ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

ABN, Publish Date - Jan 13 , 2025 | 01:59 AM

రాజీకీయాలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం ఆదివారం నిర్వహించారు.

ఎమ్మెల్యేలు కౌశిక్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌ మధ్య వాగ్వాదం

- పథకాల అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి

- ఉమ్మడి జిల్లా సమీక్షా సమవేశంలో ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కరీంనగర్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి, ప్రతినిధి) రాజీకీయాలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా ప్రజలందరికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. పథకాల అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి యోగ్యమైన భూమికి పంట వేసినా, వేయకపోయినా రైతు భరోసా కింద సంవత్సరానికి 12 వేల రూపాయలు అందిస్తామన్నారు. రోడ్లు, రియల్‌ ఎస్టేట్‌ స్థలాలు సాగుకు యోగ్యం కాని భుములకు రైతు భరోసా ఇవ్వబోమని స్పష్టం చేశారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు అందిస్తామని తెలిపారు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇస్తామన్నారు. ఈ నెల 26 నుంచి రేషన్‌ కార్డుల పంపిణీ మొదలవుతుందన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు 90 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఉండేవని, అధికారంలోకి వచ్చాక 49 వేల కొత్త కార్డులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. వచ్చే నెల నుంచి ఆరు కిలోల సన్న బియ్యాన్ని అందిస్తామన్నారు. కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయకుండానే రాష్ట్ర వ్యాప్తంగా 66.7 లక్షల ఎకరాల్లో 155 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందన్నారు. జిల్లాలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలోని రోళ్లవాగు, పత్తిపాక, పాలకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మధ్యలో వదిలేసిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

ఫ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఎలక్ర్టానిక్స్‌, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సమన్వయంతో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అర్హత ఉన్న ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డు, యోగ్యతగల ప్రతి రైతుకు రైతు భరోసా అందజేయాలన్నారు. లబ్దిదారుల గుర్తింపులో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో ఏవైనా ఆటంకాలు కలిగించినా, అధికారులపై దాడులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫ వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో రూ. 12 వేలు..

- మంత్రి పొన్నం ప్రభాకర్‌

వ్యవసాయదారులకు రైతు భరోసాతోపాటు వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 12 వేలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని, ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందజేస్తామని తెలిపారు. పక్షపాతం లేకుండా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, సంజయ్‌కుమార్‌, గంగుల కలామకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆదిశ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, ఎల్‌ రమణ, భాను ప్రసాదరావు, మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్‌ గ్రంథాలయ చైర్మన్‌ సత్తు మల్లేశం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌, కలెక్టర్లు సందీప్‌కుమార్‌ ఝా, కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్‌, అరుణశ్రీ, అఖిల్‌ మహాజన్‌, లక్ష్మీకిరణ్‌, అబ్దుల్‌ అజీజ్‌, ఖీమ్యానాయక్‌, వేణు, బీఎస్‌ లత పాల్గొన్నారు.

ఫ సంజయ్‌కుమార్‌ వర్సెస్‌ కౌశిక్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మధ్య జరిగిన వాగ్వాదం, తోపులాట కారణంగా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడడానికి మైకు తీసుకోగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఎందుకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారంటూ ప్రశ్నించి ఆయనపైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దానికి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ దీటుగా స్పందించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచి నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు అంటూ కౌశిక్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే మాటా మాట పెరిగి ఒకరిని ఒకరు తోసివేసుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ లోగా పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్‌రెడ్డిని బయటకు తీసుకువెళ్లారు. గేటు బయటనే నిలబడిన కౌశిక్‌రెడ్డి సిగ్గూ..లజ్జా ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవమని సంజయ్‌కుమార్‌కు సవాల్‌ విసిరారు. సమావేశంలో కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తీవ్ర అసహనం అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యవహారం సరిగా లేదని మార్చుకోవాలని హెచ్చరించారు. తనను విమర్శించడానికి, రాజీనామా చేయమని అడగడానికి కౌశిక్‌రెడ్డికి ఎలాంటి అధికారం లేదని డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌రెడ్డిమీద స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ఫ సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ బీఫాంపై పోటీ చేసి గెలిచి చూపించాలి

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు దమ్ముంటే కాంగ్రెస్‌ బీఫాంపై పోటీ చేసి గెలిచి చూపించాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం గత రెండు సీజన్లలో రైతు భరోసా ఇవ్వలేదని, ఈ విషయంపై ఉమ్మడి జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన తాము అడుగుతున్నామని అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వంద శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 18,500 కుటుంబాలకు దళితబంధు ఇచ్చామని, రెండో విడత దళితబంధును ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కచ్చితంగా దళితబంధు విడుదల చేయాలని తాను చెప్పానని, ఇవన్నీ అడిగితే ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు మందబలం ఉందని బెదిరించే ప్రయత్నం చేశారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు.

Updated Date - Jan 13 , 2025 | 01:59 AM