Faheem Fake Letter Controversy: సీఎంకు చెడ్డ పేరు వచ్చేలా చేయను.. చేయబోను
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:42 PM
Faheem Fake Letter Controversy: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ ఫహీమ్.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ ఫహీమ్ (Food Corporation Chairman M.A. Faheem) సైబర్ క్రైమ్ పోలీసులను (Cyber Crime) ఆశ్రయించారు. హైడ్రా (HYDRA) పేరుతో బెదిరింపు లేఖపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫహీమ్ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ అమీన్‌పూర్ సంక్షేమ సంఘం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) లేఖ రాసినట్లుగా నిన్న (మంగళవారం) సోషల్ మీడియాలో హల్‌చల్ అయ్యింది. పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని , ఇవ్వకపోతే హైడ్రా ద్వారా మీ ఇల్లు కూల్చివేస్తామని ఫహీమ్ బెదిరిస్తున్నట్లుగా నకిలీ లేఖ ఒకటి వైరల్‌గా మారింది. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని సైబర్ క్రైమ్‌లో ఫహీమ్ ఫిర్యాదు చేశారు. దీని వెనుక బీఆర్‌ఎస్ (BRS) హస్తం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖ నకిలీదిగా పోలీసులు తేల్చేశారు.
ఈ వ్యవహారంపై ఎం.ఏ ఫహీమ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై దుష్ప్రచారం జరిగిందన్నారు. అమీన్‌పూర్ సంక్షేమ సంఘం పేరిట సోషియల్ మీడియాలో వైరల్ అయిన లెటర్ ఫేక్ లెటర్ అని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ వెనుక ఉండి తనపై దుష్ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వచ్చే పని ఎప్పటికి చేయనని స్పష్టం చేశారు. తాను డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు కానీ హైడ్రా పేరు ఉపయోగించినట్లు కానీ ఒక్క ఆధారం కూడా లేదన్నారు. ఈ వ్యవహారంపై డీజీపీకి , హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. దీనిపై విచారణ జరుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వానికి గానీ ముఖ్యమంత్రి గానీ చెడ్డ పేరు వచ్చేలా ఎప్పుడు చేయలేదని.. చేయను.. చేయబోనని తేల్చిచెప్పారు. దీని వెనక ఎవరున్నా పూర్తిస్థాయి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా చేశారు. ‘నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎవరు చేశారో నాకు తెలుసు. నాకు కొంత సమాచారం ఉంది. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లన్నీ బయట పెడతా’ అని ఎంఏ ఫహీమ్ వెల్లడించారు.
ఇంతకీ లేఖలో ఏముంది
ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ ఫహీమ్ పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారని.. లేదంటే సీఎం సాయంతో హైడ్రా అధికారులను పంపించి ఇళ్లు కూల్చివేయిస్తామంటూ అమీన్‌పూర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.రాంరెడ్డి సీఎంకు విన్నవించినట్లు లేఖలో ఉంది. సీఎం, మంత్రులు, ఇతర నేతల పేరు చెప్పి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఫహీమ్ వల్ల భయాందోళనకు గురవుతున్నామని, అతనిపై చర్యలు తీసుకోవాలని అమీన్‌పూర్ సంఘం అధ్యక్షుడి పేరుతో లేఖ విడుదలవడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
హైడ్రా కమిషనర్ స్పందన
దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఎంక్వైరీ చేసి రెండు మూడు రోజుల్లో నిజ నిర్ధారణ చేస్తామని’ హైడ్రా కమిషనర్ ప్రకటించారు. దీనిపై ఫహీమ్ కూడా తనతో మాట్లాడారని, ఆరోపణలపై విచారణ జరపాలని కోరినట్లు రంగనాథ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
AP Fiber Net: ఏపీ ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ డెసిషెన్
Read Latest Telangana News And Telugu News