Share News

ఏడాది పాటు బీఆర్‌ఎస్‌ రజతోత్సవాలు

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:56 AM

నాటి టీఆర్‌ఎస్‌, నేటి బీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. శనివారం ఆయన చింతకుంటలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో రజతోత్సవంపై సమావేశాన్ని నిర్వహించారు.

ఏడాది పాటు బీఆర్‌ఎస్‌ రజతోత్సవాలు
కరీంనగర్‌లో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు

- లక్షలాది మందితో ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ

- ఉమ్మడి జిల్లానుంచి పెద్ద ఎత్తున తరలిరావాలి

- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): నాటి టీఆర్‌ఎస్‌, నేటి బీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. శనివారం ఆయన చింతకుంటలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో రజతోత్సవంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావును సీట్లో కూర్చోబెట్టి అభినందించారు. ఇప్పటి నుంచి జిల్లా కార్యాలయం నుంచే పార్టీ కార్యాకలాపాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీ రామారావు మాట్లాడుతూ ఈయేడాది బీఆర్‌ఎస్‌ పార్టీకి కీలకమని అన్నారు. ఈనెల 27న వరంగల్‌కు సమీపంలోని ఎల్కతుర్తిలో లక్షలాది మందితో ఏర్పాటు చేస్తున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవానికి ఉమ్మడి జిల్లానుంచి తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. మార్చి 12న సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరితే ఇప్పటి వరకు ఇవ్వలేదని, దీంతో కోర్టును ఆశ్రయించామన్నారు. 1250 ఎకరాల స్థలంలో సభ నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, 1000 ఎకరాల్లో పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున 10 లక్షల వాటర్‌ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. సభా ప్రాంగణంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు వేల మంది వలంటీర్లను నియమించామని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందేనని, ఈ రెండు పార్టీలు కలిసి కేసీఆర్‌ను బదనాం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నటికీ సాగవని అన్నారు. యాసంగిలో ఉమ్మడి జిల్లాలో చాలా మేరకు పంటలు సాగునీరందక ఎండిపోయాయన్నారు. దెబ్బతిన్న మేడిగడ్డ పిల్లర్‌ను రిపేర్‌ చేసేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధంగా ఉన్నారని, ఈ వేసవిలో మరమ్మతులు చేయించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో మండుతున్న ఎండల్లో సైతం చెరువులు, కుంటలు, డ్యామ్‌లు, కాలువలు మత్తళ్లు దూకేవని, ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్‌పై ధ్వేషంతో పంటలు ఎండిపోతున్నా పంట్టిచుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టామని టీపీసీసీ అధ్యక్షుడు చెబుతుంటే, కుదవపెట్టలేదని మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నాన్నారు. ఈ భూవివాదం దేశంలోనే అది పెద్ద మోసమని కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ భూమిని ఎవరు కొన్నా 2028లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచు భూమిని కూడా వదిలిపెట్టకుండా తీసుకుంటామని హెచ్చరించారు. అమృత్‌నిధుల్లో అవినీతి జరిగిందంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌ వాటిపై విచారణ జరిపించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహాయపడుతున్నారని విమర్శించారు. మే నెలలో సభ్యత్వనమోదు, దసరా వరకు సంస్థాగత కమిటీల ఏర్పాటు, ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున కార్యకర్తలు శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ తరగతులను నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాల అవినీతి, అక్రమాలు, హామీలపై ప్రజల్లో ఎండగట్టడంతోపాటు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమం, బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని, ఈ యేడాది బీఆర్‌ఎస్‌కు కీలకమని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, పుట్ట మధు, విద్యాసాగర్‌రావు, రసమయి బాలకిషన్‌, వొడితెల సతీష్‌బాబు, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 12:56 AM