అమాత్య యోగం ఎవరికో?

ABN, Publish Date - Mar 26 , 2025 | 11:32 PM

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతుండడంతో పదవి ఎవరిని వరిస్తోందన్న ఉత్కంఠ నెలకొంది. కొద్దినెలలుగా రేపుమాపంటూ ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్టు సమాచారం.

అమాత్య యోగం ఎవరికో?

- మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం సన్నాహాలు

- పదవిపై జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల ఆశలు

- తెరపైకి ప్రేంసాగర్‌రావు, వివేక్‌ పేర్లు

మంచిర్యాల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతుండడంతో పదవి ఎవరిని వరిస్తోందన్న ఉత్కంఠ నెలకొంది. కొద్దినెలలుగా రేపుమాపంటూ ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్టు సమాచారం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మూడురోజులుగా ఢిల్లీలో మంత్రివర్గ కూర్పుపై జరిగిన కాంగ్రెస్‌ అగ్రనేతల భేటిలో ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురికి చోటు లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి తథ్యం అనే ప్రచారం కూడా ఉంది. ఈ విషయమై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి గెలుపొందినప్పటికీ సామాజిక సమీకరణలతో పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి రేసులో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు ఉన్నారు. వీరంతా పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఏడాదికాలంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

- ఢిల్లీ పెద్దలతో భేటీలు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మంత్రి పదవిపై ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి ప్రేంసాగర్‌రావు, వివేక్‌, వినోద్‌లు అమాత్య పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు దాదాపు 14 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తూ, ఉమ్మడి జిల్లాలోనే కాంగ్రెస్‌కు జీవం పోసిన నేతగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అట్టడుగుస్థాయికి చేరినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పార్టీ సజీవంగా ఉందంటే అది ప్రేంసాగర్‌రావు కృషి వల్లనే అనే భావన ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 60వేల పై చిలుకు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న ప్రేంసాగర్‌రావుకు మంత్రివర్గ విస్తరణలో తప్పనిసరిగా బెర్త్‌ లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తే రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి వెనుకబడ్డ కులస్తులకు, మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే జరిగితే ఎస్సీ సామాజిక వర్గంలో మాల కులస్తుడైన గడ్డం వివేక్‌కు మంత్రి విస్తరణలో అవకాశం లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. గడ్డం వివేక్‌ 2023లో చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వివేక్‌ సోదరుడైన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ సైతం మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ పెద్దలతో భేటి అయిన సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ కోట కింద అవకాశం ఇస్తే తనను పరిగణలోకి తీసుకోవాలని వినోద్‌ పట్టుబడుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవిని అలంకరించిన వినోద్‌ కూడా ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. అలాగే ఖానాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలచిన వెడ్మ బొజ్జు కూడా గిరిజన కోటాలో తనకు పదవి వరిస్తుందనే ఆశతో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమమం అయిందనే ప్రచారం మేరకు జిల్లాలో ఎక్కడ విన్నా మంత్రి పదవిపైనే చర్చ జరుగుతుండడం గమనార్హం.

Updated Date - Mar 26 , 2025 | 11:32 PM