అనుమతి కొంత.. తరలించేది కొండంత

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:28 PM

అడ్డాకుల, మూసాపేట ఉమ్మడి మండలాల పరిధిలోని అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అనుమతి కొంత.. తరలించేది కొండంత
ఇసుక తరలించడంతో తాళగడ్డ పెద్దవాగులో ఏర్పడిన గోతులు

- ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా తాళ్లగడ్డ పెద్దవాగు

- పట్టించుకోని అధికారులు

మూసాపేట, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : అడ్డాకుల, మూసాపేట ఉమ్మడి మండలాల పరిధిలోని అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూసాపేట మండలం తాళ్లగడ్డ, తిమ్మాపూర్‌, పోల్కంపల్లి, కొమిరెడ్డిపల్లి పెద్దవాగు నుంచి ఇసుక దళారులు రాత్రీ పగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లు, మినీ డీసీఎంలతో ఇసుకను తరలిస్తున్నారు. తాళ్లగడ్డ, తిమ్మాపూర్‌ వాగు వద్ద కొందరు రైతులు తమ పొలాల నుంచి దారి వెళ్తేందని డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారే తప్పా.. వాగు నుంచి ఎందుకు ఇసుకను తరలిస్తున్నారని అడ్డుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డాకుల మండలం పొన్నకల్‌, వర్నే, ముత్యాలంపల్లి, బలీదుపల్లి వాగుల నుంచి సైతం బడా నేతల అండదండలతో ఇసుక అక్రమంగా తరలుతోందని స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెల 16వ తేదీన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోల్కంపల్లి శివారులో మూడు టిప్పర్ల ఇసుకను నిల్వ చేయగా సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి, సీజ్‌ చేశారు. కొందరు దళారులు ఇసుకను ఎలాగైనా అక్రమంగా రవాణా చేయాలనే ఆలోచనతో గ్రామాల్లో జరిగే సీసీ రోడ్డు, ఇతర భవన నిర్మాణాల పనుల పేరిట సంబంధిత శాఖ అధికారులతో కొద్ది పాటి అనుమతులు పొందుతున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Feb 09 , 2025 | 11:28 PM