిని గాయాలు వెంటాడుతుండడంతో బుమ్రాపై అధిక భారం పడుతోంది. వీరిద్దరూ అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏమిటి? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న సిరాజ్ 36 టెస్టులు ఆడినా గేమ్ చేంజర్‌గా మారలేదు. ప్రసిద్ధ్ కృష్ణ చాలా ఎక్కువగా లూజ్ బాల్స్ వేస్తుంటాడు. ఆకాశ్‌దీ్‌ప, ముకేశ్ కుమార్‌లకు నైపుణ్యం ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ఇంకా నిరూపించుకోలేదు. ఇక రంజీ సర్క్యూట్‌ను పరిశీలించినా సెలెక్టర్లను అంతగా ఆకట్టుకున్న పేసర్లు కనిపించడం లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా జట్టుకు లెఫ్టామ్ పేసర్ అవసరం చాలా ఉంది. జహీర్ ఖాన్ తర్వాత ఇప్పటి వరకు ఆ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేకపోయారు. అర్ష్‌దీప్, యష్ దయాళ్‌లపై ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. వారు సుదీర్ఘ ఫార్మాట్‌కు సరిపోతారా? అనేది తేలాల్సి ఉంది.
బ్యాటర్లు సిద్ధంగా..
బ్యాటింగ్ విభాగంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న బ్యాటర్లు జాతీయ జట్టులో చోటు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ రోహిత్, విరాట్ లేకుండా సెలెక్టర్లు ముందుకు వెళ్లాలని భావిస్తే.. ఈ రెండు స్థానాల కోసం కనీసం అరడజను మంది సిద్ధంగా ఉన్నారు. ఇందులో దేవ్‌దత్ పడిక్కళ్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్‌ల పేర్లు చెప్పుకోవచ్చు. అభిమన్యు 101 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 7674 పరుగులు సాధించినా జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. ఇటీవలి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ బెంచీకే పరిమితమయ్యాడు. స్టార్ ప్లేయర్లు ఎంతగా విఫలమవుతున్నా వారినే కొనసాగించడం కూడా యువ ఆటగాళ్లకు శాపంలా మారింది. అయ్యర్ షార్ట్ బాల్ బలహీనతను అధిగమించాల్సి ఉంటుంది. అయితే దేశవాళీల్లో ఆటగాళ్ల పరుగులు లేదా వికెట్లు మాత్రమే ఎంపికకు గీటురాయి కాకపోవచ్చు. అనుకూల పరిస్థితుల్లో రాణించడం కాకుండా.. పచ్చికతో కూడిన పిచ్‌పై సెంచరీ, ఫ్లాట్ వికెట్‌పై వికెట్లు తీయగల సామర్థ్యం కీలకమవుతుంది. ఏదిఏమైనా జూన్ వరకు టెస్టు సిరీ్‌సలు లేవు కాబట్టి ఫిబ్రవరిలో దేశవాళీ సీజన్ ముగిసిన తర్వాతే ఆటగాళ్ల ఎంపికపై దృష్టి సారించే అవకాశముంది.
Updated Date - Jan 07 , 2025 | 05:13 AM