HCA SRH Dispute: సమసిన హెచ్‌సీఏ వివాదం
ABN, Publish Date - Apr 02 , 2025 | 02:47 AM
హెచ్‌సీఏ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉన్న వివాదం సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ముగిసింది. పాత ఒప్పందం ప్రకారం, ఇరు వర్గాలు 10% కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వటానికి అంగీకరించాయి.

ఉదయం విజిలెన్స్ విచారణ.. సాయంత్రం రాజీ
సన్‌రైజర్స్‌తో పాత ఒప్పందానికే హెచ్‌సీఏ అంగీకారం
సీఎం రేవంత్ ఘాటు హెచ్చరికతో సర్దుకున్న పెద్దలు
వివాదం సద్దుమణిగిందంటూ సంయుక్త ప్రకటన
సీఎంకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ కృతజ్ఞతలు
ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ
అడి ్మనిస్ట్రేటి వ్ సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యాజమాన్యం మధ్య వివాదం సద్దుమణిగింది. సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు హెచ్చరికల నేపథ్యంలో ఇరు వర్గాలు రాజీకి వచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగగా.. సాయంత్రానికి సీన్ మారిపోయింది. హెచ్‌సీఏ పెద్దలు, సన్ రైజర్స్ ప్రతినిధుల మధ్య పలు ధపాలు చర్చలు జరిగాయి. నిబంధనల ప్రకారమే కాంప్లిమెంటరీ పాసులు ఇస్తామని, అదనంగా ఒక్క పాస్ కూడా ఇవ్వబోమని ఎస్‌ఆర్‌హెచ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో.. హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ దానికే అంగీకరించింది. ఈ మేరకు ఇరువురు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బీసీసీఐ, ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య గతంలో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు పేర్కొన్నారు. పాత ఒప్పందం ప్రకారమే.. స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో పదిశాతం కాంప్లిమెంటరీ పాసులను హెచ్‌సీఏకు ఇచ్చేందుకు ఎస్‌ఆర్‌హెచ్ అంగీకరించింది. ఇక ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌కు పూర్తిగా సహకరిస్తామని హెచ్‌సీఏ స్పష్టమైన హామీ ఇచ్చింది.
దీంతో వివాదాలన్నీ ముగిశాయని హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్.దేవరాజ్ నేతృత్వంలో జరిగిన చర్చల్లో ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ పాల్గొని వివాదానికి ముగింపు పలికారు.
ఉదయమే రంగంలోకి విజిలెన్స్..
హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య వివాదంపై విచారణ జరపాలన్న సీఎం రేవంత్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు మంగళవారం ఉదయమే రంగంలోకి దిగారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ రూరల్ విభాగం విజిలెన్స్ అధికారులు అదనపు ఎస్పీ పాల్వాయి శ్రీనివా్‌సరెడ్డి నేతృత్వంలో ఉప్పల్‌లోని క్రికెట్ స్టేడియానికి వెళ్లారు. అక్కడి హెచ్‌సీఏ కార్యాలయంలో విచారణ జరిపారు. హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన ఒప్పందాలేంటి? వారి మధ్య చోటుచేసుకున్న ఈ-మెయిల్ సంభాషణలేంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్) నిధుల విషయంలో ఏం జరిగింది? అనే విషయాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. సీఎ్‌సఆర్ నిధుల కింద రూ.10 కోట్లను స్టేడియం అభివృద్ధికి ఇస్తామన్న ఎస్‌ఆర్‌హెచ్.. ఆ నిధులను ఇవ ్వకుండా స్టేడియానికి రంగులు వేయించడానికి ఖర్చు చేసినట్లు చెబుతోందని హెచ్‌సీఏ ప్రతినిధులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతోపాటు కాంప్లిమెంటరీ పాసుల విషయంలో వచ్చిన ఆరోపణలపైనా విజెలెన్స్ బృందం విచారణ జరిపింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు సంబంధించి సీటింగ్ కెపాసిటీలో పదిశాతం వాటా ప్రకారం 3900 పాసులను హెచ్‌సీఏకు ఇచ్చేందుకు తాము అంగీకరించగా.. మరో 3900 పాసులు కావాలంటూ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కోరినట్లు ఎస్‌ఆర్‌హెచ్ చెబుతుండడం తెలిసిందే. అయితే వాటిని డబ్బులిచ్చి కొంటామని చెప్పినట్లు హెచ్‌సీఏ పేర్కొంది.
సీసీ ఫుటేజీ కోసం ఆరా..
కాంప్లిమెంటరీ పాసులు దుర్వినియోగమయ్యే అవకాశమున్నందున.. హెచ్‌సీఏ ఖాతా నుంచి నిధులు చెల్లిస్తే మరో వెయ్యి పాసులు ఇస్తామని తమ ప్రతినిధులు చెప్పినట్లు, దీంతో వారిపై జగన్మోహన్‌రావు స్టేడియంలోనే దూషణలకు దిగినట్లు ఎస్‌ఆర్‌హెచ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ కోసం విజిలెన్స్ అధికారులు ప్రయత్నించారు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ నుంచి తాను అడిగినన్ని టికెట్లు అందకపోవడంతో ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా వీవీఐపీలు కూర్చునే ఎఫ్3 బాక్స్‌కు జగ న్మోహన్‌రావు తాళం వేయించారని, తాము బతిమలాడి 2వేల పాస్‌లు ఇస్తేనే తాళాలు తెరిచారని ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు ఆరోపించారు. దీంతో ఈ అంశంపైనా అధికారులు విచారణ జరిపారు. మ్యాచ్ రోజు ఎఫ్-3 బాక్స్‌కు తాళం వేశారా? ఆరోపణలు నిజమేనా? అనే కోణంలో విచారణ చేశారు. అయితే సాయంత్రానికి ఇరువర్గాలు రాజీకి రావడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో, ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్య పరిష్కారమయ్యేలా చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డికి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News
Updated Date - Apr 02 , 2025 | 02:47 AM