ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు
ABN, Publish Date - Jan 12 , 2025 | 11:32 PM
ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతీరోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారని, పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంటే ఎలా అంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.
- జనరల్ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ లోపంపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మండిపాటు
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతీరోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారని, పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంటే ఎలా అంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం శ్రమదానం కార్యక్రమంలో భాగంగా జనరల్ ఆసుపత్రిలో మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించారు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్య, వైద్యం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని, కొందరు వైద్యాధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. ఆసుపత్రి బయట, ఆవరణలో మునిసిపాలిటీ నుంచి పారిశుధ్య పనులు చేపడతాం. కానీ లోపల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత వైద్యాధికారులదే కదా అని ప్రశ్నించారు. అవసరమైతే పురపాలిక, ముడా నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. ఆరునెలల్లో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్‌సింగ్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, నాయకులు షబ్బీర్‌అహ్మద్, రాములుయాదవ్, ఫయాజ్, మోసిన్, రఘు పాల్గొన్నారు.
పురపాలికను అభివృద్ధి చేస్తా..
మహబూబ్‌నగర్ : పాలమూరు పురపాలికను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం పురపాలిక పరిధిలోని 17వ వార్డులో రూ.81.60 లక్షలు, 5వ వార్డులో రూ.1.10 కోట్లు, మూడో వార్డులో రూ.1.91 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, హైమాస్ట్ లైట్లు, కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్తాపన చేశారు. అన్ని వార్డుల్లో మునిసిపల్, ముడా చైర్మన్‌లతోపాటు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపిస్తున్నారని, రానున్న రోజుల్లో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. కౌన్సిలర్లు రామాంజనేయులు, జంగమ్మ, కోరమోని వనజ, కోరమోని వెంకటయ్య, ఉర్పుల నాగరాజు, కృష్ణకాంత్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 11:32 PM