ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మగూడెం చర్చీకి వందేళ్ల చరిత్ర

ABN, Publish Date - Jan 02 , 2025 | 12:06 AM

మునుగోడు మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మగూడెం చర్చీ (ఏసు నామకరణ దేవాలయం)లో జాతర వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

కమ్మగూడెం చర్చీ (ఏసు నామకరణ దేవాలయం)

కమ్మగూడెం చర్చీకి వందేళ్ల చరిత్ర

ప్రారంభమైన చర్చి వార్షికోత్సవాలు

ఐదు రోజుల పాటు నిర్వహణ

మునుగోడు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మునుగోడు మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మగూడెం చర్చీ (ఏసు నామకరణ దేవాలయం)లో జాతర వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం చర్చీలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఉత్సవాలను ప్రారంభించినట్లు స్థానిక విచారణ గురువు ఫాదర్‌ ధనరాజ్‌రెడ్డితెలిపారు. సాయంత్రం చర్చీలో కొవ్వొత్తుల సమర్పణ చేసిన క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలు చేశారు. ముందుగా బ్యాండ్‌ వాయిద్యాల నడుమ క్రైస్తవులు తమ ఇంటి నుంచి సామూహిక ప్రదర్శనలతో కొవ్వొత్తులను తీసుకువచ్చారు. రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో భక్తి గీతాలపనతో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఉత్తేజపరిచాయి. ఈ వేడుకల్లో భాగంగా చర్చీతో పాటు మరియామాత, ముఖద్వారం వంటి పలుచోట్ల విద్యుత దీపాలను అందంగా అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుత దీపాలు వెలుగులతో విరజిమ్ముతున్నాయి.

ఇదీ ప్రస్థానం..

ఆంధ్రప్రదేశ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన కొండ వెంకట్‌రెడ్డి అనే క్రైస్తవుడు 1910లో తన బంధుమిత్రులతో కలసి జిల్లాలోని మేళ్లచెరువుకు వలస వచ్చాడు. అనంతరం మునుగోడు మండలం కమ్మగూడెం గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ పెద్దఎత్తున భూములను కొనుగోలు చేసి వివిధ వ్యవసాయ పంటల సాగు చేస్తూ జీవనం సాగించారు. స్థానికులను పనులకు పిలిచి ఉపాధి కల్పించేవారు. తన బంధువులతో కలిసి పట్టణంలోని ఓచోట కమ్మల పాకలను ఏర్పాటు చేసుకున్నారు. మరో పక్క దైవ సంకల్పంతో ప్రార్ధనల కోసం కమ్మలపాకతో అదే సంవత్సరం చర్చీని ఏర్పాటు చేశారు. ప్రతి నిత్యం ఆ చర్చీలో ప్రార్ధనలు చేసేవారు. అదే ప్రస్తుతం కమ్మగూడెం గ్రామంగా నిలిచింది. అప్పట్లో దేవదత్త అనే గురువు వచ్చి ప్రార్ధనలు చేస్తూ క్రైస్తవ మతంపై విస్తృత ప్రచారం చేసి అభివృద్ధికి కృషి చేశారు. తర్వాత ఇటలీ దేశం నుంచి లెంతి, కాశిరాగి, తినెల్లి, కార్లోగొన్విన్‌ అనే గురువులు వరసగా వచ్చి ఇక్కడ సామూహిక ప్రార్ధనలు చేసుకుంటూ నిర్వహణ చూసుకునేవారు. ఆ తర్వాత మన దేశానికి చెందిన పలువురు గురువులు ఆ బాధ్యతలను వరుస క్రమంలో స్వీకరించారు. 1947లో విచారణ గురువు తినెల్లి గురువు ఆధ్వర్యంలో రేకులతో చర్చీని నిర్మించారు. 1969లో అప్పటి విచారణ గురువు కార్లోగొన్విన్‌ ఆధ్వర్యంలో రాతితో చర్చి నిర్మాణం చేట్టారు. ఎత్తయిన గోపురాలతో ప్రత్యేక అలంకరణగా చర్చీని నిర్మించారు.

ఐదు రోజుల పాటు నిర్వహణ

మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెం చర్చి (ఏసు నామకరణ దేవాలయం)లో జనవరి 1, 2, 3, 4, 5వ తేదీలు ఐదు రోజుల పాటు ఊరి పండుగ (జాతర) వేడుకలు జరగనున్నాయి. ఏసుప్రభువు జననానంతరం 8వ రోజున అప్పట్లో ఇక్కడ చర్చీని ఏర్పాటు చేసిన దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. జాతరలో మొదటి రోజు మధ్య రాత్రివేళ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చర్చీలో ప్రత్యేక ప్రార్ధనలతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం కొవొత్తుల ప్రదర్శన అనంతరం సమర్పణ, రెండు, మూడు, నాలుగో రోజున దివ్వబలి పూజలు, ఐదో రోజున ఆత్మలకు పూజలతో ఉత్సవాలు ముగుస్తాయి. జాతరలో ప్రధానంగా జరిగే దివ్యబలి పూజ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి ఫాదర్లు, సిస్టర్లు, క్రైస్తవులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారితో పాటు ప్రముఖులు హాజరవుతారు. పరిసర గ్రామాల నుంచి కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు జాతరకు వస్తారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన తమ మొక్కులు తీర్చుకొంటారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. చర్చీతో పాటు వివిధ చోట్ల ఉన్న గృహాలను అందంగా మస్తాబు చేశారు. దీపకాంతులు విరజిమ్మేందుకు రంగురంగుల విద్యుత దీపాలను ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నట్లు చర్చీ విచారణ గురువు ఫాదర్‌ ధనరాజ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jan 02 , 2025 | 12:06 AM