Telangana Investment Hub: విశ్వావసులో రియల్ పరుగులు
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:09 AM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల నగరంగా, లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉగాది వేడుకల్లో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, రియల్ ఎస్టేట్, పెట్టుబడుల ప్రోత్సాహంతో ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు.

ప్రజలు మెచ్చేలా రేవంత్ రెడ్డి పాలన.. సీఎంకు బుధ మహర్దశ.. కానీ విపరీతమైన నరఘోష
పంచాంగ శ్రవణంలో సంతో్‌షకుమార్ శాస్త్రి
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
పెట్టుబడుల నగరం ‘ఫ్యూచర్ సిటీ’ : సీఎం
రవీంద్రభారతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ.. పెట్టుబడుల నగరమని, లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన ఉగాది వేడుకలను ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులు భద్రాచలం రాములవారి కళ్యాణానికి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం పండితులు బాచంపల్లి సంతో్‌షకుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. విశ్వావసు నామ సంవత్సరంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుందని చెప్పారు. పాలకులకు పాలన భారమైనప్పటికీ, విశ్వావసు నామ సంవత్సరంలో ధనం వస్తుందని, రిజిస్ర్టేషన్లు పెరిగి రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుందన్నారు. రాజు ఒంటి చేత్తో బాధ్యతలు మోస్తారని, సేనాధిపతి శని అయ్యాడని, శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తారని అన్నారు. ఉభయ రాష్ట్రాల పాలకులు పోటీపడి పని చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలకు ఇబ్బంది లేదని, పంటలు పండుతాయని, ఎర్రటి భూములు మంచి ఫలితాలు ఇస్తాయని తెలిపారు. నీళ్ల విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఇబ్బందులు వస్తాయని, కానీ ముఖ్యమంత్రి వాటిని అధిగమిస్తారని చెప్పారు. పాలనలో ఆచితూచి అడుగులు వేయాలని, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం అధికంగా జరుగుతుందని తెలిపారు.
సీఎంకు విపరీతమైన నరఘోష
పంచామాధి, సప్తామాధిపతి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డికి బుఽధుడి మహాదశ మొన్ననే ప్రారంభమైందన్నారు. సీఎంకు పేరు ప్రఖ్యాతలతో పాటు విపరీతమైన నరఘోష కలిచివేస్తోందని అన్నారు. దీంతో సీఎం రేవంత్ చిరునవ్వులు చిందిస్తూ పండితుడి వైపు చూసి ఆయన మాటలను ఆసక్తిగా విన్నారు. వృశ్చికరాసి, వృశ్చిక లగ్నం ప్రధానమంత్రిదని, ఈ ఏడాది ఆయనకు మధ్యస్థ స్థితిలో ఉంటుందన్నారు.
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ....
ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయికలా ఉందని అన్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిసున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రజలు నివసించే నగరమే కాదని, పెట్టుబడుల నగరమని అన్నారు. శ్రీమంతుల మాదిరే పేదలు కూడా సన్నబియ్యం తినాలని ఆకాంక్షించారు. కాగా, తెలుగుదనం ఉట్టిపడేలా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
పథకాలు బాగు, పంటలు మెండు!
విశ్వావవసు నామ సంవత్సరంలో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, పంటలు విశేషంగా పండుతాయని పంచాంగ శ్రవణ కర్త శ్రీనివాస మూర్తి వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలూ బాగుగా అమలవుతాయన్నారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది వరి, తృణధాన్యాలు అధికంగా పండుతాయని, విదేశాలకు ఎగుమతి జరుగుతుందన్నారు. అదనపు విద్యుత్ ఉత్పత్తి జరిగి విద్యుత్ కొరత ఉండే అవకాశం తక్కువగా ఉందన్నారు. నూతన పరిశ్రమలు వస్తాయని, దేశమంతా గృహ నిర్మాణ పథకాలు బాగా అమలవుతాయని చెప్పారు. దేశ సరిహద్దుల్లో యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం రేవంత్, మంత్రులు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తున్నారని, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలని టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News