Hyderabad Cricket Association: హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదం.. సీఎం సీరియస్
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:57 AM
హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విజిలెన్స్ విచారణకు ఆదేశం.. విచారణాధికారిగా కొత్తకోట
ఎస్‌ఆర్‌హెచ్‌ను వేధిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరిక
ఉచితంగా కాదు.. డబ్బులకే అడిగాం.. హెచ్‌సీఏ వెల్లడి
ఇచ్చిన హామీని ఎస్‌ఆర్‌హెచ్ నిలబెట్టుకోలేదని ఆరోపణ
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎ్‌సఆర్‌హెచ్) యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాంప్లిమెంటరీ పాసుల విషయంలో తమపై హెచ్‌సీఏ ఒత్తిడి తెస్తోందని, వేధింపులకు గురి చేస్తోందని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఆరోపించిన విషయం తెలిసిందే..! హెచ్‌సీఏ తీరు మారకపోతే.. హైదరాబాద్ నుంచి ఐపీఎల్ వేదికను మార్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ వివాదం ముదిరి.. సీఎం దృష్టికి వెళ్లింది. దీంతో.. ఆయన విచారణకు ఆదేశిస్తూ.. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయనను ఆదేశించారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఎవరు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనిఫాం ఆఫీసర్లయినా, ఇతరులెవరైనా ఉపేక్షించేది లేదన్నారు. కాగా.. ఈ అంశంపై హెచ్‌సీఏ స్పందించింది. తాము కోటాకు మించి కాంప్లిమెంటరీ పాసులను ఎన్నడూ అడగలేదని పేర్కొంటూ.. సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘హెచ్‌సీఏ క్లబ్ సెక్రటరీలకు ఇచ్చే పాసులు సరిపోక.. మరికొన్ని పాసులను డబ్బులిచ్చి కొనుగోలు చేయడానికి అవకాశమివ్వాలని కోరాం. అందుకు ఎస్‌ఆర్‌హెచ్ అంగీకరించింది. ఆ తర్వాత ఇలా ఈమెయిల్స్‌ను లీక్ చేయడం పద్ధతికాదు’’ అని ఆ ప్రకటనలో వివరించింది. స్టేడియంలో సీట్ల మార్పు సమయంలో.. ఆరెంజ్ రంగు సీట్లకు అయ్యే వ్యయంలో రూ.10 కోట్ల వరకు సీఎ్‌సఆర్ నిధుల కింద అందజేస్తామని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ముందు పేర్కొన్న ఎస్‌ఆర్‌హెచ్.. ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించింది. ఆ నిధులను అడిగితే.. స్టేడియానికి రంగులు వేయడానికి ఖర్చుచేశామని చెప్పిన ఎస్‌ఆర్‌హెచ్.. పనుల వివరాలు మాత్రం చెప్పడం లేదని వివరించింది. ఇప్పటికైనా ఈమెయిల్ రాయబారాలను కట్టిపెట్టి, సమస్య పరిష్కారానికి హెచ్‌సీఏ కార్యవర్గంతో చర్చించేందుకు ముందుకు రావాలని ఎస్‌ఆర్‌హెచ్‌ను కోరింది.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News