తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:40 PM

కరీంనగర్‌లో జూలై నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ‘సుడా’ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు.

తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

- ‘సుడా’ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో జూలై నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ‘సుడా’ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఎల్‌ఎండీలో నీటి నిల్వ మూడు టీఎంసీలకు నీరు చేరుకుని కరీంనగర్‌లో తాగునీటికి ఇబ్బందులు వస్తాయంటూ మాట్లాడడం బాధాకరమన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కూడా ఎల్‌ఎండీలో నీటి నిలువలు తగ్గడంతో బూస్టర్ల వద్ద, ధర్నాలు, ఆందోళనలు చేస్తే మంత్రిగా ఉండి పట్టించుకోని కమలాకర్‌, ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడంతో ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఇటీవల కేటీఆర్‌ మాట్లాడుతూ తాను కేసీఆర్‌ అంత మంచోణ్ణి కాదని అన్నాడని, ఆయనను మంచోడని ఎవరు అంటారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ కేసీఆర్‌కంటే అవినీతిపరుడని విమర్శించారు. ప్రతిసారి తమకు కరీంనగర్‌ అంటే సెంటిమెంట్‌ అంటారని, వారు కరీంనగర్‌కు చేసిందేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, మామిడి సత్యనారాయణరెడ్డి, వాడె వెంకట్‌రెడ్డి, దన్నూసింగ్‌, రమేశ్‌, దండి రవీందర్‌, కీర్తి కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:40 PM