Share News

IPL 2025, SRH vs GT: గుజరాత్‌ హ్యాట్రిక్.. హైదరాబాద్‌‌కు నాలుగో పరాజయం

ABN , Publish Date - Apr 06 , 2025 | 10:58 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరు మారలేదు. ఇప్పటికే మూడు పరాజయాలతో సతమతమైన సన్‌రైజర్స్ స్వంత మైదానంలో నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమై మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

IPL 2025, SRH vs GT: గుజరాత్‌ హ్యాట్రిక్.. హైదరాబాద్‌‌కు నాలుగో పరాజయం
GT Won by 7 wickets against SRH

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తీరు మారలేదు. ఇప్పటికే మూడు పరాజయాలతో సతమతమైన సన్‌రైజర్స్ స్వంత మైదానంలో నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమై మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది (SRH vs GT). మరోవైపు చక్కగా రాణించిన గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. 16.4 ఓవర్లలోనే హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంది.


టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ గుజరాత్ బౌలర్లు చెలరేగిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రావిస్ హెడ్ (8) ఫస్ట్ ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. అభిషేక్ శర్మ (18), ఇషాన్ కిషన్ (17) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఓపెనర్లిద్దరినీ సిరాజ్ అవుట్ చేసి గట్టి దెబ్బ తీశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ (31), క్లాసెన్ (27) నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. వారు అవుట్ అయిన తర్వాత మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేకపోయారు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సిరాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషఓర్ రెండేసి వికెట్లు తీశారు.


153 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. సాయి సుదర్శన్‌ను షమీ, బట్లర్‌ను ప్యాట్ కమిన్స్ అవుట్ చేసి సన్‌రైజర్స్‌ను గేమ్‌లోకి తీసుకొచ్చారు. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మరో ఎండ్‌లో గిల్ (61) అర్ధశతకం సాధించి గుజరాత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. చివర్లో రూథర్‌ఫర్డ్ (30) వేగంగా ఆడాడు. హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలోనే ఛేదించింది. సన్ రైజర్స్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు, ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 10:58 PM