24 పేజీల బుక్‌లెట్.. సీక్రెట్ కోడ్
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:36 AM
పదో తరగతి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన సంస్కరణలు కఠినంగా అమలైతే పరీక్షా పత్రాల లీకేజీ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది. అలాగే పరీక్ష మధ్యలో అదనపు సమాధానపత్రం అడిగే ఇబ్బంది విద్యార్థులకు తప్పనుంది.

పదో తరగతి పరీక్షల్లో మార్పులు తెచ్చిన విద్యాశాఖ
భువనగిరి టౌన్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన సంస్కరణలు కఠినంగా అమలైతే పరీక్షా పత్రాల లీకేజీ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది. అలాగే పరీక్ష మధ్యలో అదనపు సమాధానపత్రం అడిగే ఇబ్బంది విద్యార్థులకు తప్పనుంది. అలాగే ఈ సంవత్సరంనుంచే గ్రేడింగ్ బదులు మార్కులు అమల్లోకి రానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు ఉమ్మడి జిల్లా నుంచి 44,530 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
పకడ్బందీ చర్యలు
ప్రశ్నాపత్రాల లీకేజీ విద్యార్థులకు, ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ప్రశ్నపత్రం లీకేజీ అయినా క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా రాష్ట్రమంతటా వైరల్ అవుతోంది. దీంతో పరీక్షల నిర్వహణ అప్రతిష్టపాలవుతూ ప్రశ్నాపత్రం లీకైన పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతిమంగా పరీక్షలకోసం కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీ నియంత్రణకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రశ్నాపత్రం లీకేజీ జరిగితే ఎక్కడి నుంచి జరిగింది. తెలుసుకునేలా ప్రశ్నాపత్రాలపై సీక్రెట్ సెక్యూరిటీ కోడ్ ముద్రించనున్నారు. ప్రశ్నాపత్రాన్ని జీరాక్స్ తీసినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అయినా ప్రశ్నా పత్రంలో ఉండే సీక్రెట్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే ఏ సెంటర్‌లో లీకేజీ అయ్యింది. విద్యాశాఖ అధికారులకు తెలుస్తుంది. దీంతో ప్రశ్నాపత్నం లీకేజీని ఉద్యోగులు సాహసించరని అధికారులు భావిస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పట్టుబడే ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించడంతో పాటు శిక్షలు పడేలా కేసులు నమోదు చేయనున్నారు.
ప్రతీ విద్యార్థికి 24 పేజీల బుక్‌లెట్
పరీక్షల గదిలోకి వెళ్లిన ప్రతీ విద్యార్థికి పరీక్ష రాసేందుకు 24 పేజీల బుక్ లెట్ అందిస్తారు. దీంతో అదనపు సమాధాన పత్రాలను అడిగే ఇబ్బంది తప్పనుంది. అలాగే ఈ విద్యాసంవత్సరం నుంచి పరీక్షా ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దుచేశారు. ఇంటర్నల్, థియరీ పరీక్షల మార్కులను కలిపి వంద మార్కులకు తుది మార్కులను ప్రకటిస్తారు. 2024-25 విద్యాసంవత్సరానికి మాత్రమే ఇంటర్నల్ మార్కులు లెక్కించనుండగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి వంద మార్కులకు విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఆరు సబ్జెక్ట్‌లకు ఏడు రోజుల పాటు పరీక్షలు జరుగనున్నాయి. సైన్స్‌లో మాత్రమే జీవశాస్త్రం, భౌతిక శాస్త్రానికి వేర్వేరుగా రెండు రోజులపాటు పరీక్షలు జరగనుండగా మిగతా ఐదు సబ్జెక్ట్‌లకు ఒక్కో పరీక్ష నిర్వహిస్తారు. పదో తరగతి లాంగ్ మెమోలపై విద్యార్థుల పర్మినెంట్ ఎడ్యూకేషన్ నెంబర్ (పెన్)ను ముద్రించనున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:36 AM