పల్లెకొస్తున్న పట్నం
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:52 AM
పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మూడు రోజుల సంబరం సోమవారం ప్రారంభంకానుంది. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగను నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు.
- ప్రయాణికులతో బస్టాండ్‌లలో రద్దీ
- మూడు రోజుల సంబరాలు ఆరంభం
- నేడు భోగి
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మూడు రోజుల సంబరం సోమవారం ప్రారంభంకానుంది. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగను నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉన్నవారితోపాటు విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా పట్టణాల్లో ఉన్నవారంత సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. కుటుంబాలతో పల్లెలకు తరలివస్తుండడంతో సందడిగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బస్టాండ్, ఇతర కూడళ్లు జనంతో రద్దీగా కనిపించాయి. పండుగలు వస్తూవస్తూ కుటుంబసభ్యుల ఆప్యాయతలను పట్టణం నుంచి పల్లెకు తీసుకొస్తాయి. కుటుంబసభ్యుల రాకతో పల్లెల్లో ప్రతీ ఇల్లు పండగ శోభను సంతరించు కుంటుంది. పండగ రోజుల్లో ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. గంగిరెద్దులు, హరిదాసుల రాకతో ప్రత్యేకత నెలకొంటుంది. మరోవైపు పిండి వంటల ఘుమఘుమలు నోరూరిస్తాయి. పాఠశాలలకు సెలవులు కూడా ఇవ్వడంతో పిల్లలు పల్లెల్లో తాతమ్మ, నానమ్మలతో ముచ్చట్లతో సంబరపడుతున్నారు. ఉత్తరాయన పుణ్య కాలంలో మార్గశిర పుష్పమాసంలో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కో మాసంలో ఒక్కో రాశిలోకి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతిగా చెప్పుకుంటారు. పండుగ ఎన్నెన్నో సంప్రదాయాలతో ముడిపడి ఉంది. గంగిరెద్దులు, పగటి వేషగాళ్లు ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఆధునిక పోకడలకు పండుగలో కొన్ని కళలు తగ్గిపోయినా రంగ వల్లులు తీర్చిదిద్దడంలో మహిళలు మాత్రం పోటీ పడుతూనే ఉన్నారు. చిన్నారులు పంతగులతో సందడి చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా గొబ్బెమ్మలు ముఖ్యమైనవి. ఆవుపేడతో ముద్దలు చేసి ముగ్గుల మధ్యన పెట్టి పసుపు, కుంకుమ అద్ది పిండితో ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మ చుట్టూ చామంతి, బంతి, బీర, గుమ్మడి పూలతో అలంకరిస్తారు. ఈ గొబ్బెమ్మను గౌరి దేవీగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో ఆటాపాటలతో సంబరాలు జరుపుకుంటారు. పసుపు, కుంకుమలతోపాటు పెసరపప్పు, శనిగలు, మరమరాలు(పేలాలు), అటుకులు మొదలైన వాటితో పూజలు చేసి పంచుకుంటారు.
నేడు భోగి సంబరాలు
సంప్రదాయాల సంబరాలు తొలిరోజు సోమవారం బోగిమంటలతో మొదలు కానున్నాయి. తెల్లవారు జామునే ఇళ్లలో ఉన్న పాత వస్తువులను కుప్పగా పోసి బోగిమంటలు వేస్తారు. పాత అలవాట్లకు స్వస్తి పలికి కొత్త దనాన్ని, కొత్త ఆలోచనలు కోరుకొంటు బోగితో సంక్రాంతిని స్వాగతిస్తారు. ప్రతీ ఇంటి ముందు బోగిమంటలు వేసి సంబరాలు రుపుకోవడం ఆనవాయితీ. పల్లెల్లో భోగి మంటల సంప్రదాయం ఇంకా ఉన్నా పట్టణాల్లో మాత్రం కనుమరుగైపోయింది. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆ మంటలతో కాగిన నీళ్లతో స్నానం చేస్తారు. ఈ స్నానాల వల్ల దుష్టశక్తులు తొలగిపోయి సంతోషంగా ఉంటారని భావిస్తారు.
పిల్లలకు బోగిపండ్ల స్నానం
బోగిపండ్లు అంటే రేగు పండ్లు. సూర్యుడి రూపం రంగు పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలు కలిపి పిల్లల నెత్తిపై పోసి ఆశీర్వదిస్తారు. పిల్లలు కూడా ఎంతో సంబరంగా వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం వేళ మహిళలు బొమ్మల కొలువు నిర్వహిస్తారు. మన సంస్కృతీసంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా బొమ్మల కొలువు ఉంటుంది.
వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతి
సంక్రాంతి సంబరాలను వివిధ రాష్ట్రాల్లోనూ ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తారు. తమిళనాడులో బోగి రోజు నుంచి తమిళులకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజున పాలు, కొత్త బియ్యం, బెల్లంతో కొత్త కుండలో పొంగల్ చేసుకుంటారు. వ్యవసాయంలో సేవలందించినందుకు మూగజీవాలకు కృతజ్ఞతలు తెలుపుతారు. స్నేహితులు బంధువులతో ఆనందంగా గడుపుతారు. మహారాష్ట్రలో ఇళ్లలో విందులు ఏర్పాటు చేసుకొని బంధువులను, స్నేహితులను పిలుస్తారు. మహిళలు వస్త్ర దానం చేస్తారు. గోవాలోనూ వస్త్ర దానం చేసే పద్ధతి కొనసాగుతోంది. గుజరాత్‌లో మకర సంక్రాంతి రోజున ఉత్తరాయనంగా, మరుసటి రోజున వాసి ఉత్తరాయనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా గాలిపటాలను ఎగరవేయడం ఇక్కడి సంప్రదాయం. పంజాబ్‌లో లోది, లోహ్రి పేరుతో సంక్రాంతి నిర్వహిస్తారు. స్వీట్లు, చెరకు, బియ్యం, మొదలై వస్తువులను భోగి మంటల్లో వేస్తారు.
Updated Date - Jan 13 , 2025 | 01:52 AM