Share News

IPL 2025, LSG vs KKR: లఖ్‌నవూదే లక్.. భారీ ఛేజింగ్‌లో కోల్‌కతా బోల్తా

ABN , Publish Date - Apr 08 , 2025 | 07:25 PM

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి ఏకంగా 500కు పైగా పరుగులు నమోదయ్యాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పరుగుల విందు అందించింది. మాస్ హిట్టింగ్ అంటే ఏంటో చూపించింది.

IPL 2025, LSG vs KKR: లఖ్‌నవూదే లక్.. భారీ ఛేజింగ్‌లో  కోల్‌కతా బోల్తా
LSG

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి ఏకంగా 500కు పైగా పరుగులు నమోదయ్యాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (LSG vs KKR) పరుగుల విందు అందించింది. మాస్ హిట్టింగ్ అంటే ఏంటో చూపించింది. ముందు బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా కూడా ధీటుగా స్పందించింది. అయితే చివర్లో ఒత్తిడికి గురై విజయానికి దూరమైపోయింది (IPL 2025)


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు శుభారంభం అందించారు. మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81) తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ విశ్వరూపం ప్రదర్శించాడు. సిక్స్‌లతో హోరెత్తించాడు. 30 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. పూరన్‌కు బంతులు ఎక్కడ వేయాలో తెలియక కోల్‌కతా బౌలర్లు తలలు పట్టుకున్నారు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీశాడు. ఆండ్రూ రస్సెల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. డికాక్ (15) త్వరగానే అవుట్ అయినా మరో ఓపెనర్ నరైన్ (13 బంతుల్లో 30) వేగంగా పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రహానే (61) మెరపు అర్ధశతకంతో రాణించాడు. క్లాస్ హిట్టింగ్ చేశాడు. అతడికి వెంకటేష్ అయ్యర్ (45) కూడా సహకరించాడు. ఒక దశలో కోల్‌కతా విజయం సాధిస్తుందనిపించింది. అయితే 14 ఓవర్ల తర్వాత లఖ్‌నవూ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కోల్‌కతాకు మ్యాచ్‌ను దూరం చేశారు. చివర్లో రింకూ సింగ్ (32) మరో అద్భుతం చేస్తాడా అనిపించింది. కానీ, అలా జరగలేదు. చివరకు కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 07:25 PM