సిరీస్ చేజారె బెర్త్ చేజారె
ABN, Publish Date - Jan 06 , 2025 | 06:08 AM
ఒకే ఒక్క ఫలితం.. భారత టెస్టు జట్టును రెండు విధాలుగా దెబ్బకొట్టింది. ఆస్ట్రేలియాతో దాదాపు మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఆసీస్ గడ్డపై 2018, 2020ల్లో వరుసగా..
ఆఖరి టెస్టులో 6 వికెట్లతో భారత్ ఓటమి
బరిలోకి దిగని బుమ్రా
3-1తో ఆసీ్‌సదే సిరీస్
రెండో ఇన్నింగ్స్ 162/4
డబ్ల్యూటీసీ ఫైనల్లో కంగారూలు
సిడ్నీ: ఒకే ఒక్క ఫలితం.. భారత టెస్టు జట్టును రెండు విధాలుగా దెబ్బకొట్టింది. ఆస్ట్రేలియాతో దాదాపు మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఆసీస్ గడ్డపై 2018, 2020ల్లో వరుసగా రెండుసార్లు దక్కించుకున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. అంతేకాదు.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. డబ్ల్యూటీసీ రేసులో ఉండాలంటే టీమిండియా ఈ టెస్టులో కచ్చితంగా గెలవాల్సింది. దీంతో తొలి రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆడిన టీమిండియాకు ఈసారి నిరాశే ఎదురైంది. అటు సిడ్నీలో విజయంతో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది జూన్ 16 నుంచి లార్డ్స్‌లో జరిగే తుది పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు సిడ్నీ టెస్టును గెలుచుకునేందుకు ఆదివారం ఆసీస్ 162 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగింది. ఓపెనర్ ఖవాజా (41), వెబ్‌స్టర్ (39 నాటౌట్), హెడ్ (34 నాటౌట్) రాణించడంతో తమ రెండో ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలోనే 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. పేసర్ ప్రసిద్ధ్‌కు మూడు వికెట్లు దక్కాయి.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులు చేసింది. 141/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 16 పరుగులు మాత్రమే జోడించి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. జడేజా (13), నితీశ్ (4) విఫలమయ్యారు. బోలాండ్‌కు ఆరు, కమిన్స్‌కు మూడు వికెట్లు లభించాయి. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185, ఆసీస్ 181 పరుగులు చేశాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బోలాండ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీ్‌సగా బుమ్రా నిలిచారు.
దూకుడుగా ముగించారు: వెన్నునొప్పి కారణంగా తాత్కాలిక కెప్టెన్ బుమ్రా ఆదివారం కూడా పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడు లేని భారత బౌలింగ్ విభాగం ఛేదనలో ఆసీ్‌సను అడ్డుకోలేకపోయింది. 162 పరుగుల ఛేదనను కంగారూలు ఆరు పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి రెండో సెషన్‌లోనే ముగించారు. ఓపెనర్లు కాన్‌స్టా్‌స (22), ఖవాజా తొలి వికెట్‌కు 3.5 ఓవర్లలోనే 39 పరుగులు జత చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కాన్‌స్టా్‌స, లబుషేన్ (6), స్మిత్ (4)ల వికెట్లను తీసి పేసర్ ప్రసిద్ధ్ కాస్త ఒత్తిడి పెంచాడు. అప్పటికి ఆసీస్ విజయానికి మరో 58 పరుగుల దూరంలో ఉంది. ఈ దశలో బుమ్రా కూడా మైదానంలో ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ హెడ్, బోలాండ్‌ను భారత్ కట్టడి చేయలేకపోయింది. ఈ జోడీ ఎలాంటి తడబాటు లేకుండా ఐదో వికెట్‌కు అజేయంగా 53 బంతుల్లో 58 పరుగులు జోడించడంతో ఆసీస్ సంబరాలు ఆకాశాన్నంటాయి.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 185
ఆస్ర్టేలియా తొలి ఇన్నింగ్స్: 181
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) బోలాండ్ 22; రాహుల్ (బి) బోలాండ్ 13; గిల్ (సి) క్యారీ (బి) వెబ్‌స్టర్ 13; కోహ్లీ (సి) స్మిత్ (బి) బోలాండ్ 6; పంత్ (సి) క్యారీ (బి) కమిన్స్ 61; జడేజా (సి) క్యారీ (బి) కమిన్స్13; నితీశ్ (సి) కమిన్స్ (బి) బోలాండ్ 4; సుందర్ (బి) కమిన్స్ 12; సిరాజ్ (సి) ఖవాజా (బి) బోలాండ్ 4; బుమ్రా (బి) బోలాండ్ 0; ప్రసిద్ధ్ (నాటౌట్) 1;ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 39.5 ఓవర్లలో 157 ఆలౌట్; వికెట్ల పతనం: 1-42, 2-47, 3-59, 4-78, 5-124, 6-129, 7-147, 8-156, 9-156, 10-157; బౌలింగ్: స్టార్క్ 4-0-36-0; కమిన్స్ 15-4-44-3; బోలాండ్ 16.5-5-45-6; వెబ్‌స్టర్ 4-1-24-1.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: కాన్‌స్టా్‌స (సి) సుందర్ (బి) ప్రసిద్ధ్ 22; ఖవాజా (సి) పంత్ (బి) సిరాజ్ 41; లబుషేన్ (సి) జైస్వాల్ (బి) ప్రసిద్ధ్ 6; స్మిత్ (సి) జైస్వాల్ (బి) ప్రసిద్ధ్ 4; హెడ్ (నాటౌట్) 34; వెబ్‌స్టర్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 27 ఓవర్లలో 162/4; వికెట్ల పతనం: 1-39, 2-52, 3-58, 4-104; బౌలింగ్: సిరాజ్ 12-1-69-1; ప్రసిద్ధ్ 12-0-65-3; నితీశ్ 2-0-10-0; సుందర్ 1-0-11-0.
1
ఆసీస్ గడ్డపై జరిగిన టెస్టుల్లో ఎక్కువ రన్‌రేట్ (6.00)తో 100+ రన్స్ ఛేదించడం ఇదే తొలిసారి.
1
సిడ్నీలో 129 ఏళ్ల తర్వాత అత్యంత వేగం (1141 బంతుల్లో)గా ముగిసిన టెస్టు ఇదే.
తీరని వ్యథ వెనుక..
భారత జట్టు తీరు మారలేదు.. అభిమానులకు గుండె కోత తప్పలేదు. 2018లో కోహ్లీ హయాంలో, 2020లో రహానె కెప్టెన్సీలో ఆసీస్ గడ్డపై చారిత్రక విజయాలను చవిచూసిన టీమిండియా.. ఈసారి ఘోర ప్రదర్శనతో దశాబ్దం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకొంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో చిత్తుగా ఓడినా.. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో స్ఫూర్తిదాయక విజయం సాధించిన భారత జట్టు మళ్లీ అదే తరహా ప్రదర్శన చేయలేక పోయింది. అందుకు ప్రధాన కారణం జట్టు బ్యాటింగ్ వైఫల్యం. సిరీస్‌లోని మొత్తం ఐదు టెస్టుల్లో ఆరుసార్లు భారత్ 200 పరుగుల స్కోరు కూడా దాటలేకపోవడం దారుణం. పెర్త్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 150 రన్స్‌కే కుప్పకూలినా.. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్, కోహ్లీ శతకాలతో అద్భుత విజయాన్ని అందుకొంది. కానీ, అడిలైడ్ టెస్టు నుంచి మన బ్యాటింగ్ డొల్లతనం బహిర్గతమైంది.
మెల్‌బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్ల వైఫల్యం కారణంగా డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకొని 1-2తో వెనుకబడింది. తప్పక గెలవాల్సిన సిడ్నీ టెస్టులోనూ ఆశించిన స్థాయిలో ఆడలేక సిరీస్‌తోపాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలనూ చేజార్చుకొంది. బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్నా.. వారిని సరిదిద్దుకోలేక పోవడమనే సమస్య ఏళ్లుగా వెంటాడుతోంది. ఆఫ్‌స్టంప్‌పై పడే బంతులను వెంటాడి అవుటయ్యే బలహీనతను కోహ్లీ అధిగమించలేక పోతున్నాడు. రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారాడు. వీరిద్దరి వరుస వైఫల్యాలతో టీమిండియా తొమ్మిది మందితోనే ఆడుతోందన్న సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతూనే ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా ఒంటరి పోరాటం చేశాడు. సహచరుల నుంచి కనీస సహకారం అందకపోయినా.. అతడు మాత్రం జట్టు విజయం కోసం పాటుపడ్డాడు. తొలి టెస్టు విజయంలో బుమ్రా పాత్ర ఎంతో ఉంది. సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా ఎప్పుడో మెరుపులు తప్ప నిలకడ ప్రదర్శించలేదు. ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా బుమ్రా బౌలింగ్‌కు దూరం కావడంతో మ్యాచ్ ఫలితం ముందుగానే తెలిసిపోయింది. మొత్తంగా ఈ సిరీస్‌తోనైనా కళ్లు తెరచి.. జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. సంధి దశలో ఉన్న భారత జట్టు కోసం మెరికల్లాంటి యువ ఆటగాళ్లను వెతికిపడితే.. టీమిండియా మళ్లీ పుంజుకొనే అవకాశం ఉంది.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
Updated Date - Jan 06 , 2025 | 06:08 AM