మాతాశిశు మరణాల నివారణకు కృషి చేయాలి
ABN, Publish Date - Apr 08 , 2025 | 12:33 AM
మాతా శిశు మరణాల నివారణకు కృషిచేయాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి అన్నారు.

నల్లగొండటౌన్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): మాతా శిశు మరణాల నివారణకు కృషిచేయాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ‘ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తు’ అనే అంశంపై ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సామాజిక వ్యాధి నివారణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మెడికల్ విద్యార్థులు సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని మధురానగర్ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు పౌష్ఠికాహారాన్ని తీసుకోవడమే కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం ప్రతీ సంవత్సరం సుమారు మూడు లక్షల మంది మహిళలు ప్రసవం సందర్భంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి నవజాత శిశువుల ఆరోగ్యమే కుటుంబాలు, సమాజాల శ్రేయస్సును ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తుందన్నారు. తల్లి గర్భం దాల్చడానికి ముందునుంచే గుడ్లు, పాలు, ఆకు కూరలు, ఇతర కూరగాయలు, పండ్లు వంటి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, పిల్లలకు అందజేసే పౌష్ఠికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భధారణ సమయంలో హానికరమైన పదార్థాలకు (పొగాకు, మద్యం వంటివి) దూరంగా ఉండాలని అన్నారు. అనంతరం పిల్లలు, గర్భిణులకు ప్రిన్సిపాల్ పౌష్టికాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భాగ్యరేఖ, ట్యూటర్లు డాక్టర్ శ్వేత, మధులత, హెల్త్ ఎడ్యుకేటర్లు స్వామి, నాగలక్ష్మి, జ్యోతి, ఆఫీస్ సిబ్బంది, ఆశా వర్కర్, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Apr 08 , 2025 | 12:33 AM