సంక్షేమానికి ప్రాధాన్యం..
ABN , Publish Date - Apr 12 , 2025 | 02:11 AM
రాజన్న సన్నిధిలో మంచి కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, నేతన్నలు, రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.

- రూ.34 కోట్లతో నేతన్నలకు రూ.లక్ష రుణమాఫీ
- రైతులకు రూ.33వేల కోట్ల రుణమాఫీ
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రూ.914 కోట్ల బకాయిలు విడుదల
- వర్కర్ టు ఓనర్, అపెరల్ పార్కు కార్యక్రమాలు కొనసాగిస్తాం
- చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
- సిరిసిల్ల అపెరల్ పార్కులో ముగ్గురు మంత్రులతో టెక్స్‌పోర్టు యూనిట్ ప్రారంభోత్సవం
- యూనిట్‌లో ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్ల అందజేత
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
రాజన్న సన్నిధిలో మంచి కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, నేతన్నలు, రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అపెరల్ పార్కులో రూ.62కోట్లతో ఏర్పాటు చేసిన టెక్స్‌పోర్టు గార్మెంట్ యూనిట్‌ను పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లతో కలిసి ప్రారంభించారు. యూనిట్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికులతో మంత్రులు ముచ్చటించారు. వారికి లభించే ఉపాధి, పనులు, సౌకర్యాలపై అడిగితెలుసుకున్నారు. మంత్రులను టెక్స్‌టైల్ ముఖ్యకార్యదర్శి శైలజరామయ్యార్ స్వాగతించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో తుమ్మల మాట్లాడుతూ నేతన్నల స్థితిగతులు మెరుగుపరిచే దిశగా వర్కర్ టు ఓనర్ పథకం, అపెరల్ పార్కుల్లో జీవనోపాధి కల్పించే దిశగా కార్యక్రమాలను ముందుకు తీసుకవెళతామని తెలిపారు. మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. తెలంగాణ కష్టాలు, వెనకబాటుతనంగానే గతంలో విధ్వంస పరిపాలన కొనసాగిందన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని రైతన్నల, నేతన్నల సంక్షేమంగా మౌలిక వసతులు కల్పిస్తూ యువతకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశ చరిత్రలోనే ఒకేసారి రైతాంగానికి రూ.33వేల కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక తెలంగాణ ప్రభుత్వమన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్నలకు రూ.34వేల కోట్ల రుణమాఫీ పూర్తిచేశామన్నారు. సిరిసిల్ల నేతన్నలకు పెండింగ్‌లో ఉన్న రూ.914 కోట్ల బకాయిలు అందించామన్నారు. చేనేత భరోసా, చేనేత బీమా, పొదుపు పథకాలకు రూ.290 కోట్ల నిధులు జమ చేశామన్నారు. నేతన్నలకు కంట నీరు రాకుండా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో అవసరమైన వస్త్రాలను టెస్కొ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించామని, ఇప్పటికే నేత కార్మికులకు రూ.900 కోట్ల ఆర్డర్లు ప్రభుత్వం అందించిందన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే మిగతా ఆర్డర్లతో పాటు వర్కర్ టు ఓనర్ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు. చేనేత రంగానికి చెందిన పరిశ్రమలను సిరిసిల్ల, వరంగల్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న నేత కార్మికులు తిరిగివచ్చేలా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో జీవనోపాధి ఎక్కువగా నేతన్న, రైతాంగం రెండు రంగాలు ముందువరుసలో ఉంటుందన్నారు. కేంద్రాన్ని పోషించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. డబ్బులు ఎవరి అబ్బ సొత్తు కాదని ప్రజల సొత్తు అని అన్నారు. కేంద్రానికి పంపించే పన్నుల్లో 30 పైసలు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయన్నారు. కొందరు కేంద్ర పథకాలతో నడుస్తున్నాయని, కేంద్రానికి సంబంధించిన ఫొటో పెట్టాలని, అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ అస్తవ్యస్తమైన వ్యవహారాలు చేస్తూ అగాధాన్ని సృష్టిస్తూ అపోహలు పెంచుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించి ఎవరి బాధ్యత వారికి, ఎవరి కార్యక్రమాలు వారికి ఉంటాయన్నారు. ఎవరూ కేంద్ర, రాష్ట్ర పదవుల్లో ఉండాలో ప్రజలు నిర్దేశిస్తారని, దాని ప్రకారం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలన్నారు. ప్రజల సొత్తు ప్రజలకే దక్కే విధంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటి పారుదల రంగం, విద్య, వైద్యం, సంక్షేమం, మంత్రులు పొన్నం శ్రీధర్‌బాబులు చూస్తున్నారన్నారు. చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే, టెక్స్‌పోర్టు సీఈవో సురేష్ గోయెంకా, శేఖర్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీవో రాధాబాయి, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, టెక్స్‌టైల్ జడీ వెంకటేశ్వర్లు, జీఎం అశోక్‌రావు, ఏడీ రాఘవరావు, అదనపు ఎస్పీ చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ప్రకాష్, చీటి ఉమేష్‌రావు, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, శ్రీనాథ్, గోలి వెంకటరమణ, కాముని వనిత, ఆకునూరు బాలరాజు, మడుపు శ్రీదేవి, ఆడేపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
చైతన్యవంతమైన సిరిసిల్ల..
- పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సిరిసిల్ల ఎంతో చైతన్యవంతమైందని, నేతన్నకు నిలయమై, రైతన్నకు తోడుగా వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన డాక్టర్ సి నారాయణరెడ్డి, కమ్యూనిస్ట్ నాయకులు సీహెచ్ రాజేశ్వర్‌రావు వంటి మహనీయులు ఎందరో ఉన్నారన్నారు. ప్రముఖ దేవస్థానాల్లో ఒకటైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆశీస్సులకు దేశ వ్యాప్తంగా ప్రజలు వస్తారన్నారు. నేతన్నలను కాపాడుకోవడానికి కృషి చేస్తున్నామని, నేత కార్మికులకు అంత్యోదయ కార్డులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందించామన్నారు. గత పదేండ్లలో ప్రభుత్వం కార్మికుల్లో అత్మస్థైర్యం అందించలేకపోయిందన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. శాతవాహన యూనివర్సిటీని ఉమ్మడి కరీంనగర్ కోసం 200 ఎకరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత లా, కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిందన్నారు. అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతామన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే ఎటువంటి పరిశ్రమలకైనా ఎలాంటి అవసరం ఉన్నా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు.
వర్కర్ టు ఓనర్ పథకంపై కార్యాచరణ
- బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకంపై కార్యాచరణతో ముందుకు తీసుకవెళతామని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్లలో చేనేత రంగంలో విపత్కరమైన పరిస్థితులు వచ్చిన సమయంలో వైఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు రూ.5 లక్షల రుణాలు, కుటుంబాలకు 12వేల అంత్యోదయ కార్డులు అందించామని అన్నారు. ఆత్మహత్యలు జరగకుండా ఆత్మస్థైర్యాన్ని నింపే దిశగా ర్యాలీలు నిర్వహించి నేతన్నకు అండగా ఉన్నామనే భరోసా కల్పించామన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని అందిస్తున్నామన్నారు. సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వానివని అంటూ మోదీ ఫొటో పెట్టాలని కొందరు మాట్లాడుతున్నారని, బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఫొటో గురించి కాదని చేతనైతే చేనేత రంగంపై వేసిన జీఎస్టీని తొలగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు అవసరమైన బట్టలను నేత కార్మికుల నుంచి సేకరిస్తున్నామని మహిళా సంఘాలకు ప్రభుత్వం రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించి సిరిసిల్ల నేతన్నలకే ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చిందని అన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్కులో టెక్స్‌పోర్టు సంస్థ రూ 62 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషమని, భవిష్యత్తులో పరిశ్రమలను విస్తరిస్తామని అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.
65 లక్షల మంది మహిళలకు చీరలు..
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ పూర్తి చేశామని, మహిళా సంఘాల్లో ఉన్న 65 లక్షల మంది మహిళలకు ఉచితంగా రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చీరల ఉత్పత్తికి సంబంధించిన ఆర్డర్లు ఇచ్చామని, ప్రభుత్వం చేనేత కార్మికుల ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో కాటన్, పాలిస్టర్ అనుబంధ రంగ పరిశ్రమలు తీసుకరావాలని, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. సిరిసిల్ల కార్మికుల చిరకాల కోరిక యారన్ డిపోను రూ.50 కోట్లతో వేములవాడలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. దీనిద్వారా ఇప్పటికే 99 సంఘాలకు సబ్సిడీపై నూలు అందించామని అన్నారు.