ఆరోగ్యం.. ఆదాయం
ABN, Publish Date - Jan 03 , 2025 | 01:05 AM
: తమకు తెలిసిన జొన్నరొట్టెల తయారీ పనిని ఆ మహిళలు జీవనోపాధికి సోపానమార్గంగా ఎంచుకున్నారు.
స్వయం కృషితో ముందుకు సాగుతున్న మహిళలు
సంప్రదాయ వంటకాలతో స్వయం ఉపాధి
కుటుంబాలకు చేదోడు వాదోడుగా..
(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట రూరల్) : తమకు తెలిసిన జొన్నరొట్టెల తయారీ పనిని ఆ మహిళలు జీవనోపాధికి సోపానమార్గంగా ఎంచుకున్నారు. వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణకు సహాయపడుతూనే నలుగురికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు. సంప్రదాయ వంటకాలతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నతీరున వీరి వంటలు ఉండడంతో స్థానికులు కొనుగోలు చేసేందుకు బారులు తీరుతున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో నలుగురు మహిళలు సుడుగు రజిత, సూదగాని పారిజాత, తాళ్ల ఉమారాణి, పోరెల్లి విజయలు స్వయం ఉపాధికోసం చేయి చేయి కలిపారు. తమ కాళ్లపై తామే నిలబడాలనే ఆలోచనతో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల తయారీకి శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి హోంఫుడ్స్ దుకాణం ఏర్పాటు చేసుకొని నడుం బిగించారు. భర్త సంపాదించే ఆదాయానికి తోడు తమ సంపాదన కూడా కలిస్తే చేదోడువాదోడు ఉంటుందని చెబుతున్నారు. నలుగురు కలిసి రూ.4లక్షల పెట్టుబడిపెట్టి యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక ప్రజలతోపాటు వచ్చే భక్తులకు నాణ్యమైన రొట్టెలను అందిస్తున్నారు. ప్రధానంగా జొన్న, సజ్జ రొట్టెలు, సర్వపిండి, రాగిజావ, జొన్న గట్క, చపాతీలు ఇతర పిండివంటలు తయారు చేస్తూ సరసమైన ధరల్లో అందిస్తున్నారు. సుమారు రూ.4లక్షల్లో పిండిగిర్ని, పప్పులు రుబ్బడానికి గ్రైండర్, గ్యాస్ స్టౌవ్, రొట్టెలు తయారు చేయడానికి కావాల్సిన సామగ్రి కొనుగోలు చేసుకొని వారే పచ్చజొన్నలు, గోధుములు, రాగులు, చిరుధాన్యాలు ఒకేసారి కొనుగోలు చేసి, వాటిని పట్టించి జొన్నరొట్టెలు, చపాతీలు, సర్వపిండి, జావా, జొన్నగటుక, పెసరట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. వాటికి కావల్సిన పప్పు, కూరగాయలు, ఆకుకూరలు రుచికరంగా తయారుచేసి సాయంత్రం ప్రజలకు ఎంచక్క అందిస్తారు. జొన్నరొట్టె రూ.25, చపాతి రూ.20, సర్వపిండి రూ.30, రాగిజావ గ్లాస్ రూ.20, జొన్నగట్క రూ.20 ఇలా.. సరసమైన ధరల్లో అందిస్తున్నారు. ప్రతిరోజు వారు పెట్టిన ఖర్చుపోనూ వారికి రోజు ఒక్కకొక్కరికి రూ.1100 చొప్పున ఆదాయం వస్తోంది. సాయంత్రం అయ్యిందంటే షుగర్ ఉన్నవాళ్లు, స్థానికులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. వీరి వంటల ద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడుతూ స్వయం ఉపాధితో ఎదుగుతున్న ఆ మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.
ఆరోగ్యంకోసం జొన్నరొట్టెలు
ప్రధానంగా షుగర్, బీపీ ఉన్నవాళ్లు రాత్రివేళల్లో జొన్నరొట్టెలు, చపాతీలు తింటే ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచనతో ఈ రొట్టెల విక్రయం నిర్ణయం తీసుకున్నాం. ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పచ్చజొన్న పిండిద్వారానే రొట్టెలు చేస్తున్నాం.
సుడుగు రజిత, యాదగిరిగుట్ట
స్వయం ఉపాధి లభిస్తుంది
మా కాళ్లపై మేము నిలబడి, స్వయం ఉపాధి పొందడానికి జొన్నరొట్టెల తయారీ ఎంచుకున్నాం. నలుగురం కలిసి మెలిసి పనిచేస్తూ, మా కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి నష్టాల్లేకుండా వ్యాపారంలో ముందుకు వెళ్తున్నాం.
సూదగాని పారిజాత, యాదగిరిగుట్ట
Updated Date - Jan 03 , 2025 | 01:05 AM