‘యువ వికాసం’ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:26 PM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మాత్తుగా సందర్శించారు.

- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మాత్తుగా సందర్శించారు. ఇప్పటి వరకు ఈ పథకం కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని స్ధానిక ఎంపీడీవో మధుసూదన్‌ను అడిగి తెలుసుకున్నారు. 80 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం కార్యాలయం, పంచాయతీల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్ధినీలు పరీక్షలు పూర్తయి ఇంటికి వెళ్తున్న సందర్భంగా పై తరగతులకు సన్నద్దం కావాలని సూచించారు.అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని కలెక్టర్ విద్యార్ధినీలకు సూచించారు.అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. మొక్కలను సంరక్షించాలని, నీరు సమృద్ధిగా పోయాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గడువులోగా నాణ్యతతో పనులను పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు ఉన్నారు.