క్షయ నివారణ అందరి బాధ్యత
ABN, Publish Date - Mar 24 , 2025 | 11:13 PM
జిల్లాలో క్షయ (టీబీ)ని నివారించడం మన అందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు.

- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో క్షయ (టీబీ)ని నివారించడం మన అందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. సోమవారం ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి ఆవరణలో గల టీబీ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి డీఎంహెచ్‌వోతో పాటు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాంమోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని, మాట్లాడారు. టీబీ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందని, ఈ చిన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పటికీ దానిపై నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వారానికి మించి దగ్గు, ఆయాసం, నీరసం ఉండే ప్రతీ ఒక్కరు టీబీ పరీక్ష చేయించుకోవాలన్నారు. టీబీని ముందస్తుగా గుర్తించి ఏడాది పాటు మందులు వాడితే అది పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు. కానీ చాలా మంది సగం వరకు మాత్రమే మందులు వాడుతున్నారని, అలాంటి వారికి మళ్లీ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ మందులు ఉచితంగా ఇస్తున్నారని, దీంతో పాటు పౌష్టికాహారం తీసుకునేందుకు ప్రతీ నెల రూ.1000 ప్రభుత్వం ఇస్తుందన్నారు. అంతకుముందు టీబీపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రతిజ్ఞ చేశారు. జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ మల్లికార్జున్, ఐఎంఏ జిల్లా కోశాధికారి డాక్టర్ సంపత్‌కుమార్, ఎస్‌వీఎస్ ఆసుపత్రి పల్మనాలజిస్టు డాక్టర్ శరత్‌చంద్ర, ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ జరీనా పాల్గొన్నారు.
Updated Date - Mar 24 , 2025 | 11:13 PM