గాయాల జాబితా చాంతాడంత!

ABN, Publish Date - Feb 17 , 2025 | 02:21 AM

భారత్‌తో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ సందర్భంగా గాయపడిన ఆస్ట్రేలియా టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ కమిన్స్‌ చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈనేపథ్యంలో అతడు టోర్నీకి దూరం కావడం కంగారూల అవకాశాలను...

గాయాల జాబితా చాంతాడంత!

అన్ని జట్ల నుంచి స్టార్‌ క్రికెటర్లు బరిలో ఉంటేనే మెగా టోర్నమెంట్లు మజా పంచుతాయి. మ్యాచ్‌లు పోటాపోటీగా సాగి ఫ్యాన్స్‌లో ఉద్వేగం, ఉత్సాహం నింపుతాయి. అటు నిర్వాహకులకు ఇటు టోర్నమెంట్‌ స్పాన్సర్లకు కావాల్సింది అదే కదా! కానీ బుధవారం నుంచి జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో పలు జట్లను..అదీ స్టార్‌ ఆటగాళ్ల గాయాల బెడద పీడిస్తోంది. తాజాగా టీమిండియా పేసర్‌ బుమ్రా గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఈనేపథ్యంలో చాంపియన్స్‌ ట్రోఫీనుంచి గాయాలతో వైదొలగిన క్రికెటర్లెవరో చూద్దాం..

కమిన్స్‌, స్టార్క్‌: భారత్‌తో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ సందర్భంగా గాయపడిన ఆస్ట్రేలియా టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ కమిన్స్‌ చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈనేపథ్యంలో అతడు టోర్నీకి దూరం కావడం కంగారూల అవకాశాలను బాగా దెబ్బ తీయవచ్చు. కమిన్స్‌తోపాటు పేసర్‌ హాజెల్‌వుడ్‌, ఆల్‌రౌండ్‌ మిచెల్‌ మార్ష్‌ సేవలనూ ఆసీస్‌ కోల్పోయింది. తుంటి గాయంతో 34 ఏళ్ల హాజెల్‌వుడ్‌ ఈ టోర్నీకి దూరమయ్యాడు. స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సేవలనూ ఆసీస్‌ కోల్పోనుంది. అయితే స్టార్క్‌ గాయంతో కాకుండా వ్యక్తిగత కారణాలతో టోర్నీలో ఆడడంలేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.


సయీమ్‌ అయూబ్‌: పాకిస్థాన్‌ బ్యాటర్‌ సయీమ్‌ అయూబ్‌ పాదం గాయంతో దూరమయ్యాడు. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ సందర్భంగా అతడికి ఆ గాయమైంది.

జాకబ్‌ బెథెల్‌: 21 ఏళ్ల ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సంచలనం బెథెల్‌ తొడ కండర గాయంతో తప్పుకొన్నాడు. భారత్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో రెండో మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు.

నోకియా: కీలకమైన టోర్నీల సందర్భంగా దక్షిణాఫ్రికా పేసర్‌ నోకియాను గాయాల రూపంలో దురదృష్టం వెన్నాడుతుంటుంది. ఈసారి వెన్ను గాయంతో అతడు వైదొలగాల్సి వచ్చింది.

అల్లా గజన్‌ఫర్‌: 18 ఏళ్ల అఫ్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ గజన్‌ఫర్‌ కూడా వెన్ను గాయంతో తప్పుకోవాల్సి వచ్చింది. కేవలం 11 వన్డేలే ఆడిన అతడు 21 వికెట్లు పడగొట్టడం విశేషం.

వీరూ అనుమానమే

ఇంకా..న్యూజిలాండ్‌కు చెందిన రచిన్‌ రవీంద్ర ముక్కోణపు వన్డే సిరీ్‌సలో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ సందర్భంగా అనూహ్యంగా గాయపడ్డాడు. క్యాచ్‌ అందుకొనే క్రమంలో ఫ్లడ్‌లైట్ల కాంతి నేరుగా కళ్లలో పడడంతో బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోయాడు. అది రచిన్‌ నుదుటిపై తగలడంతో గాయపడ్డాడు. ఇక పేసర్‌ ఫెర్గూసన్‌ కండర గాయంతో బాధపడుతున్నాడు. అలాగే గాయాలపాలైన ఇంగ్లండ్‌ కీపర్‌, బ్యాటర్‌ జేమీ స్మిత్‌ కూడా చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడడం అనుమానంగా ఉంది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)



మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2025 | 02:21 AM