BJP victory: బీజేపీదే గెలుపు
ABN, Publish Date - Mar 06 , 2025 | 04:39 AM
తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యం పొందారు. ఇదే జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్నీ గెలుచుకున్న బీజేపీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరోసారి పట్టు నిరూపించుకుంది.

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవసం
రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌పై 5,500 ఓట్ల ఆధిక్యం
మూడో స్థానంతో నిష్క్రమించిన ప్రసన్న హరికృష్ణ
54 మందిని ఎలిమినేట్ చేసినా రాని కోటా ఓటు
ఆధిక్యంలో ఉన్న అంజిరెడ్డిని విజేతగా ప్రకటన
రెండు స్థానాల్లో గెలుపుతో పెరిగిన కమలం పట్టు
సిటింగ్ స్థానం చేజారడంతో కాంగ్రె్‌సకు నిరాశ
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం
మా బాధ్యత మరింత పెరిగింది: కిషన్‌రెడ్డి
కరీంనగర్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి రెండో ప్రాధాన్యఓట్లతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యం పొందారు. ఇదే జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్నీ గెలుచుకున్న బీజేపీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరోసారి పట్టు నిరూపించుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమితో తన సిటింగ్ స్థానాన్ని కోల్పోయింది. 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. తొలి ప్రాధాన్యఓట్లలో ఎవరికీ కోటా ఓటు లభించక పోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్య ఓట్టను లెక్కించి అభ్యర్థి గెలుపును ప్రకటించారు.
ఈ స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోల్ కాగా, 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లుబాటైన 2,23,343 ఓట్లలో గెలుపు కోసం 1,11,672 ఓట్లను కోటా ఓట్లుగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి.
ఈ ముగ్గురికి కలిపి 2,06,659 ఓట్లు పోలవగా.. పోటీలో ఉన్న మిగతా 53 మందికి కలిపి 16,684 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డి మినహా 54 మంది ఎలిమినేట్ అయినా కోటా ఓట్లు ఎవరికి లభించలేదు. దీంతో ఆ ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డిని విజేతగా ప్రకటించారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత అంజిరెడ్డి 98,637 ఓట్లతో ప్రథమ స్థానం పొందగా, నరేందర్‌రెడ్డి 93,531 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా అంజిరెడ్డికి అదనంగా 22,962 ఓట్లు రాగా, నరేందర్‌రెడ్డికి 22,966 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ చేజారిన సిటింగ్ స్థానం..
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సిటింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి ఉన్నారు. ఈసారి పోటీకి ఆయన సుముఖత తెలపకపోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయితే మొదటి నుంచీ గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రె్‌సకు ఊహించని షాక్ తగిలింది. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా, మిత్రపక్షంగా సీపీఐ మద్దతు ప్రకటించినా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇదే నియోజకవర్గ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలను కలిగి ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించినా ఆలస్యంగా ప్రచారంలోకి దిగింది. అయినా అనూహ్యంగా పోటీ ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని ఈ ప్రాంతంలో తనపట్టును మరింత పెంచుకుంది. బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకపోగా.. పోలింగ్‌కు ఒకరోజు ముందు బీసీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ప్రకటనలు చేశారు.
ప్రభావం చూపిన చెల్లని ఓట్లు..!
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఫలితంపై చెల్లని ఓట్లు ప్రభావం చూపాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటిలో ఎక్కువ శాతం కాంగ్రె్‌సకు చెందినవే ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఇక్కడ బీసీ వాదం బలంగా వీచినా.. చెల్లని ఓట్లే ప్రసన్న హరికృష్ణను గెలుపునకు దూరం చేశాయని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
కాంగ్రె్‌సకు కౌంట్‌డౌన్: సంజయ్
కరీంనగర్ అర్బన్: రాష్ట్రంలో కాంగ్రె్‌సకు కౌంట్‌డౌన్ మొదలయిందని, ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా బుధవారం రాత్రి కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పైసలతో గెలుస్తామని ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేసిందని, పట్టభద్రులు డబ్బులను కాదని మోదీఅభివృద్ధికి పట్టంకట్టారన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎం టాంపరింగ్‌తో బీజేపీ గెలిచిందంటూ ఆరోపణలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను బ్యాలట్ ద్వారా బీజేపీ గెలిచి చూపిందని తెలిపారు.
సేవా కార్యక్రమాలతో ప్రజల్లో అంజిరెడ్డి
రామచంద్రాపురం టౌన్: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో నివాసముంటున్న చిన్నమైల్ అంజిరెడ్డి పారిశ్రామికవేత్తగా ఉన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. 2014లో ఎమ్మెల్యేగా (స్వతంత్ర అభ్యర్థిగా) పోటీచేసి ఓడిపోయారు. పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉంటున్నారు. వేలాది మంది నిరుపేదలకు అంజిరెడ్డి ఉచితంగా వైద్య సేవలు అందించారు. నిరుపేద కార్మికుల కుటుంబాలకు ప్రమాద బీమా కల్పించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో తెల్లరేషన్‌కార్డు ఉన్నవారికి ఉచితంగా ఆరోగ్యభీమా కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, పరికరాలు పంపిణీ చేశారు. గ్రామాల్లో యువజన సంఘాలకు క్రీడా పరికరాలుఅందించడమే కాకుండా క్రీడా పోటీలు నిర్వహించిన బహుమతులు అందజేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూలింగ్ వాటర్ పరికరాలు అందించారు.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 06 , 2025 | 07:37 AM