ప్రగతి చక్రం, పనిఒత్తిడి భారం
ABN, Publish Date - Jan 24 , 2025 | 12:43 AM
దేశ ప్రగతికి రవాణా రంగమే పునాది. ఆ రవాణా రంగాన్ని నడిపిస్తుంది డ్రైవర్లు. సరుకులు మొదలు ప్రయాణికులను తరలిస్తూ డ్రైవర్లు దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారు.

నిరంతర ఒత్తిడిలో ఆర్టీసీ డ్రైవర్లు
ఆరోగ్యపరమైన ఇబ్బందులు
14 ఏళ్లుగా నిలిచిన డ్రైవర్ల నియామకం
నేడు ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం
దేశ ప్రగతికి రవాణా రంగమే పునాది. ఆ రవాణా రంగాన్ని నడిపిస్తుంది డ్రైవర్లు. సరుకులు మొదలు ప్రయాణికులను తరలిస్తూ డ్రైవర్లు దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారు. అలా ంటి రవాణా రంగంలో కీలకమైన టీఎ్‌సఆర్టీసీలో డ్రైవర్ల పాత్ర గణనీయం. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. వారి సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది జనవరి 24న ఆర్టీసీలో డ్రైవర్స్ డేను నిర్వహిస్తున్నారు. అయితే సంస్థ పురోభివృద్ధిలో ముందుంటున్నా వారు సంక్షేమంలో వెనకబడుతున్నారు. పనిఒత్తిడిలో అనారోగ్యానికి గురవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ)
ఆర్టీసీలోని విభాగాల్లో డ్రైవర్ల విధులే కీలకం. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉన్నా ఆ దిశగా సంస్థ ఏర్పాట్లు చేయలేదు. మరోవైపు సరిపడా డ్రైవర్లు లేక ఉన్న వారితోనే పనిచేయిస్తుండడంతో వారు తీవ్రఒత్తిడికి గురవుతున్నారు. ఆర్టీసీలో చివరిసారిగా 2010లో సిబ్బంది నియామకం చేపట్టారు. అప్పటినుంచి నియామకాలు చేపట్టలేదు.
దశాబ్దానికి పైగా చేపట్టని నియామకాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా 50 నుంచి 100 మంది డ్రైవర్లు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈ 14ఏళ్లలో సుమారు 1000 మందికి పైగా డ్రైవర్లు పదవీవిరమణ చేసినా కొత్త డ్రైవర్ల నియామకం చేపట్టలేదు. కొత్త బస్సులను కొనుగోలు చేయకపోవడంతో పాటు పాతబస్సుల స్థానంలో కొత్తవి తీసుకువస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 2021లో సుమారు 1,150 మంది డ్రైవర్లు ఉండగా 2023లో తగ్గారు. 2:6 నిష్పత్తి ప్రకారం సుమారు 1040 మంది డ్రైవర్లు ఉండాలి. కానీ కేవలం 818 మంది మాత్రమే ఉన్నారు. వారితోనే డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారు. ఎనిమిది గంటలు విధులు నిర్వర్తించాల్సిన డ్రైవర్లు 16 గంటలకు పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో తమపై ఒత్తిడి పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నామని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు.
ఒత్తిడితో అనారోగ్యం...
ఆర్టీసీలో డ్రైవర్లు రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్లి రావాలంటే 9 గంటల సమయం పడుతుంది. ఆ వెంటనే అదనపు డ్యూటీ ఉండటంతో 18 గంటలు బస్సులోనే ఉంటున్నారు. మహా లక్ష్మి పథకంతో పెరిగిన ప్రయాణికులతో డ్రైవర్లకూ తరచూ వివిధ కారణాలతో వాగ్వాదాలు జరుగుతున్నాయి. రద్దీ సమయంలో బస్సులో 140 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో తరచూ బస్సు ఆపాల్సి వస్తుండటంతో తీవ్రఒత్తిడికి గురవుతున్నారు. కొన్నేళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ల నియామకం చేపట్టకపోవడంతో ఉన్న వారే విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది తమ ఇష్టప్రకారమే అదనపు డ్యూటీలు చేస్తున్నారు. దీనికిగాను రూ.1000 వరకు సంస్థ చెల్లిస్తోంది. అయితే అనేకమంది పనిఒత్తిడి కారణంగా అనారోగ్యాల పాలవుతున్నారు. దీనిని నివారించేందుకు ఆర్టీసీలో నియామకాలు చేపట్టాల్సి ఉంది.
యూనియన్లు లేకపోవడంతో...
బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఆర్టీసీ యూనియన్లకు బాధ్యతలు లేకపోవడం, ఎన్నికలు లేకపోవడతో డ్రైవర్ల సమస్యలు, ఇతర కార్మికుల సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. యూనియన్లు ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చి పరిష్కరించుకునే వారు. ఆర్టీసీలో పనిభారం పెరిగి డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రశ్నించే గొంతులు లేవని డ్రైవర్లు వాపోతున్నారు. యూనియన్లు ఉంటే బస్సుల సంఖ్య, డ్రైవర్ల అవసరం, ఇతర సమస్యల పరిష్కారానికి అవకాశం ఉండేందంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యూనియన్లను తిరిగి పునరరుద్ధరిస్తారన్న నమ్మకం డ్రైవర్లలో ఉన్నా అది ఆచరణలోకి ఇంకా రాలేదు.
సంస్థ అభివృద్ధి కోసం డబుల్ డ్యూటీలు
డబుల్ డ్యూటీ చేయడం కష్టమైనా సంస్థ అభివృద్ధి కోసం చేస్తున్నాం. డ్రైవర్ల సంఖ్యను పెంచడంతో పాటు బస్సుల సంఖ్యను పెంచాలి. పనిభారం పెరగడంతో ఆరోగ్య సమస్యలూ వస్తున్నాయి. ఒక్కో డ్రైవర్ 11 గంటలకు పైగా చేయాల్సివస్తోంది. ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే మరింత పనిఒత్తిడి పెరుగుతుంది. యూనియన్లను పునరుద్ధరించాలి.
కొంపల్లి జమాల్‌గౌడ్, సీనియర్ డ్రైవర్
డ్రైవర్ల కోసం
గ్రాండ్ హెల్త్ కార్యక్రమం
సంస్థలో ఉద్యోగుల ఆరోగ్యం కోసం గ్రాండ్ హెల్త్ కార్యక్రమం చేపట్టాం. 45ఏళ్లు నిండిన డ్రైవర్లకు మూడేళ్లకోసారి ఆరోగ్యపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఏటా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరుతో వైద్యపరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నాం. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించడంతో పాటు ఔషధాలు కూడా అందజేస్తున్నాం.
కే జానిరెడ్డి, ఆర్‌ఎం, నల్లగొండ
Updated Date - Jan 24 , 2025 | 12:43 AM