Australian Open : ఆ ఇద్దరిపై..
ABN, Publish Date - Jan 12 , 2025 | 05:41 AM
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నవతరం స్టార్ల హవా కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం నుంచి జరిగే ఈ మేజర్ టోర్నీలో డిఫెండింగ్ చాంప్, ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్ (23), మూడో సీడ్ కార్లోస్ అల్కారజ్
ఉదయం 5.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్
సిన్నర్, అల్కారజ్‌పై భారీ అంచనాలు
అండర్ డాగ్‌గా జొకోవిచ్
మహిళల ఫేవరెట్ సబలెంక
మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నవతరం స్టార్ల హవా కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం నుంచి జరిగే ఈ మేజర్ టోర్నీలో డిఫెండింగ్ చాంప్, ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్ (23), మూడో సీడ్ కార్లోస్ అల్కారజ్ (21) పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్‌లుగా బరిలోకి దిగుతున్నారు. ఏళ్ల తరబడి బిగ్-3 రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్, నొవాక్ జొకోవిచ్ టెన్ని్‌సను ఏలారు. ఫెడెక్స్, నడాల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. జొకోవిచ్ ఒక్కడే ప్రస్తుతం పోటీలో ఉన్నాడు. అయితే, 24 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గి చరిత్ర సృష్టించిన జొకో గతేడాది ఒకే ఒక గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో మాత్రమే ఫైనల్ చేరగలిగాడు. ఈమధ్య జొకో.. సిన్నర్, అల్కారజ్‌ల నుంచి ధీటైన ప్రతిఘటన ఎదుర్కొంటున్నాడు. కుర్రాళ్ల హవా సాగుతున్న ఈ పరిస్థితుల్లో 37 ఏళ్ల జొకోను మెల్‌బోర్న్‌లో అండర్ డాగ్‌గా టెన్నిస్ పండితులు విశ్లేషిస్తున్నారు. కానీ, ఇక్కడ 11వ టైటిల్ వేటలోనున్న ఏడో సీడ్ జొకో ఈసారి నెగ్గి తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నాడు. టాప్ సీడ్ సిన్నర్, అల్కారజ్‌లు గత సీజన్‌లో చెరో రెండు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గి నువ్వానేనా? అన్నట్టుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో డోపింగ్ ఆరోపణలతో ఒత్తిడికి గురైనా.. జానిక్ మాత్రం ఆటలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొన్నాడు. కాగా, సీజన్ చివర్లో అల్కారజ్ ఫామ్ తగ్గింది. తొలి రౌండ్‌లో నికోలస్ జెర్రీ (చిలీ)తో సిన్నర్ తలపడనున్నాడు. మరోవైపు టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న అల్కారజ్ తన సర్వీ్‌సలో మార్పులు చేసుకొని బరిలోకి దిగుతున్నాడు. సిన్నరే తనకు ప్రత్యర్థి అని ప్రకటించాడు కూడా. దీంతో ఈసారి టైటిల్ ఫైట్ వీరిద్దరి మధ్యనే జరుగుతుందన్నది విశ్లేషకుల అంచనా. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలిస్ట్, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ (జర్మనీ), యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్, ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) ఈసారి టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్నారు. జొకోవిచ్ ఆరంభ రౌండ్లో తెలుగు మూలాలున్న అమెరికా కుర్రాడు నిషేష్ బసవారెడ్డితో తలపడనున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో గతేడాది విజేత అర్యానా సబలెంక టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. గతవారం బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గి జోరుమీదున్న సబలెంకకు మాజీ చాంప్, పోలెండ్ భామ ఇగా స్వియటెక్, ఇటలీ సంచలనం జాస్మిన్ పౌలినీ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.. 2024లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలో పౌలినీ ఫైనల్ చేరినా.. రెండుసార్లూ నిరాశే ఎదురైంది. ఇక, తొలి రౌండ్‌లో స్లోన్ స్టీఫెన్స్‌తో సబలెంక, సినికొవాతో రెండో సీడ్ స్వియటెక్, చైనా ప్లేయర్ వీ యూతో పౌలినీ అమీతుమీ తేల్చుకోనున్నారు.
Updated Date - Jan 12 , 2025 | 05:41 AM