High Court : బతుకమ్మ కుంట కేసులో హైడ్రా విజయం
ABN, Publish Date - Jan 08 , 2025 | 04:06 AM
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. బతుకమ్మ కుంటను కుంటగానే గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘అగ్రిమెంట్ ఆఫ్
కుంటగానే గుర్తిస్తూ హైకోర్టు తీర్పు
ఎడ్ల సుధాకర్‌రెడ్డి పిటిషన్ కొట్టివేత
త్వరలో చెరువు పునరుద్ధరణకు చర్యలు
హైదరాబాద్, జనవరి 7(ఆంధ్రజ్యోతి): అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. బతుకమ్మ కుంటను కుంటగానే గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘అగ్రిమెంట్ ఆఫ్ సేల్’ ఆధారంగా మూడు దశాబ్దాలుగా సదరు స్థలం తమదేనంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. కుంటను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు హైడ్రాకు సంబంధిత పత్రాలు అందజేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నవంబరు 13న సందర్శించి, అదే రోజు కుంట పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర స్టే జారీ అయింది. ఆ తర్వాత హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు భూ రికార్డులు పరిశీలించి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. సుధాకర్ రెడ్డికి సదరు భూమిపై ఎలాంటి హక్కులు లేవని, అది బతుకమ్మ కుంట స్థలమేనని తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున సంబంధిత పత్రాలు కోర్టుకు సమర్పించి విజయానికి సహకరించిన ఉద్యోగులకు హైడ్రా ప్రధాన కార్యాలయంలో సన్మానం చేశారు. తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలి ఉన్న భూమి 5.15 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెరువు తవ్వకానికి ఆదేశాలు జారీ చేశారు. ఒకప్పటి ఎర్రకుంటే కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని, దాన్ని పునరుద్ధరిస్తే చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని రంగనాథ్ తెలిపారు. పర్యావరణం మెరుగుపడడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.
Updated Date - Jan 08 , 2025 | 04:06 AM