బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ABN, Publish Date - Jan 11 , 2025 | 01:54 AM
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా తర్జన భర్జన పడుతుంటే, బీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలుపుతుందో, లేదోననే అనుమానం ఆ పార్టీ వర్గాల్లోనే వ్యవక్తమవుతున్నది.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
- కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సి అంజిరెడ్డి
- ఉపాధ్యాయుల స్థానానికి మల్క కొమురయ్య
- కాంగ్రెస్‌లో ఇంకా తర్జన భర్జన
- బీఆర్‌ఎస్ అభ్యర్థి ఉంటారో లేదో తెలియని పరిస్థితి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా తర్జన భర్జన పడుతుంటే, బీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలుపుతుందో, లేదోననే అనుమానం ఆ పార్టీ వర్గాల్లోనే వ్యవక్తమవుతున్నది. రాష్ట్రంలో సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని వినియోగించుకొని ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ నాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సి అంజిరెడ్డిని ఉపాధ్యాయుల స్థానానికి మల్క కొమురయ్యను అభ్యర్థులుగా ప్రకటిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
- ఫలించని బీజేపీ సీనియర్ నేతల ప్రయత్నాలు
పట్టభద్రుల స్థానానికి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్ మోర్చా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు గడిచిన నాలుగు నెలలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక వైపు ఓటర్లను నమోదు చేపిస్తూ తమకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ నేతలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులను కలిసి తాము ఎమ్లెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నామని అవకాశం కల్పించాలని కోరారు. అయితే చివరకు వారి ఆశలను వమ్ము చేస్తూ పార్టీ నాయకత్వం అంజిరెడ్డికి, మల్క కొమురయ్యకు అవకాశం కల్పించింది. మెదక్ జిల్లా రామచంద్రాపురంకు చెందిన సి అంజిరెడ్డి భార్య గోదావరి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. అంజిరెడ్డి గత రెండు దశాబ్ధాలుగా ఎస్‌ఆర్ ట్రస్టును స్థాపించి గ్రామీణ ప్రాంతా లలోని పేదలకు తాగునీటి సౌకర్యాలు, విద్యావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా బందంపల్లికి చెందిన మల్క కొమురయ్య హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్వాహకులుగా ఉన్నారు. గత సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అప్పుడు ఈటెల రాజేందర్‌కు అవకాశం దక్కగా మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈయన పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్‌లో పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ స్థాపించి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పార్టీ నాయకత్వం వీరిద్దరి అభ్యర్థిత్వాలను ప్రకటించగానే టికెట్ కోసం ప్రయత్నించిన సుగుణాకర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గత 45 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలకోర్చి పార్టీకోసం పనిచేసిన తనలాంటి వాళ్లను విస్మరించి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మాదిరిగానే, ఎమ్మెల్సీ సీట్లను కూడా కేటాయించడం బాధాకరమని సుగుణాకర్‌రావు అసంతృప్తిని వెలుబుచ్చారు. నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈ రెండు స్థానాల్లో పార్టీ అవకాశాలను కాలదన్నుకోవడమేనని గుజ్జు రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం పార్టీ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది.
కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో 3,89,729 మంది ఓటర్లు ఉండగా ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 82,190 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల సిరిసిల్ల జిల్లాలలో 1,76,309 ఓట్లు ఉన్నాయి. ఇవి మొత్తం ఓట్లలో 45 శాతం కావడం గమనార్హం. ఇదే విషయాన్ని పార్టీ నాయకులు ప్రస్తావిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారికి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తే గెలిచేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
- కాంగ్రెస్‌లో తర్జన బర్జన
మార్చి మొదటి పక్షంలో జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కిస్తున్నదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ వి నరేందర్‌రెడ్డి, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హరికృష్ణ నియోజకవర్గ పరిధిలో గడిచిన మూడు నెలలుగా ఓటర్ల నమోదు చేపట్టి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తు వస్తున్నా రు. అయితే పార్టీ నాయకత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుందన్నది ఇంకా స్పష్టం కావడం లేదు. పీసీసీ స్థాయిలో పలు మార్లు చర్చలు జరిగినా రెండు రోజుల క్రితమే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర బాధ్యులతో చర్చించిన ఇంకా అభ్యర్థి పేర్లను ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంతో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చని అనుకుంటున్నారు.
- బీఆర్‌ఎస్‌లో స్తబ్ధత
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌లో స్తబ్దత కనిపిస్తోంది. కరీంనగర్ మాజీ మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, ఐఎంఏ నాయకుడు డాక్టర్ బీఎన్‌రావు, కాంగ్రెస్, బీజేపీ ఆశావాహులకు ఽధీటుగా నియోజక వర్గ పరిధిలో సభ్యత్వ నమోదు, ప్రచారం చేపడుతూ వస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీ పరంగా ఏ రకమైన సన్నాహాలు జరగడం లేదు. దీంతో అసలు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీలో నిలుపుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా కాంగ్రెస్ ఆశావహులుగా ఉన్న నరేందర్‌రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, బీఆర్‌ఎస్ ఆశావహులు రవీందర్‌సింగ్, బీఎన్‌రావు ఇండిపెండెంట్‌లుగానైనా పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతున్నది. బీజేపీలో అవకాశం దక్కని నేతలు పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తారా లేక తిరుగు బాటు అభ్యర్థులుగా పోటీలో ఉంటారా అన్నది తేలాల్సి ఉన్నది.
Updated Date - Jan 11 , 2025 | 01:54 AM