తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి

ABN, Publish Date - Mar 28 , 2025 | 11:52 PM

నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వేసవి యాక్షన్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు.

తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ చాహాత్‌భాజ్‌పాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వేసవి యాక్షన్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె నగరంలోని పలు మంచినీటి రిజర్వాయర్లను సందర్శించి, నీటి సరఫరా తీరును పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్‌ అధికారులు, రిజర్వాయర్ల సిబ్బందితో మంచినీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విలీన గ్రామాలతో సహా నగరంలో ప్రజలకు ఎక్కడ కూడా తాగునీటి కష్టాలు రాకుండా అన్ని చర్యలను తీసుకోవాలని అన్నారు. సమయానికి అనుగుణంగా తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. నల్లానీటిని విడుదల చేసిన సమయంలో రిజర్వాయర్ల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, డీఈ, ఏఈ స్థాయి అధికారులు కూడా పర్యవేక్షణ చేసి నీరు వృధా కాకుండా చూడటంతో పాటు ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, అలాంటి వాటిని తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పైపులైన్ల లీకేజీలు, వాల్స్‌ మరమ్మతులుంటే వెంటనే చేయించాలని, నీటి శుద్ధి కేంద్రంలో రా వాటర్‌ సేకరణలో, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, స్టాండ్‌బై మోటార్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎల్‌ఎండీలో నీటి మట్టం తగ్గినందున ఆన్‌లైన్‌ బూస్టర్లను నడిపించి రా వాటర్‌ తీసుకొని శుద్ధి చేసిన రిజర్వాయర్ల షెడ్యూల్‌ ప్రకారంగా నీటిని విడుదల చేయాలన్నారు. నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కమిషనర్‌ హెచ్చరించారు. ఈ సమా వేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈలు రొడ్డ యాదగిరి, సంజీవ్‌, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:52 PM