U-19 Cricket : ఔరా.. ఇరా!
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:17 AM
పద్నాలుగేళ్ల ముంబై ఓపెనర్ ఇరా జాదవ్ చరిత్ర సృష్టించింది.
157 బంతుల్లో 346
అండర్-19 క్రికెట్‌లో త్రిశకంతో చరిత్ర
ఆలూరు (బెంగళూరు): పద్నాలుగేళ్ల ముంబై ఓపెనర్ ఇరా జాదవ్ చరిత్ర సృష్టించింది. అండర్-19 క్రికెట్‌లో త్రి శతకం చేసిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనత అందుకుంది. మేఘాలయా జట్టుతో ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ మ్యాచ్‌లో ఇరా ఈ ఫీట్ నమోదు చేసింది. కేవలం 157 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్లతో జాదవ్ అజేయంగా 346 పరుగులు కొల్లగొట్టింది. కాగా..మహిళల అండర్-19 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మాత్రం సౌతాఫ్రికాకు చెందిన లిజెల్లీ లీ (427 నాటౌట్, 2010) పేరిట ఉంది. ఇక.. కెప్టెన్ హర్లీ గాలా (116)తో కలిసి రెండో వికెట్‌కు ఇరా 274 పరుగులు జత చేసింది. అనంతరం దీక్షా పవార్ (39)తో కలిసి మూడో వికెట్‌కు 186 పరుగులు జాదవ్ జోడించింది. దాంతో ముంబై 50 ఓవర్లలో 563/3 స్కోరు చేసింది. అత్యంత భారీ లక్ష్య ఛేదనలో మేఘాలయ 25.4 ఓవర్లలో 19 పరుగులకే ఆలౌటైంది. సచిన్, కాంబ్లీ, అజిత్ అగార్కర్‌లాంటి మేటి క్రికెటర్లు చదివిన శారదాశ్రమ్ విద్యామందిర్ విద్యార్థిని అయిన ఇరా..గత నెలలో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగలడం గమనార్హం.
Updated Date - Jan 13 , 2025 | 03:17 AM