HCU land: ఆక్రమణను అడ్డుకోండి
ABN, Publish Date - Apr 02 , 2025 | 03:59 AM
బీజేపీ తెలంగాణ ఎంపీలు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కి హెచ్‌సీయూ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఔషధ మొక్కలు, పక్షులు, ఇతర జీవరాశులు ఉంటాయి, అవి హైదరాబాద్ పర్యావరణానికి ఎంతో అవసరమని వివరించారు.

అటవీ భూములను రక్షించండి.. కేంద్ర మంత్రులకు బీజేపీ ఎంపీల వినతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): హెచ్‌సీయూ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు బీజేపీ తెలంగాణ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు, ఇతర జీవరాశులను కలిగి ఉన్న కంచ గచ్చిబౌలి భూములు హైదరాబాద్ పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని కేంద్ర మంత్రులకు వివరించారు. ఆ భూములను రక్షించాలని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, రఘునందన్ రావు, గోడం నగేశ్ కేంద్ర విద్య, పర్యావరణ మంత్రులతో భేటీ అయ్యారు. హెచ్‌సీయూ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి.. రూ.వేల కోట్లు దండుకోవాలని సర్కారు చూస్తోందని భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎంపీలు వివరించారు. కాగా, కంచ గచ్చిబౌలి భూములపై తక్షణమే నివేదిక పంపాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీలకు హామీ ఇచ్చారు.
ఢిల్లీకి కప్పం కట్టేందుకు వేలం: ఎంపీలు
హెచ్‌సీయూ భూములను అమ్ముకుని ఢిల్లీకి కప్పం కట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీలు ఈటల, అర్వింద్ మండిపడ్డారు. పర్యావరణంతో అలరారే భూముల్లో నెమళ్లు, ఔషధ మొక్కలను చంపేసి.. ఆ స్థలాలను కాంక్రీట్ జంగల్‌గా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన 400 ఎకరాల భూమి విలువ రూ.40 వేల కోట్లు అని అన్నారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఈటల, అర్వింద్ మీడియాతో మాట్లాడారు. భూములను అమ్మి, కమీషన్లు తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ ఉన్నారని మండిపడ్డారు.
లాఠీచార్జ్ అమానుషం: కిషన్‌రెడ్డి
హెచ్‌సీయూ ప్రస్తుతం స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటోందని.. ఇలాంటి సమయంలో భవిష్యత్ తరాల కోసం అవసరమైన పచ్చని వాతావరణం, అభివృద్ధి పనులు, పరిశోధనలు, యూనివర్సిటీ విస్తరణకు భూములు అవసరమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమతో అన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 400 ఎకరాలను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్‌సీయూ రిజిస్ట్రార్ తప్పుపట్టారని తెలిపారు. భూములను చదును చేయడానికి పదుల సంఖ్యలో యంత్రాలను మోహరించి రెండు రోజులుగా అర్ధరాత్రిళ్లు కూడా ఆక్రమణ పనులను చేపడుతుండటం దుర్మార్గమని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వందలాది మంది విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని, ఇది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News
Updated Date - Apr 02 , 2025 | 04:19 AM