పట్నం నుంచి పల్లెబాట
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:06 PM
మూడ్రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు పల్లెబాట పట్టారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పిల్లా పాపలతో కలిసి శనివారం సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దాంతో ఉదయం నుంచే రహదారులు రద్దీగా మారాయి.
పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు బారులు తీరిన జనం
బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిటకిట
హైవేపై జంక్షన్లు జామ్
మహబూబ్‌నగర్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మూడ్రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు పల్లెబాట పట్టారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పిల్లా పాపలతో కలిసి శనివారం సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దాంతో ఉదయం నుంచే రహదారులు రద్దీగా మారాయి. జాతీయ రహదారి పొడవునా జంక్షన్‌లన్నీ జామ్ అయ్యాయి. రైళ్లు నిండిపోయాయి. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి వందల సంఖ్యలో ప్రయాణికులు బస్టాండ్‌కు చేరడంతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. అసలే ఉచిత ప్రయాణం వల్ల మహిళలతో రద్దీగా ఉండే బస్సులు ఇప్పుడు పట్నం జనం, పాలమూరు నుంచి ఊళ్ళకు వెళ్ళే జనాలతో నిండిపోతున్నాయి. బాలానగర్ నుంచి అలంపూర్ వరకు ఉమ్మడి జిల్లాలో విస్తరించిన హైవేపై వాహనాలు బారులు తీరాయి. దారి పొడవునా ఎక్కడ చిన్న జంక్షన్ ఉన్నా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక్కో జంక్షన్ దాటేందుకు కనీసం అరగంట సమయం పట్టడంతో హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చేందుకు మూడుగంటలపైనే అవుతోంది. పోలీసులు, ఎస్‌ఐలు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమించాల్సి వస్తోంది. జడ్చర్ల ఫ్లైఓవర్, భూత్పూర్ ఫ్లైఓవర్‌ల దగ్గర వందల వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివారం రద్దీ మరింత పెరగనుంది.
కళకళలాడుతున్న పల్లె లోగిళ్లు
ఉపాధి కోసం వలస వెళ్లిన వారు, ఉద్యోగం, చదువుల నిమిత్తం హైదరాబాద్, పాలమూరు వంటి పట్టణాల్లో ఉన్న వారు పండగకు సొంతూళ్ళకు వస్తుండటంతో ఇన్నాళ్లు బోసిబోయిన పల్లెలు సందడిగా మారుతున్నాయి. తాళాలు వేసిన ఇళ్లు తెరుచుకుంటున్నాయి.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
పండుగకు ప్రజలు అధిక సంఖ్యలో గ్రామాలకు వెళ్తుండటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరిగిందని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా పోలీ్‌సశాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఎస్పీ జానకి చెప్పారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున జాతీయ రహదారిపై ఉన్న ఆయా స్టేషన్‌ల పరిధిలోని పోలీసులు ట్రాఫిక్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం ఆమె జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై వాహనాల రద్దీని పరిశీలించి, పోలీసులకు తగు సూచనలు చేశారు. నేడు, రేపు పోలీసులు అలర్ట్‌గా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 11:06 PM