ఏదుల-డిండి లింక్‌పై నేడు కీలక నిర్ణయం
ABN, Publish Date - Jan 03 , 2025 | 11:49 PM
డిండి ఎత్తిపోతల పథకంలో కీలకమైన నీటి సేకరణ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చే అంశంపై నేడు స్పష్టత రానుంది. ఈ పథకానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి రోజు కు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని తీసుకోవాలని, 2024, మార్చి 13న రాష్ట్ర ప్రభు త్వం అనుమతులు మంజూరుచేసింది.
రూ.1788.90కోట్లతో ఇరిగేషన్‌శాఖ ప్రతిపాదనలు
నేడు కేబినెట్ ఆమోదిస్తే టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం
ఏదుల నుంచి నీటి సేకరణ ప్రతిపాదనపై పాలమూరు నుంచి వ్యతిరేకత
ప్రభుత్వ నిర్ణయంపైనే అందరిచూపు
దుందుభి నదిపై చెక్‌డ్యామ్ స్థానంలో రబ్బర్‌డ్యామ్‌కు ప్రతిపాదనలు
రెండున్నరేళ్లలో పనులు పూర్తిచేస్తామంటున్న అధికారులు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): డిండి ఎత్తిపోతల పథకంలో కీలకమైన నీటి సేకరణ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చే అంశంపై నేడు స్పష్టత రానుంది. ఈ పథకానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి రోజు కు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని తీసుకోవాలని, 2024, మార్చి 13న రాష్ట్ర ప్రభు త్వం అనుమతులు మంజూరుచేసింది. ఆ తరువాతే ఏదు ల నుంచి ఉల్పర బ్యారేజీ వరకు కాల్వలు, టన్నెల్స్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు రూ.1788.89కోట్లతో భారీ నీటిపారుదలశాఖ ప్రతిపాదించింది. శనివారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పనులకు ఆమోదం లభిస్తే, వెంటనే పరిపాలనా అనుమతులు మంజూరు చేసి టెండ ర్లు పిలవాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు.
డిండి ఎత్తిపోతలకు ఏదుల నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం భావిస్తుండగా, దీనిపై పాలమూరు జిల్లా నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరువుపీడిత ప్రాంతమైన మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు ఉద్దేశించిన పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి నీటిని నల్లగొండ జిల్లాలో నిర్మించే డిండికి తరలించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెండు ఉమ్మడి జిల్లాల నడుమ సున్నితమైన అంశం కావడంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం పీఆర్‌ఎల్‌ఐ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించినా, ఏ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలనే అంశాన్ని తేల్చకుండా దిగువన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తిచేస్తూ వచ్చింది. రిజర్వాయర్‌ల పనులు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో నీటిసేకరణకు నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య స్థితిని ఎదుర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదుల నుంచి నీటిని సేకరించే విషయంలో స్పష్టత ఇచ్చింది. ఈ పనులపై కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారా? లేక మరికొంత సమయం తీసుకుంటారా? అనే విషయం శనివారం తేలనుంది.
పోతిరెడ్డిపల్లి వద్ద చెక్‌డ్యామ్ స్థానంలో రబ్బర్ డ్యామ్?
ఏదుల రిజర్వాయర్ నుంచి ఉల్పర బ్యారేజీ వరకు అవసరమయ్యే నిర్మాణాలకు రూ.1788.89కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసిన ఇంజనీర్లు ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ సమావేశం ఆమోదం తెలపాల్సి ఉంది. ఏదుల రిజర్వాయర్ నుంచి 800 మీటర్ల అప్రోచ్ ఛానల్, 2.525కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, 9మీటర్ల డయాతో 16కిలోమీటర్ల టన్నెల్, మళ్లీ 3.050కిలోమీటర్ల ఓపెన్‌కెనాల్ నిర్మిస్తారు. మొత్తం 21.575కిలోమీటర్ల తర్వాత ఏదుల నుంచి నీరు దుందుభినదిలోకి వెళ్తుంది. అక్కడి నుంచి 6.325కిలోమీటర్ల తర్వాత ఉన్న పోతిరెడ్డిపాడు చెక్‌డ్యామ్‌కు 1.500కిలోమీటర్ల దిగువన ఉల్పర వద్ద బ్యారేజీ నిర్మిస్తారు. అయితే పోతిరెడ్డిపాడు వద్ద చెక్‌డ్యామ్ స్థానంలో రబ్బర్‌డ్యామ్ చేపట్టాలని నీటిపారుదలశాఖ ఇంజనీర్లు ప్రతిపాదిస్తున్నారు.
భూసేకరణే, నిర్వాసితుల సమస్యలూ పెండింగ్‌లోనే
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఎనిమిది రిజర్వాయర్లతో పాటు, ప్రధాన కాల్వ, తాజాగా ప్రతిపాదించిన హెడ్‌వర్క్స్‌కు సంబంధించిన నిర్మాణాలకు అవసరమైన భూమిని సేకరించే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా ప్రతిపాదించిన ఏదుల రిజర్వాయర్ నుంచి ఉల్పర బ్యారేజీ వరకు చేపట్టే కీలకమైన పనులకు అవసరమైన భూసేకరణకు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉల్పరకు దిగువ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన కాల్వ, డిండి ప్రాజెక్టు ఎత్తు పెంపు, అప్రోచ్ ఛానల్స్, సింగరాజుపల్లి, ఎర్రవల్లి-గోకారం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణాలకు సుమారు 16,030 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు 12,052 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా 3,978 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని గోకారం-ఎర్రవల్లి రిజర్వాయర్‌తో నిర్వాసితులయ్యే ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులకు, నల్లగొండ జిల్లా కిష్టరాయన్‌పల్లితో నిర్వాసితులయ్యే నాంపల్లి మండలం లక్ష్మణపురం, చింతపల్లి మండలం ఈదులగూడెం గ్రామస్థులకు, శివన్నగూడెం రిజర్వాయర్‌తో నిర్వాసితులయ్యే చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, వెంకెపల్లి, వెంకెపల్లి తండావాసులకు మొత్తం సుమారు 1,899 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు ప్యాకేజీలు కుదరకపోవడంతో నిర్వాసితుల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరికి పునరావాసం కల్పించే అంశంపై కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. వీరికి ప్యాకేజీలు ఖరారైతేనే భూసేకరణ సమస్య కొలిక్కిరానుంది.
పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నాలు
డిండి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రారంభించనందున జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ 2022 డిసెంబరులో పనులు నిలిపివేయాలని సూచించింది. అంతేగాక రూ.92.85కోట్ల జరిమానా విధించింది. దీంతో ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సాధించే బాధ్యతలను ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ)కి అప్పగించింది. అందుకోసం ఆ సంస్థకు రూ.87.95లక్షల మొత్తాన్ని కూడా చెల్లించింది. ఈ అనుమతుల కోసం ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఈ సంస్థ కృషి చేస్తున్నా విషయం మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు.
రెండున్నరేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలన్నదే లక్ష్యం
వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ, ఆర్‌వీఆర్‌డీఎల్‌ఐ ప్రాజెక్టు
డిండి ఎత్తిపోతల పథకాన్ని రానున్న రెండున్నరేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉన్నతస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేస్తున్నాం. రిజర్వాయర్ల పనులు దాదాపు కొలిక్కివచ్చాయి. భూసేకరణకు, నిర్వాసితులకు పరిహారాలు, ప్యాకేజీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే భూసేకరణ పూర్తిచేస్తాం. ఏదుల నుంచి నీటిని తరలించే పనులపై ఈఎన్‌సీ స్థాయిలో నిర్ణయం ఉంటుంది.
Updated Date - Jan 03 , 2025 | 11:49 PM