Dr Nageshwar Reddy: ఫ్యాటీ లివర్‌ను తేలిగ్గా తీసుకోవద్దు
ABN, Publish Date - Mar 17 , 2025 | 03:33 AM
అందరూ శరీరానికి కేంద్రస్థానం గుండె అని అనుకుంటారు. కానీ.. అది కాలేయం అని.. అంతటి కీలకమైన అవయవానికి ఏవైనా సమస్యలొస్తే మొత్తం శరీరంపైనా ఆ ప్రభావం పడుతుందని.. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
నిర్లక్ష్యం చేస్తే కాలేయ క్యాన్సర్ ముప్పు
బీపీ, షుగర్, హృద్రోగాలకూ దారితీస్తుంది శారీరక శ్రమ లేకపోవడం, ప్రాసెస్డ్ ఆహారం,
జన్యు కారణాలతోనూ వచ్చే ప్రమాదం
పెద్దగా ఖర్చు లేకుండా ఏఐ ద్వారా దీన్ని గుర్తించే విధానాన్ని మేం అభివృద్ధి చేశాం
పదేళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలనూ జన్యు పరీక్ష ద్వారా గుర్తించే పరిజ్ఞానం
సెల్ డొనేషన్, జన్యుమార్పిడి జంతువులతో సులువు కానున్న అవయవమార్పిడి
రక్తపోటు, మధుమేహం, కుంగుబాటు వంటివాటికి మలం క్యాప్సూల్స్‌తో వైద్యం
వచ్చే 2-3 ఏళ్లలో విప్లవాత్మక వైద్యవిధానాలు ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
ఏడాదికొకసారి ఆరోగ్య పరీక్షలు
క్యాన్సర్ వచ్చినట్టు తెలిస్తే.. ‘అమ్మో’ అని చికిత్స తీసుకుంటున్నారు. కానీ.. బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు నిశ్శబ్దంగా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇది తెలియక చాలామంది పట్టించుకోవట్లే. నా సలహా ఏంటంటే.. ఏడాదికి ఒకసారి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడు చాలా సమస్యలను మనం ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆహారపుటలవాట్లను మార్చుకోవడం, మందుల వాడకం ద్వారా వాటిని అదుపులో ఉంచుకోవచ్చు.
(హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి): అందరూ శరీరానికి కేంద్రస్థానం గుండె అని అనుకుంటారు. కానీ.. అది కాలేయం అని.. అంతటి కీలకమైన అవయవానికి ఏవైనా సమస్యలొస్తే మొత్తం శరీరంపైనా ఆ ప్రభావం పడుతుందని.. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మరీ ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య చాలా ప్రమాదకరమని, దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది గుండెకు చేటు చేస్తుందని, అధిక రక్తపోటు, మధుమేహం తదితర ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఫ్యాటీ లివర్‌కు చికిత్స తీసుకోకపోతే కాలేయ క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉందని.. పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసుల కారణంగా మనదేశం లివర్ క్యాన్సర్ రాజధానిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు.. ప్రజల్లో పెరుగుతున్న ప్రాసెస్డ్ ఆహార వినియోగం గురించి, జన్యుక్రమం ఆధారంగా చికిత్సలు, అవయవ దానానికి బదులుగా సెల్ డొనేషన్, వైద్య పరిశోధనలు విస్తృతంగా పెరగాల్సిన అవసరం.. తదితర అంశాలపై ఆయన సవివరంగా మాట్లాడారు. అందులో కొన్ని ముఖ్యాంశాలు..
ఫ్యాటీ లివర్ కేసులు ఎలా పెరుగుతున్నాయి
మనకి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో దేశంలో 10ు మందిలో ఈ సమస్య ఉండేది. అదిప్పుడు 40 శాతానికి చేరింది. చివరికి బడికెళ్లే పిల్లల్లో సైతం మేం పరీక్షలు చేయిస్తే.. 40ు మందికి ఆ సమస్య ఉన్నట్టు తేలింది. మొదటి రెండు దశల్లో ఉన్నప్పుడు దీన్ని గుర్తిస్తే.. కొన్ని ఔషధాలు, జీవనశైలి మార్పులతో రివర్స్ చేయగలం. మూడో దశలో గుర్తిస్తే.. రివర్స్ చేయలేం. దాని తీవ్రతను మాత్రమే తగ్గించగలం. ఫ్యాటీ లివర్‌ను గుర్తించి సరైన చికిత్స చేయించుకోకపోతే.. దాని ప్రభావం గుండె, మూత్రపిండాలపైన కూడా పడుతుంది. రక్తపోటు పెరుగుతుంది. ఉదాహరణకు.. గుండెపోటుతో వచ్చే చాలామందికి వైద్యపరీక్షల్లో ఫ్యాటీలివర్ కూడా ఉన్నట్టు తేలుతుంది. ఆ విషయం చెప్తే.. ‘అవును సార్, పదేళ్ల నుంచి నాకు ఈ సమస్య ఉంది’ అని అప్పుడు చెప్తారు. వారు ఆ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల దాని ప్రభావం గుండెపై పడిందన్న విషయం వారికి అప్పుడు తెలుస్తుంది. కాబట్టి, ఫ్యాటీ లివర్ అంత ప్రమాదకరం కాదులే అనే దృక్పథాన్ని మార్చుకోవాలి.
కారణం ఏమిటి? ఎలా గుర్తించాలి?
ఇటీవల పెరిగిన జంక్ ఫుడ్ వినియోగం.. దానికితోడు సరైన వ్యాయామం లేకపోవడం ఫ్యాటీ లివర్ సమస్యను మరింత పెంచుతోంది. దురదృష్టవశాత్తు కొంతమందిలో జన్యుపరంగానూ ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాటీ లివర్ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. స్కానింగ్‌లు చేయాల్సి వస్తుంది. కానీ మేం కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా.. ఫ్యా టీలివర్ డయాగ్నోసి్‌సను సులభతరం చేశాం. నాలుగు సాధారణ రక్త పరీక్షలు (సీబీపీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, ప్లేట్‌లెట్స్) చేసి వాటిలో వచ్చే ఫలితాలను ఏఐ ద్వారా విశ్లేషించి ఫ్యాటీ లివర్ ఉందీ లేనిదీ తెలుసుకునే ప్రక్రియను రూపొందించాం. ఇప్పటికే 10 వేల మందిపై దీన్ని పరీక్షించాం. ఈ పరిశోధన ఫలితాల్ని.. ఏఐ టూల్‌ను త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకొస్తాం. దీంతో.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫ్యాటీ లివర్‌ను తేలిగ్గా గుర్తించే వీలు కలుగుతుంది.
ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఆహారం అస్సలు తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ తాగకూడదు. రోజుకు గంట వ్యాయామం చేయాలి. ప్రజల్లో చాలామందికి ఇవన్నీ తెలుసు. అయినా చేయరు. నా దగ్గరకు వచ్చే వారిలో చాలామంది తాము చాలా బిజీ అంటారు. వాళ్లను నేను అడిగేది ఒక్కటే ప్రశ్న.. ‘మీరు నా కంటే బిజీనా?’ అని. నేను ఉదయం ఆరున్నర గంటలకు ఆస్పత్రికి వస్తాను. రాత్రి పదకొండున్నర వరకూ పని చేస్తాను. పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకూ గంట పాటు వ్యాయామం చేస్తాను.
జన్యుపరీక్షల ద్వారా ముందే తెలుసుకోవచ్చా?
శరీరంలో జన్యువుల పరిస్థితిని పరీక్షించడానికి.. మా దగ్గర లైఫ్ స్టైల్ క్లినిక్ ప్రారంభించాం. అక్కడ జన్యుపరీక్షలు జరిపి రోగి మొత్తం జన్యుక్రమం పరిస్థితిని అంచనా వేస్తాం. తద్వారా సదరు వ్యక్తికి పదేళ్ల తర్వాత క్యాన్సర్ వస్తుందా? బీపీ, ఫ్యాటీ లివర్ వస్తుం దా? చివరకు ఏ వయసులో బట్టతల వస్తుందన్న వివరాలు కూడా చెప్పొచ్చు. ఈ పరీక్షకు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. శరీరంలో జన్యువులు శాశ్వతం కాబట్టి.. ఈ పరీక్షను జీవితంలో ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుంది. దీంతోపాటు, ఫార్మకోజీనోమిక్స్ మీదా మేం దృష్టి కేంద్రీకరించాం. రోగుల శరీర తత్వం ఆధారంగా వారికి ఏ మందు బాగా పనిచేస్తుందో తెలుసుకుని ఆ మందులు ఇచ్చే పద్ధతి ఇది. ఉదాహరణకు.. ఒకే రోగానికి వాడే ట్యాబ్లెట్ ఒకరికి రోజుకు ఒకటి వేసుకుం టే సరిపోతుంది. మరికొందరికి రెండు రోజులకు ఒకటి వేసుకోవాల్సి రావచ్చు. ఏ జన్యువు ఏ ఔషధానికి ఎలా స్పందిస్తుందన్నది ఫార్మకోజీనోమిక్స్ ద్వారా తెలుస్తుంది. అందుకే నా దగ్గరకు వచ్చే వారికి మందులు రాయబోయే ముందు.. వారి ని ఈ పరీక్ష చేయించుకోమని చెబుతాను. దీనికి రూ.5 వేల దాకా అవుతుంది. దీన్ని కూడా జీవితంలో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మనదేశంలో ఈ పరీక్ష మా దగ్గర మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐదారు ఆస్పత్రుల్లోనే ఇలా చేస్తున్నారు.
ఆరోగ్యంలో గట్ బ్యాక్టీరియా పాత్ర ఏమిటి?
బ్యాక్టీరియా మన శరీరాన్ని నియంత్రిస్తుంది. అందు నా గట్ బ్యాక్టీరియా మన ఆరోగ్యంలో కీలక భూమిక పోషిస్తుంది. మనం తినే ఆహారాన్ని కడుపులో ఉండే సూక్ష్మజీవులు వాడుకుని.. కొన్ని రసాయనాలను ఉత్ప త్తి చేస్తాయి. ఆ రసాయనాలు మన ఆరోగ్యంలో ము ఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే మా దగ్గర నాలుగేళ్లుగా బ్యాక్టీరియాకు సంబంధించిన జీనోమికల్ అనాలసిస్ చేస్తున్నాం. దీంతో ఒక్కొక్కరి శరీరంలో ఉన్న బ్యాక్టీరియా ఆధారంగా వారు ఏ ఆహారం తింటే మంచిది? ఎలాంటి ఆహారం తినకూడదు? అనే విషయాన్ని చెప్పగలం. కొందరిలో వారు తీసుకునే ఆహారమే వారిలో కుంగుబాటుకూ కారణమవుతుంది!
ఏఐజీలో చేస్తున్న ఇతర పరిశోధనలేమిటి?
ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.. బ్యారీ మార్షల్ పేరిట ప్రత్యేకంగా ఒక ల్యాబ్ ను ఏర్పాటు చేశాం. అందులో అనేక పరిశోధనలు చేస్తున్నాం. మరో రెండు నెలల్లో మేం బ్యాక్టీరియా పర్సనలైజడ్ మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. దీని ద్వారా.. బాధితుల పేగుల్లో ఏ బ్యాక్టీరియా తక్కువ ఉందో గమనించి దానికి తగ్గ క్యాపూల్స్ వేస్తాం. ఈ క్యాప్సూల్స్‌ను ‘స్టూల్ (మలం)’ నుంచి సేకరించి తయారు చేస్తారు. ఉదాహరణకు కొంతమంది ఎంత తిన్నా సన్నగా ఉంటారు. అలా సన్నగా ఉన్న వ్యక్తికి సంబంధించి స్టూల్‌ను క్యాప్యూల్స్ రూపంలో తీసుకుని లావుగా ఉన్న వారికి ఇస్తే సన్నగా అవుతారు. వారానికి ఒకసారి చొప్పున ఏడాది పాటు వేసుకుంటే వారు సులువుగా సన్నబడే అవకాశం ఉంటుంది. అమెరికాలో అల్సరేటివ్ కొలైటిస్ సమస్యతో బాధపడుతున్న ఒక మహిళకు.. ఆరోగ్యవంతుడైన దాత నుంచి స్టూల్స్ సేకరించి క్యాప్యూల్ రూపంలో ఇస్తే ఆ సమస్య తగ్గింది. కానీ, సన్నగా ఉండే ఆమె లావుగా అయ్యింది. ఆ ఘటన ఆధారంగా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే, మలాన్ని క్యాప్సూల్ రూపంలో ఇస్తామంటే ఎవరూ అంగీకరించరు కాబట్టి.. పొడి రూపంలోకి మార్చి ఇస్తున్నాం. వాటిని ‘క్రాప్‌స్యూల్స్’ అంటారు. ఇప్పుడున్న చాలా మందులకు బదులుగా భవిష్యత్తులో ఇవే వస్తాయి. బీపీకి ఒక క్రాప్‌స్యూల్.. షుగర్‌కి ఒకటి.. ఇలా వస్తా యి. మధుమేహానికి సంబంధించి ఒక బ్యాక్టీరియాను (అకర్‌మెన్సియా మ్యూసినోఫిలా) ఇప్పటికే కనుగొన్నారు. ఆ బ్యాక్టీరియా ఇస్తే.. ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, మధుమేహం వంటివి తగ్గిపోతాయి.
అవయవ దానం నిబంధనల్ని మార్చాలా..?
పదేళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ, తమిళనాడులో అవయవదానం పెరిగింది. మన రాష్ట్రంలో జీవన్‌దాన్ ద్వారా బాగా చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ఇందులోని సమస్య ఏంటంటే.. అవయవాలను బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా ఉన్నాయి. బ్రెయిన్‌డెడ్ అయినవారి కుటుంబాల భావోద్వేగాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు ఈ నిబంధనల్ని దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తలు అవసరం. అలా గే దీనిపై దేశమంతా ఒకే విధానం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతి. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ లో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల నుంచి తీసుకోవచ్చు. మన రాష్ట్రంలో మాత్రం కుటుంబ సభ్యుల (భార్య, భర్త, కూతురు, కొడుకు) నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలా అని నిబంధనల్ని సరళతరం చేస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది.
అవయవదానం భవిష్యత్‌లో ఎలా ఉండనుంది?
రానున్న రోజుల్లో అవయవదానం కంటే సెల్ డొనేషన్ ఎక్కువ కానుంది. మన శరీరంలో బోన్ మ్యారో నుంచే అన్ని కణాలూ వస్తాయి. కాలేయంగానీ, గుండెగానీ.. అన్నీ దాన్నుంచే వస్తాయి. బోన్ మ్యారో నుంచి ప్రైమరీ సెల్స్‌ను తీసుకొని వాటిని ల్యాబ్‌లో కాలేయంగా, మూత్రపిండంగా మార్చవచ్చు. అందుకే మేం దీనికి సంబంధించి ఒక ‘స్టెమ్‌సెల్ ల్యాబ్’ను ఏర్పాటుచేశాం. అక్కడ మేం ఇప్పటికే బోన్‌మ్యారో కణాలను కాలేయకణాలుగా మార్చి 50 మంది పేషెంట్లకు కాలేయ మార్పిడి అవసరం లేకుండా చికిత్స చేశాం. భవిష్యత్తులో ఈ విధానం గొప్పగా అభివృద్ధి చెందనుంది. లివర్ సిర్రోసిస్, హృద్రోగాలు, మధుమేహం.. అన్నింటికీ ఈ విధానంలో చికిత్స చేయొచ్చు. అలాగే.. జన్యుమార్పిడి చేసిన జంతువుల అవయవాలను కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మార్పిడి చేసే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇలా సెల్‌డొనేషన్, జన్యుమార్పిడి జంతువుల అవయవాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో అవయవ మార్పిడి పెద్ద సమస్య కాబోదు.
బీమా ప్రీమియం భారంగా మారడంపై..?
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ సందర్భంగా అమెరికాలో తీసుకొచ్చిన ఒబామా కేర్ గురించి చెప్పాలి. బీమా సంస్థలతో ఒబామా ఎంతో పోరాటం చేశారు. ప్రీమియంలకు పరిమితులు పెట్టారు. ట్రంప్ వచ్చిన తర్వాత కూడా దాన్ని మార్చలేదు. అలాంటి విధానం మన దేశంలోనూ తీసుకురావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. ప్రివెంటివ్ కేర్‌ను కూడా బీమా పరిధిలోకి తీసుకురావాలి. వినియోగదారుల వైద్యపరీక్షలకు అయ్యే మొత్తాన్ని బీమా సంస్థలు భరించేలా చర్యలు తీసుకోవాలి.
వైద్య పరిశోధన రంగంలో మనం ఫోకస్ చేయాల్సిన అంశాలేంటి?
ఇంజనీర్లు.. వైద్యులు కలిసి పని చేస్తే వైద్యరంగంలో అద్భుతాలు సాధించొచ్చు. మనం పెద్దగా పట్టించుకోని ఈ అంశానికి చైనా, అమెరికా బాగా ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేం ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఆరు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాం. ట్రిపుల్ ఐటీ, బెంగళూరులతో కలిసి కొత్త ఔషధాలు, యంత్రాల తయారీపై పరిశోధనలు చేస్తున్నాం. ఇలా మేం అభివృద్ధి చేసిన ఒక హై ఫ్రీక్వెన్సీ అలా్ట్రసౌండ్ పరికరంతో.. సర్జరీ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కణాలను నాశనం చేయవచ్చు.
బిజీగా ఉంటూ పరిశోధనలెలా చేస్తున్నారు?
మా నాన్నగారు పాథాలజిస్టు. ఆయన పరిశోధనల కు చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక రోజు పిలిచి.. ‘‘నువ్వో పెద్ద ఫెయిల్యూర్’’ అన్నారు అకస్మాత్తుగా. అప్పటికే దేశంలో పేరున్న గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల్లో ఒకడినైన నన్ను అలా ఎలా అంటారని అడిగితే.. ‘‘నువ్వు పరిశోధనలు చేస్తున్నావా? నీవి ఎన్ని రిసెర్చ్ పేపర్లు పబ్లిష్ అయ్యా యి?’’ అని అడిగారు. 35 ఏళ్ల క్రితం జరిగిందిది. అప్పటికే మా నాన్నగారి పరిశోధనలకు సంబంధించి నాలు గు వందల రిసెర్చ్ పేపర్లు పబ్లిష్ అయ్యాయి. ఆయన అలా అడిగాక నాలో ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి పరిశోధనల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాను. నావి ఇప్పటికి 1100 పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. దేశంలోనే అత్యధికం ఇది. భవిష్యత్ తరాలకు నా వంతుగా చేయాల్సింది చేస్తున్నా.
మంచి అలవాట్లు
ఆరోగ్య కరమైన ఆహారం తినడం, రోజూ వ్యా యామం చేయడం, ప్రాసెస్డ్ ఆహారానికి, ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండడం, ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్లు. పండ్ల రసాలు తాగ డం కన్నా.. పండ్లు తినడం మంచిది. అలా్ట్రప్రాసెస్డ్ ఫుడ్‌ను నిరుత్సాహపరిచే విషయంలో ప్రభుత్వాలు సెలెబ్రిటీల సహాయం కూడా తీసుకోవాలి. సినీనటు లు చెప్తే ప్రజలు విని పాటించే ప్రయత్నం చేస్తారు.
రైస్‌బ్రాన్ ఆయిల్.. ఆలివ్ నూనెతో సమానం
అసలు మన ఆహారంలో నూనెల వినియోగం తగ్గించాలి. అన్ని నూనెల్లోకీ రైస్‌బ్రాన్ అయిల్ ఉత్త మం. దాన్ని తయారుచేసింది మన హైదరాబాద్ ఐఐసీటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)నే అనే విషయం చాలా మందికి తెలియదు. శాచురేటెడ్ ఆయిల్స్ (సంతృప్త నూనెలు-కొబ్బరి నూనె, పామాయిల్ వంటివి) మంచివి కా వు. రైస్‌బ్రాన్ ఆయిల్ ఆలివ్ ఆయిల్‌తో సమానం.
Updated Date - Mar 17 , 2025 | 03:35 AM