IPL 2025, MI vs RCB: ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబైకి మళ్లీ పరాజయమే
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:35 PM
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అసలు సిసలు మజాను అందించింది. థ్రిల్లర్ సినిమాను తలపించింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) చెలరేగడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అసలు సిసలు మజాను అందించింది. థ్రిల్లర్ సినిమాను తలపించింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) చెలరేగడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ నువ్వా, నేనా అన్నట్టు సాగింది. చివరి ఓవర్లో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయడంతో చివరకు ఆర్సీబీనే విజయం వరించింది. ఏదేమైనా క్రికెట్ ప్రేమికులు అసలు సిసలు క్రికెట్ మజాను ఆస్వాదించారు.
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. కింగ్ కోహ్లీ (42 బంతుల్లో 67), రజత్ పటిదార్ (32 బంతుల్లో 64) మెరుపు అర్ధశతకాలు సాధించి బెంగళూరు భారీ స్కోరుకు బాటలు వేశారు. చివర్లో జితేష్ (40) కీలక పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, బౌల్ట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. విఘ్నేష్ పుత్తుర్ ఒక్కో వికెట్ పడగొట్టాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబైకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ (17), రికెల్టన్ (17), విల్ జాక్స్ (22), సూర్య కుమార్ (28) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అయితే గత మ్యాచ్‌లో రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగిన తిలక్ వర్మ (29 బంతుల్లో 56) ఈ మ్యాచ్‌లో తన విలువ ఏంటో చాటి చెప్పాడు. హార్దిక్ (15 బంతుల్లో 42)తో కలిసి ముంబైను మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. దాంతో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది. అయితే చివర్లో భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఛేజింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు 209 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..