IPL 2025 SRH Win: అభిషేక్ శర్మ విధ్వంసం.. సన్ రైజర్స్‌కు అనితరసాధ్య విజయం
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:45 PM
అభిషేక్ శర్మ శతకంతో సన్‌రైజర్స్ కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది. పంజాబ్ నిర్దేశించి 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.

ఫోర్లు.. సిక్సులు.. అభిమానుల పూనకాలు.. ఐపీఎల్ అంటే ఇదీ అనిపించేతలా పరుగుల వరద. ఐపీఎల్ చరిత్రలో అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని జ్ఞాపకాన్ని మిగుల్చింది నేటి ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యం 246 పరుగులు. ఫామ్ లేమితో సతమతమవుతున్న హైదరాబాద్‌కు ఈ స్కోరు సాధ్యమేనా అని అభిమానుల్లో సందేహం. కానీ సూర్యప్రతాపం ఎలా ఉంటుందో చూపించింది సన్ రైజర్స్.
ముఖ్యంగా అభిషేక్ శర్మ కనీవినీ ఎరుగని రీతిలో పరుగుల వరద పారించాడు. కేవలం 55 బంతుల్లో అభిషేక్ శర్మ 141 పరుగులకు తోడు హెడ్ 66 పరుగులు జత కలవడంతో సన్ రైజర్స్ చూస్తుండగానే పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఆ తరువాత విజయం నల్లేరు మీద నడకే అయ్యింది. 18.3 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయసంగా అధిగమించింది. పంజాబ్ బౌలర్లలో చహల్, అర్షదీప్ చెరో వికెట్ తీశారు.
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) చెలరేగి పంజాబ్‌కు భారీ స్కోరు అందించాడు. సాయినిస్ షమీ ఓవర్లో వరుసగా సిక్సులు బాది పంజాబ్ స్కోరును అమాంతం పెంచేశాడు.
ఈ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించిన సన్ రైజర్స్ తనకు తిరుగే లేదని మరోసారి రుజువు చేసింది. ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు పూనకాలు వచ్చేలా చేసింది. మరోవైపు, ఈ మ్యాచ్‌లో చెలరేగిన అభిషేక్ శర్మ.. ఈ సీజన్‌లో మూడో శతకం బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఇషాక్ కిషన్, ప్రియాన్ష్ ఆర్య కూడా శతకాలు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం
బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి