ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

ABN, Publish Date - Mar 24 , 2025 | 11:15 PM

ఆయా శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

- ప్రజావాణికి 125 ఫిర్యాదులు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఆయా శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంతవరకు పెండింగ్‌లో ఉంచరాదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, అకోశ్‌కుమార్‌, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, అర్బన్‌ తహసీల్దార్‌ ఘాన్సీరాం పాల్గొన్నారు. అంతకుముందు డీఆర్డీవో ద్వారా గుర్తించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులైన 41 మంది మహిళలకు తాపి మేస్ర్తీలో మహబూబ్‌నగర్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్‌ట్రక్షన్‌ ద్వారా హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో బండమీదిపల్లి నిర్మతి కేంద్రంలో ఆరు రోజులు పాటు ఏర్పాటు చేసిన శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.5 లక్షల బడ్జెట్‌లో నాణ్యతగా ఎలా నిర్మించాలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం సేప్టీ మెటీరియల్‌, హెల్మెట్‌, టీ షర్ట్‌, బ్యాగ్‌ , బుక్‌, పన్‌లను అందజేశారు. కలెక్టర్‌ తన నిధుల నుంచి సీసీ కుంట, దమగ్నాపూర్‌కు చెందిన మహిళా సంఘం సభ్యురాలు రాణి అనే మహిళకు ప్రయోగాత్మకంగా ఇటుక మిషన్‌కు రూ.లక్ష చెక్కును అందజేశారు.

వృద్థుల సమస్యలు పరిష్కరించాలి

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : వృద్థుల సమస్యలు పరిష్కరించాలని సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, కార్యదర్శి నస్కటి నాగభూషణం ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. కలెక్టర్‌ కార్యాలయం జిల్లా కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉండటం వల్ల వృద్థులు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లా కేంద్రానికి సమీపంలో వృద్ధులకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కోరారు. వెల్‌నెస్‌ సెంటర్‌ మొదటి అంతస్తులో ఉందని, దీంతో వృద్ధులు మెట్లు ఎక్కడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పట్టణ నడిబొడ్డుకు అందుబాటులోకి మార్చాలని కోరారు.

Updated Date - Mar 24 , 2025 | 11:15 PM