అన్నపూర్ణగా పాలమూరు
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:57 PM
ఉమ్మడి జిల్లాను అన్నపూర్ణగా తీర్చుదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
- సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రతీ నెల సమీక్షలు
- అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల నిధులు పాలమూరు జిల్లాకు కేటాయిస్తాం
- ఉమ్మడి పాలమూరుతో మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం
- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్
- జూరాల, శ్రీశైలంతో సహా అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినవే..
- వనపర్తి జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
- రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభం.. ఏడు సబ్ స్టేషన్లకు శంకుస్థాపన
ఉమ్మడి జిల్లాను అన్నపూర్ణగా తీర్చుదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వనపర్తి జిల్లాలో గురువారం ఆయన రెండు సబ్‌స్టేషన్లు ప్రారంభించారు. అదేవిధంగా ఏడు సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే అని గుర్తు చేశారు. ఇప్పుడు దిగువన నీరు తీసుకుంటున్న శ్రీశైలం ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందన్నారు. పాలమూరు జిల్లాకు మా కుటుంబానికి విడదీయరాని అనుబంధముందని తెలిపారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసుకున్న సబ్‌స్టేషన్లను కలుపుకుంటే వనపర్తికి విద్యుత్ శాఖ తరపున రూ. 70 కోట్ల పనులు చేపట్టామని అన్నారు.
మహబూబ్‌నగర్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. పాలమూరును అన్నపూర్ణగా తీర్చిదిద్దుతామని, వెనుకబాటు, ఆకలి, వలసలు లేని పాల మూరు లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క తెలిపారు. వనపర్తి జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన.. రేవల్లి మండలం తల్పునూర్, గోపాల్‌పేట మండలం ఏదుట్లలో సబ్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యా లయం వద్ద ఏర్పాటు చేసిన ఏడు 33/11 కేవీ సబ్ స్టేషన్ల శిలాఫల కాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళ్యాణసాయి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, దివంగత సోదరుడు మల్లు అనంతరాములు దగ్గర నుంచి ప్రస్తుతం నాగర్‌కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి వరకు తమను ఈ జిల్లా ప్రజలు ఆశీర్వదిస్తూ వస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ జిల్లాకు చెందిన వారేనని, అయిదేళ్లలో రూ. లక్ష కోట్లు ఈ జిల్లా కేటాయించే బాధ్యత తనకు అప్పగించారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూరాల, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ తెచ్చినవేనని, పాలమూరు- రంగారెడ్డికి కూడా జీవో ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే అని తెలిపారు. ఇప్పుడు దిగువన నీరు తీసుకుంటున్న శ్రీశైలం ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని గుర్తుచేశారు. ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీ, డిండి, పాలమూ రు- రంగారెడ్డి ప్రాజెక్టులను ప్రాధాన్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎవరికైనా రుణమాఫీ కాకపోతే వారి వివరాలు తీసుకోవా లని, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వనపర్తిలో ఒక్కరోజే రెండు సబ్ స్టేషన్లను ప్రారంభించుకోవడం, ఏడింటికి శంకుస్థాపన చేసుకోవడం గర్వించదగిన అంశ మని అన్నారు. ఇప్పటికే లైన్లు సరిచేయడానికి, పోల్స్‌కు ఇతర విద్యుత్ సామగ్రికి రూ.45 కోట్లు ఇచ్చామని, ప్రస్తుతం శంకుస్థాపన చేసుకున్న సబ్‌స్టేషన్లను కలుపు కుంటే వనపర్తికి విద్యుత్‌శాఖ తరపున రూ. 70 కోట్ల పనులు చేపట్టినట్ల య్యిందన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షు డు రాజేంద్రప్రసాద్, మునిసిపల్ చైర్మన్ మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జడ్పీచైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకుంటే ట్రాన్స్‌ఫార్మర్ : మంత్రి జూపల్లి
గత ప్రభుత్వంలో ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు చెప్పులు అరిగేలా తిరిగేవారని, ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ట్రాన్స్‌ఫార్మ ర్ అందజేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు అన్నారు. ఒక్కరోజే ఏడు సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేసుకోవ డం శుభ పరిణామమని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంటు రాదని చెప్పారని, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ఉచిత కరెంటు అంది స్తున్నామన్నారు. ఉచిత కరెంటుకు కాంగ్రెస్ పార్టీ నాంది పలికింద ని తెలిపారు. అదేదో బీఆర్‌ఎస్ చేసిందని డబ్బా కొట్టుకుంటున్నా రని విమర్శించారు. ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని, ఇప్పటికే రుణమాఫీ చేశామని, రైతు భరోసా అందజేస్తామని తెలిపారు.
రూ. లక్ష కోట్లు ఇచ్చి అభివృద్ధి
- డాక్టర్ చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి అయిదేళ్లలో రూ. లక్ష కోట్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క ఆ నిధులను మంజూరు చేసి.. పాలమూరు సమగ్రాభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కోరారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షించారు.
రైతులను రాజు చేస్తాం : ఎంపీ మల్లు రవి
వనపర్తిలో రాజుల కాలంలో ఏడు సముద్రాలు నిర్మించారని, ఇప్పుడు కూడా సాగునీటి రంగంపై దృష్టి సారించి.. ప్రతీ ఎకరా కు నీరందించి రైతులను రాజులను చేస్తామని ఎంపీ మల్లు రవి తెలిపారు. వనపర్తికి 2వేల ట్రాన్స్‌ఫార్మర్లు కావాలని, గురువారం 50 ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేశామని, త్వరలో 1950 ట్రాన్స్ ఫార్మ ర్లు పంపిణీ చేసేందుకు ఏజెన్సీకి టెండర్లు ఖరారు చేశామన్నారు. వ్యవసాయానికి విద్యుత్ ముఖ్యమని ఒక్కరోజే ఏడు సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశామన్నారు. అలాగే నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళ, రుణమేళా నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమా నికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరుకానున్నారని తెలిపారు.
రైతులకు ఏడాదిలో రూ. 78వేల కోట్లు
శివసేనారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్
రైతుల కోసం ఏడాదిలో రూ. 78వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. అయినా బీఆర్‌ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. బడ్జెట్‌లో రూ. 66వేల కోట్లు అప్పులకు వడ్డీ, అసలు చెల్లించేందుకే వెళ్తుందని, అయినప్పటికీ.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే పథకాల అమలుకు కొంత ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు.
Updated Date - Jan 09 , 2025 | 11:57 PM