Share News

తగ్గేదేలే..

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:33 PM

ఎన్ని అవాంతరాలు ఎదురైనా బయలర్‌ కోడి తగ్గేదేలే అంటోంది. ధర విషయంలో కొండెక్కి దిగనంటోంది.

తగ్గేదేలే..

  • కొండెక్కిన కోడి మాంసం ధరలు

  • కిలో రూ.280 పలుకుతున్న చికెన్‌

  • ఉత్పత్తి తగ్గడంతో భారీగా పెరిగిన ధరలు

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : ఎన్ని అవాంతరాలు ఎదురైనా బయలర్‌ కోడి తగ్గేదేలే అంటోంది. ధర విషయంలో కొండెక్కి దిగనంటోంది. మొన్నటి దాకా బర్డ్‌ఫ్ల్యూ భయంతో చికెన్‌ మార్కెట్‌ భారీగా పతనమైన విషయం తెలిసిందే. భారీ నష్టాలతో పౌలీ్ట్ర రైతులు కోళ్ల పెంపకానికి దూరం కావడం కారణంగా డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ లేక కేవలం ప్రైవేట్‌ హెచరీస్‌ల నుంచి మాత్రమే కోళ్ల దిగుమతి ఉండటంతో ఈ మధ్య చికెన్‌ ధర అమాంతంగా పెరిగింది. రెండు నెలల క్రితం చికెన్‌ అంటేనే జనం జంకే పరిస్థితులు ఉండేవి. ఈ క్రమంలో కిలో చికెన్‌ ధర రూ.150కు పడిపోయింది. బర్డ్‌ఫ్ల్యూ భయం పోగొట్టేందుకు ఫాలీ్ట్రఫాం యజమానులు చికెన్‌ వంటకాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. అయినా మార్కెట్‌ పుంజుకోలేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 67లక్షల 38వేల 73 బాయిలర్‌, లేయర్‌, దేశవాళి కోళ్లు ఉండాల్సి ఉండగా, ప్రత్యేక వైరస్‌ సోకిన కారణంగా నాటుకోళ్లతో సహా టర్కీ కోళ్లు, బాతులు కూడా మృత్యువాత పడ్డాయి. దీంతో భారీగా నష్టపోయిన రైతులు మళ్లీ పౌలీ్ట్ర పరిశ్రమ వైపు మొగ్గు చూపడానికి భయపడ్డారు. పెద్ద పెద్ద హెచరీస్‌లో మాత్రమే బాయిలర్‌ కోళ్లు అందుబాటులో ఉండటం, ఈ నేపథ్యంలోనే రంజాన్‌, ఉగాది పండుగలు రావడంతో డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ లేక ధర అమాంతం పెరిగింది. గడిచిన 20రోజుల క్రితం కూడా కేవలం ధర రూ.150 పలికిన చికెన్‌ అమాంతం కొండెక్కింది. ప్రస్తుత ధర రూ.280కు చేరడంతో కోడి మాంసం కొనుగోలు చేయడానికి జనం పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. పౌలీ్ట్ర రైతులు తిరిగి నిలదొక్కుకోవాలంటే జూన్‌, జూలై వరకు ఆగాల్సిందేనని పౌలీ్ట్ర పరిశ్రమ యజమానులు అంటున్నారు.

Updated Date - Apr 03 , 2025 | 11:33 PM