‘ఎల్‌ఆర్‌ఎస్’తో రూ. 37.87 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:53 AM
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)తో ప్రభుత్వానికి జిల్లాలో 37.87 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. జిల్లావ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కోరుతూ వచ్చిన దరఖాస్తుల్లో 21 శాతం మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. 80 శాతం మంది దరఖాస్తులు చేసుకున్నవారు తమ భూమి క్రమబద్దీకరణ కోసం డబ్బులు చెల్లించలేదు. దరఖాస్తులు చేసుకోని వారు వేల సంఖ్యలో ఉన్నారు.

- నెలాఖరు వరకు 25 శాతం రాయితీ
- గడువు పొడిగింపుతో ఆదాయం రెట్టింపయ్యే అవకాశం
- మందకొడిగా ప్రొసీడింగ్స్ జారీ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)తో ప్రభుత్వానికి జిల్లాలో 37.87 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. జిల్లావ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కోరుతూ వచ్చిన దరఖాస్తుల్లో 21 శాతం మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. 80 శాతం మంది దరఖాస్తులు చేసుకున్నవారు తమ భూమి క్రమబద్దీకరణ కోసం డబ్బులు చెల్లించలేదు. దరఖాస్తులు చేసుకోని వారు వేల సంఖ్యలో ఉన్నారు. వివిధ కారణాలతో ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులు, ప్రొసీడింగ్స్ జారీ ఆలస్యం అవుతుండడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరువరకు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించేందుకు గడువు పెంచడంతో ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశముంటుందని భావిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారంతా ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలను చెల్లిస్తే మరో 140 కోట్ల ఆదాయం జిల్లా నుంచి ప్రభుత్వానికి సమకూరనున్నది. 2020లోపు స్థలాలను, ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకొని వెయ్యి రూపాయల నామినల్ చార్జీలతో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గత ప్రభుత్వం పలుమార్లు చార్జీలు చెల్లించడంతోపాటు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి రెగ్యులరైజ్ చేసుకోవాలంటూ అవకాశమిచ్చింది. దరఖాస్తుదారులు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
ఫ ఎఆర్‌ఎస్ లేకుంటే అనుమతులు ఇవ్వబోమని హెచ్చరిక
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంతోపాటు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను క్లియర్ చేయాలని నిర్ణయించి ఎల్‌ఆర్‌ఎస్ చార్జీల్లో 25 శాతం రాయితీని ప్రకటించింది. మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలను చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని, ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇదే చివరి అవకాశమంటూ విస్తృత ప్రచారం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుల స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయమని, ఇళ్లు నిర్మించుకుంటే అనుమతి ఇవ్వబోమంటూ హెచ్చరించింది. దీంతో అర్జీదారుల్లో కదలిక వచ్చి చార్జీలను చెల్లిస్తారని భావించింది. 25 శాతం రాయితీతో అర్జీదారులు చాలా మంది ముందుకు వచ్చారు. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు సుడా పరిధిలోని అర్బన్ ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా స్థలాలను క్రమబద్దీకరించుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఎల్-1, ఎల్-2, ఎల్-3 మూడు స్టేజీల్లో అర్జీలను పరిశీలించిన తర్వాత చార్జీలను నిర్ధారించి తీసుకుంటామని చెప్పింది. అర్జీదారులు మరోసారి డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.
ఫ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు
ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, చాలా మంది దరఖాస్తులను ఎల్-1, ఎల్-2 స్టేజీల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఎల్-1 రెవెన్యూ, ఎల్-2 రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) తీసుకురావాలంటూ నిబంధన విధించడంతో ఆయా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ కూడా సైట్ ఓపెన్ కాక పోవడం వంటి సాంకేతిక సమస్యలతో మార్చి 31 వరకు చాలా మందికి ఎన్‌వోసీలు రాలేదు. కొంత మందికి ఎన్‌వోసీ జారీ చేసినా తప్పులు దొర్లడంతో ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు చెల్లించేందుకు సముఖంగా ఉన్నప్పటికీ ఎన్‌వోసీ లేకపోవడంతో చెల్లించే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు తలెత్తడంతో ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలపై 25శాతం రాయితీ కల్పించినా ఆశించిన మేరకు దరఖాస్తులు క్లియర్ కాలేదు. ప్రభుత్వానికి ఆదాయం అంచనా మేరకు రాలేదు.
ఫ చార్జీలు చెల్లించినా పెండింగ్‌లోనే..
కరీంనగర్ నగరపాలక సంస్థలో 2020 వరకు ఎల్‌ఆర్‌ఎస్ కోసం 29,537 మంది చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కోర్టు కేసులు, ప్రభుత్వ స్థలాలు, ఇతరత్రా కారణాలతో 17,535 మంది దరఖాస్తులు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌కు అర్హుత ఉన్నవని పేర్కొంటూ వారికి 25శాతం రాయితీ వర్తిస్తుందని వినియోగించుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1 వరకు 4,315 మంది మాత్రమే డాక్యుమెంట్లను సమర్పించి ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలను రాయితీపోగా మిగిలిన వాటిని చెల్లించడంతో 23 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. వారిలో 1,785 మందికి మాత్రమే ప్రొసీడింగ్స్‌ను జారీ చేయగా మిగిలిన వారి దరఖాస్తులను పరిశీలన పేరుతో పెండింగ్‌లోనే ఉంచారు.
- శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ (సుడా) పరిధిలోని అర్భన్ ప్రాంతాల్లో 21,236 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో 16,362 దరఖాస్తులకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చారు. వారిలో 3,067 మంది 9.65 కోట్ల రూపాయల ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలను చెల్లించారు. వీరికి ప్రొసీడింగ్స్ జారీ చేయాల్సి ఉంది.
జిల్లాలో మొత్తం 42,213 మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు అర్హులు కాగా ఏప్రిల్ 1వ తేదీ వరకు 9,186 మంది మాత్రమే ఫీజులు చెల్లించారు. 2,457 మంది స్థలాలను క్రమబద్ధీకరిస్తూ ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్‌ను అధికారులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకునేందుకు అవకాశమిచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోవాలనుకునే వారికి ఎలాంటి అవాంతరాలు కల్పించకుండా, డాక్యుమెంట్ల షాట్‌పాల్, ఎన్‌వోసీల పేరుతో ఇబ్బందులు పెట్టకుండా క్లియర్ చేస్తే 25శాతం రాయితీ చార్జీలతో మరో 25 శాతం మంది పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ తీసుకుంటారని భావిస్తున్నారు.