Kumaram Bheem Asifabad : కాగజ్‌నగర్‌లో ట్రా‘ఫికర్’
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:22 PM
కాగజ్‌నగర్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ప్రధాన మార్కెట్‌లో వీధివ్యాపారులు, పండ్లవ్యాపారం చేసే వారు రోడ్లపైనే అమ్మకాలు చేయటం,
-మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్
-రోడ్లపైనే అమ్మకాలు
-కాలినడక కూడా కష్టంగా ప్రజలు
కాగజ్‌నగర్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ప్రధాన మార్కెట్‌లో వీధివ్యాపారులు, పండ్లవ్యాపారం చేసే వారు రోడ్లపైనే అమ్మకాలు చేయటం, దుకాణాల వద్ద వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో కాగజ్‌నగర్ మార్కెట్‌లో నడవటం కూడా కష్టతరంగా మారుతోంది. పండుగల సమయంలో మరింత ఇబ్బంది పడాల్సి వస్తోంది. అధికారులు ఈ విషయంలో చర్యలు చేపట్టక పోవటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. కాగజ్‌నగర్‌కు చెందిన 30వార్డుల ప్రజలు వివిధ అవసరాల కోసం మెయిన్ మార్కెట్‌కు వస్తుంటారు. మెయిన్ మార్కెట్ రద్దీగా ఉంటోంది. రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ రద్దీగా ఉంటుంది. ఇందిరా మార్కెట్‌లో నిత్యం భారీ వాహనాల్లో వచ్చిన వివిధ కూరగాయాలను అన్‌లోడ్ చేస్తుంటారు. దీంతో ఈ మార్కెట్‌లో కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా మారుతోంది. పట్టణ ప్రధానరోడ్లు వెడల్పు కాలేదు. గతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసే సమయంలో రోడ్ల వెడల్పు కార్యక్రమం శ్రీకారం చుట్టినప్పటికీ రాజకీయ ఒత్తిడిల వల్ల ఈ ప్రక్రియకు బ్రేక్‌పడింది. ప్రస్తుతం రైల్వేఓవర్ బ్రిడ్జి కింది భాగానికి ఆటోలు వెళ్లాలంటే కూడా కష్టంగా ఉంది. ఈ మార్గంలోనే పేరొందిన ఆసుపత్రులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు దారి మళ్లించి వేరేమార్గాన ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి ఎన్టీఆర్‌చౌరస్తా వరకు నిత్యం ఎస్పీఎంకు సంబంధించిన లోడ్‌లారీలు వస్తుంటాయి. వీటితోపాటు ఉదయం పూట వివిధ పాఠశాలలకు చెందిన బస్సులు, ఆటోల్లో పిల్లలను తీసుకెళుతుంటారు. ఫాతీమా కాన్వెంటు పాఠశాల సమీపంలో ఉదయం, సాయంత్రం పది నిమిషాలపాటు ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ సమస్య ప్రతినిత్యం ఉంటుండగా పండుగ సమయాల్లో చెప్పనలవి కాదు. ఆయా సందర్భాల్లో అధికారులు కనీసం ఇటు వైపు చూడకపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం లోడ్ లారీలు, ఇతర వాహనాలు పాఠశాలల సమయంలో ఫాతిమాకాన్వెంటు రోడ్డు, తదితర పాఠశాల ఎదుట గల రోడ్డుపైనే నిలిపేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కేవలం ఆటోలు, ద్విచక్రవాహనాలను అనుమతిస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని పేర్కొంటున్నారు.
మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే..
కాగజ్‌నగర్ మున్సిపాల్టీకి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తే ట్రాఫిక్ సమస్య క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు చేపడితే సమస్యలు తీరుతాయని ప్రజలు పేర్కొంటున్నారు. మాస్టార్‌ప్లాన్‌లో వార్డుల్లో కూడా గల్లీల వెడల్పు చేయాలనే నిర్ణయం ఉంది. దీంతో గల్లీల్లో కూడా వాహనాలు వెళ్లేందుకు వీలు ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తే బాగుటుందని ఆయా కాలనీవాసులు పేర్కొంటున్నారు.
పండుగ పూట ఇబ్బందులు..
-సిద్దం శ్రీనివాస్, కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ పట్టణంలో మెయిన్ మార్కెట్‌లో పండుగపూట వివిధ వస్తువులు కొనుగోలు చేద్దామనుకునే ప్రజల కష్టాలు అంతా ఇంతా కాదు. ట్రాఫిక్ నిలిచిపోతుండడంతో కనీసం కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపితే బాగుంటుంది. సంక్రాంతి పండుగకు పట్టణాల నుంచి ప్రజలు వస్తుంటారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తే బాగుంటుంది.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం..
-రాజేంద్ర ప్రసాద్, సీఐ, కాగజ్‌నగర్
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డుపై వాహనాలు నిలుపరాదని సంబంధిత దుకాణాల యాజమానులకు ముందస్తుగానే హెచ్చరిస్తున్నాం. వాహనదారులు రోడ్డుపై నిలిపితే ఫైన్‌వేస్తున్నాం. ప్రధానరోడ్లపై ట్రాఫిక్‌లేకుండా పక్కాగా చర్యలు తీసుకుంటున్నాం.
Updated Date - Jan 10 , 2025 | 11:22 PM