రేషన్ దుకాణాలు కిటకిట
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:36 AM
రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెల వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఉచితంగానే సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకునేందుకు బారులు తీరుతున్నారు.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెల వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఉచితంగానే సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకునేందుకు బారులు తీరుతున్నారు. మార్కెట్‌లో సన్న బియ్యం 55 నుంచి 60 రూపాయలు, అంతకంటే ఎక్కువ ధరకే విక్రయిస్తుండడంతో పేద ప్రజలకే కాకుండా మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన వారు రేషన్‌పై సన్నబియ్యం తీసుకునేందుకు పోటీపడుతున్నారు. సన్నబియ్యం పంపిణీ నిరంతర ప్రక్రియగా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సన్నబియ్యం కోసం జనం ఎగబడుతున్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో కొన్ని దుకాణాల్లో కొద్దిరోజులపాటు సన్నబియ్యం పంపిణీ చేసి ఆ తర్వాత దొడ్డు బియ్యం పంపిణీ చేశారు. దీంతో ఇప్పుడు కూడా సన్నబియ్యం స్టాక్ అయిపోతే మళ్ళీ సన్న బియ్యం ఇస్తారో లేదోనన్న అనుమానాలతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున ప్రజా పంపిణీ దుకాణాలు (రేషన్ షాపు) వద్ద క్యూ కట్టి సన్నబియ్యం తీసుకుంటున్నారు. ప్రతి నెల 16 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా ప్రజాపంపిణీ దుకాణాల నుంచి రేషన్ బియ్యం తీసుకునే అవకాశమున్నప్పటికీ ప్రజలు వారికి సమీపంలోని డీలర్ల వద్ద క్యూ కట్టి సన్నబియ్యం తీసుకుంటున్నారు. గతంలో రేషన్‌కార్డులపై ఉచితంగా దొడ్డుబియ్యం పంపిణీ చేయడంతో చాలా మంది ఆ బియ్యం తినలేక 10 నుంచి 12 రూపాయలకు అమ్ముకున్నారు. ఇప్పుడు మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు మండిపోతుండడంతో ఉచితంగా వస్తున్న సన్నబియ్యం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. చివరి వరకు సన్నబియ్యం ఇస్తారో లేక ఈ బియ్యం అయిపోయిన తర్వాత దొడ్డు బియ్యం పంపిణీ చేస్తారో తెలియక చాలా మంది రేషన్‌దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. సన్నబియ్యం కోసం గంటల తరబడి నిలబడాల్సివస్తోందని, బియ్యం నాణ్యంగానే ఉన్నాయని లబ్ధిదారులు అంటున్నారు.