Share News

రైజర్స్‌.. మరోసారీ

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:07 AM

అన్ని విభాగాల్లో విఫలమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వరుసగా నాలుగో ఓటమి. అటు వేదిక ఏదైనా విజయమే లక్ష్యంగా గుజరాత్‌ టైటాన్స్‌ చెలరేగుతోంది. ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్న టైటాన్స్‌ ఆదివారం...

రైజర్స్‌.. మరోసారీ

ఐపీఎల్‌లో నేడు

ముంబై X బెంగళూరు

వేదిక : ముంబై, రా.7.30

రైజర్స్‌.. మరోసారీ

సొంతగడ్డపై చెలరేగిన సిరాజ్‌

గిల్‌ అర్ధసెంచరీ గుజరాత్‌ హ్యాట్రిక్‌

సొంత మైదానంలోనైనా అదరగొట్టేస్తుందేమోనని ఆశించిన సన్‌రైజర్స్‌ అభిమానులకు నిరాశే ఎదురైంది. తాము దూకుడుగానే ఆడతామని కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ టాస్‌కు ముందు బీరాలు పలికినా.. పేసర్‌ సిరాజ్‌ కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌ (4/17)కు బ్యాటింగ్‌ ఆర్డర్‌ చెల్లాచెదురైంది. ఇక హైదరాబాద్‌ బౌలింగ్‌లోనూ పస లేకపోవడంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఆడుతూ పాడుతూ హ్యాట్రిక్‌ విజయాన్ని పూర్తి చేసింది.

హైదరాబాద్‌: అన్ని విభాగాల్లో విఫలమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వరుసగా నాలుగో ఓటమి. అటు వేదిక ఏదైనా విజయమే లక్ష్యంగా గుజరాత్‌ టైటాన్స్‌ చెలరేగుతోంది. ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్న టైటాన్స్‌ ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ ఓటమితో రైజర్స్‌ తమ ఆఖరి స్థానాన్ని మరింత పదిలపర్చుకున్నట్టయ్యింది. అలాగే ఎస్‌ఆర్‌హెచ్‌పై గిల్‌ సేనకిది వరుసగా నాలుగో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీశ్‌ (31), క్లాసెన్‌ (27), కమిన్స్‌ (22 నాటౌట్‌) మాత్రమే రాణించారు. సిరాజ్‌కు నాలుగు.. సాయికిశోర్‌, ప్రసిద్ధ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్‌ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. గిల్‌ (43 బంతుల్లో 9 ఫోర్లతో 61 నాటౌట్‌) తుదికంటా నిలవగా.. సుందర్‌ (29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), రూథర్‌ఫోర్డ్‌ (16 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 నాటౌట్‌) వేగంగా ఆడారు. షమికి రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సిరాజ్‌ నిలిచాడు.


గిల్‌-సుందర్‌ అండతో..: స్వల్ప ఛేదన కోసం బరిలోకి దిగిన టైటాన్స్‌ తొలి ఐదు ఓవర్లలో చేసింది 28 పరుగులే. పైగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్‌ సాయిసుదర్శన్‌ (5), బట్లర్‌ (0)ల వికెట్లను కూడా కోల్పోయింది. ఈ స్థితిలో మ్యాచ్‌ రసవత్తరంగాసాగే అవకాశం ఉందనిపించింది. కానీ నాలుగో నెంబర్‌లో బరిలోకి దిగిన వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కసారిగా సీన్‌ మార్చేశాడు. ఆరో ఓవర్‌లో అతడు 20 పరుగులు సాధించి టైటాన్స్‌లో జోష్‌ నింపాడు. అనంతరం గిల్‌-సుందర్‌ జోడీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ముందుకు సాగింది. 36 బంతుల్లో గిల్‌ ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. మూడో వికెట్‌కు 90 పరుగుల భారీ భాగస్వామ్యం జత చేశాక షమి ఓవర్‌లో సుందర్‌ అవుటయ్యాడు. అనికేత్‌ ఈ క్యాచ్‌ను పట్టడానికి ముందు బంతి నేలకు తాకినట్టు కనిపించినా థర్డ్‌ అంపైర్‌ అవుటివ్వడం చర్చనీయాంశమైంది. ఇక అభిషేక్‌ ఓవర్‌లో రూథర్‌ఫోర్డ్‌ 18 రన్స్‌ రాబట్టడంతో రైజర్స్‌కు ఏమూలో ఉన్న ఆశలు కూడా అడుగంటాయి. 16వ ఓవర్‌లో గిల్‌ రెండు ఫోర్లతో సమీకరణం 24 బంతులు 12 పరుగులకు మారింది. కానీ రూథర్‌ఫోర్డ్‌ 6,4తో మరో 20 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.


సిరాజ్‌ హవా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ను టైటాన్స్‌ బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా పేసర్‌ సిరాజ్‌.. పవర్‌ప్లే, డెత్‌ ఓవర్లలో వికెట్ల వేట సాగించాడు. మొదటి 12 ఓవర్లపాటు వీరి ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఆఖరి ఓవర్‌లోనే అత్యధికంగా 17 పరుగులు సమకూరాయి. నితీశ్‌-క్లాసెన్‌ జోడీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. రెండు వరుస ఫోర్లతో జోష్‌ నింపిన ఓపెనర్‌ హెడ్‌ (8)ను ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే పేసర్‌ సిరాజ్‌ దెబ్బతీశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్‌ అభిషేక్‌ (18), ఇషాన్‌ (17) బౌండరీలతో స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కానీ ఐదో ఓవర్‌లో ఒకే పరుగిచ్చి అభిషేక్‌ను సిరాజ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 45/2 స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత పిచ్‌ నెమ్మదించడంతో క్రీజులో ఉన్న నితీశ్‌, క్లాసెన్‌ కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో 5-10 ఓవర్ల మధ్య వీరి నుంచి ఒక్క ఫోర్‌ కూడా నమోదు కాలేదు. చివరకు 11వ ఓవర్‌లో నితీశ్‌ రెండు ఫోర్లు సాధించగా, 13వ ఓవర్‌లో క్లాసెన్‌ 4,6తో ఆకట్టుకున్నాడు. ఇక ట్రాక్‌లోకి వచ్చాడనుకున్న క్లాసెన్‌ను సాయికిశోర్‌ ఫ్లాట్‌ డెలివరీతో బౌల్డ్‌ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 50 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు భారీ షాట్‌కు ప్రయత్నించిన నితీశ్‌ను సాయికిశోర్‌.. కమిందు (1)ను ప్రసిద్ధ్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చారు. కానీ 19వ ఓవర్‌లో మూడు పరుగులే ఇచ్చిన సిరాజ్‌ కళ్లు చెదిరే ఇన్‌స్వింగ్‌ యార్కర్లతో అనికేత్‌, సిమర్జీత్‌ (0) వికెట్లను పడగొట్టాడు. అయితే ఆఖరి ఓవర్‌లో కమిన్స్‌ 4,6.. షమి (6 నాటౌట్‌) 4తో సన్‌రైజర్స్‌ స్కోరు 150 దాటగలిగింది.


స్కోరుబోర్డు

హైదరాబాద్‌: అభిషేక్‌ (సి) తెవాటియా (బి) సిరాజ్‌ 18; హెడ్‌ (సి) సాయి సుదర్శన్‌ (బి) సిరాజ్‌ 8; ఇషాన్‌ (సి) ఇషాంత్‌ (బి) ప్రసిద్ధ్‌ 17; నితీశ్‌ (సి) రషీద్‌ (బి) సాయికిశోర్‌ 31; క్లాసెన్‌ (బి) సాయికిశోర్‌ 27; అనికేత్‌ (ఎల్బీ) సిరాజ్‌ 18; కమిందు (సి) సాయి సుదర్శన్‌ (బి) ప్రసిద్ధ్‌ 1; కమిన్స్‌ (నాటౌట్‌) 22; సిమర్జీత్‌ (బి) సిరాజ్‌ 0; షమి (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 152/8. వికెట్ల పతనం: 1-9, 2-38, 3-50, 4-100, 5-105, 6-120, 7-135, 8-135; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-17-4; ఇషాంత్‌ శర్మ 4-0-53-0; ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-25-2; రషీద్‌ ఖాన్‌ 4-0-31-0; సాయి కిశోర్‌ 4-0-24-2.

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) అనికేత్‌ (బి) షమి 5, గిల్‌ (నాటౌట్‌) 61, బట్లర్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 0, సుందర్‌ (సి) అనికేత్‌ (బి) షమి 49, రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 35, ఎక్స్‌ట్రాలు: 3 ; మొత్తం 16.4 ఓవర్లలో 153/3 ; వికెట్లపతనం : 1-15, 2-16, 3-106 ; బౌలింగ్‌: షమి 4-0-28-2, కమిన్స్‌ 3.4-0-26-1, సిమర్జీత్‌ సింగ్‌ 1-0-20-0, ఉనాద్కట్‌ 2-0-16-0, జీషన్‌ అన్సారీ 4-0-33-0, కమిందు మెండిస్‌ 1-0-12-0, అభిషేక్‌ శర్మ 1-0-18-0.

1

ఐపీఎల్‌ కెరీర్‌లో సిరాజ్‌కిదే బెస్ట్‌ బౌలింగ్‌ (4/17). అలాగే ఈ లీగ్‌లో వంద వికెట్ల (97 మ్యాచ్‌ల్లో)ను కూడా పూర్తి చేశాడు.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

ఢిల్లీ 3 3 0 0 6 1.257

గుజరాత్‌ 4 3 1 0 6 1.031

బెంగళూరు 3 2 1 0 4 1.149

పంజాబ్‌ 3 2 1 0 4 0.074

కోల్‌కతా 4 2 2 0 4 0.070

లఖ్‌నవూ 4 2 2 0 4 0.048

రాజస్థాన్‌ 4 2 2 0 4 -0.185

ముంబై 4 1 3 0 2 0.108

చెన్నై 4 1 3 0 2 -0.891

హైదరాబాద్‌ 5 1 4 0 2 -1.629

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2025 | 05:07 AM