Gavaskar Helps Kambli: కాంబ్లీకి గవాస్కర్ ఆపన్న హస్తం.. నెలకు రూ.30 వేల ఆర్థిక సాయం
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:49 PM
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వినోద్ కాంబ్లీకి లెజెండరీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అండగా నిలిచారు. తన స్వచ్ఛంద సంస్థ ఛాంప్స్ ద్వారా నెలకు రూ.30 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

అనారోగ్యం, కారణంగా అవస్థలు పడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని ఆదుకునేందుకు క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ముందుకొచ్చారు. తన ఛాంప్స్ ఎన్జీఓ ద్వారా కాంబ్లీకి నెలకు రూ.30 వేల ఆర్థిక సాయంతో పాటు వైద్యం కోసం సంవత్సరానికి రూ.30 వేలు ప్రకటించారు.
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌తో కలిసి వాంఖడే స్టేడియంలో కెరీర్ ప్రారంభించిన కాంబ్లీ ఆ తరువాత దారి తప్పి కెరీర్ పరంగా అగాథాలకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు అతడిని మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. గతేడాది డిసెంబర్‌లో యూరినరీ ఇన్ఫెక్షన్ల కారణంగా రెండు వారాల పాటు కాంబ్లీ ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అంతకుమునుపు కొన్నేళ్ళ నుంచి కాంబ్లీ రకరకాల అనారోగ్యాలతో ఇబ్బందులకు గురయ్యాడు. 2013లో అతడికి రెండు హార్ట్ సర్జరీలు జరిగాయి. అప్పట్లో కాంబ్లీ స్నేహితుడైన సచిన్ ఆ ఆపరేషన్లకు కావాల్సిన ఆర్థికసాయం అందించాడు.
కాంబ్లీని మళ్లీ అనారోగ్యాలు చుట్టుముట్టాయన్న విషయం గత డిసెంబర్‌లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో మహారాష్ట్ర ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి సచిన్‌తో పాటు హాజరైన కాంబ్లీ చాలా బలహీనంగా కనిపించడం అభిమానులను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో కాంబ్లీని ఆదుకుంటానని గవాస్కర్ తెలిపారు. 1983 నాటి వరల్డ్ కప్ సభ్యులందరూ కాంబ్లీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఆ తరువాత వాంఖడే స్టేడియం50 వార్షికోత్సవానికి కూడా కాంబ్లీ హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా నడిచేందుకు కూడా కాంబ్లీ ఇబ్బంది పడ్డాడు. అంత అనారోగ్యంలోనూ గవాస్కర్‌పై తనకున్న గౌరవాన్ని కాంబ్లీ చాటుకున్నాడు. ఆయనకు పాదాభివందనం చేశారు.
వాంఖడేలో కాంబ్లీ పరిస్థితి చూశాక అతడికి వెంటనే ఆర్థిక సాయం అందించాలని తన ఛాంప్స్ ఫౌండేషన్‌ను గవాస్కర్ ఆదేశించారని ఆయన స్నేహితుడు అనీల్ జోషీ తెలిపారు. వాంఖడే వార్షికోత్సవం తరువాత గవాస్కర్ స్వయంగా కాంబ్లీ వైద్యులను కలిసి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారని అన్నారు. ఆ తరువాత తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆర్థికసాయం ప్రకటించారు. అంతర్జాతీయ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించేందుకు గవాస్కర్ ఈ ఫౌండేషన్‌ను 1999లో ప్రారంభించారు. ఒకప్పుడు పిచ్‌పై సచిన్‌తో సరిసమానమైన దూకుడు కనబరిచిన కాంబ్లీ టీమిండియా తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడారు. కానీ, క్రమశిక్షనా రాహిత్యం, ఇతర వ్యక్తిగత కారణాలతో కాంబ్లీ కెరీర్ చూస్తుండగానే తిరోగమనంలోకి వెళ్లిపోయింది.
ఇవి కూడా చదవండి:
ధోనీ పనైపోయిందని అనుకోవద్దన్న గంగూలీ
అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా
మరిన్ని క్రీడా వార్తాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి